Menu

Numaish: జేబుకు చిల్లు..ఫుడ్‌ కంపు.. అడుగడుగునా దోపిడి.. హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ మోసాలివే!

Lakshmi Aruna 2 months ago
Hyderabad’s biggest Numaish Exhibition 2026 prices hike

ఒకప్పుడు నూమాయిష్‌ అంటే కుటుంబంతో కలిసి వెళ్లే వార్షిక పండుగ. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందం.. పిల్లల నవ్వులు, స్ట్రీట్ ఫుడ్ రుచులు, చిన్న చిన్న కొనుగోళ్లు… ఇలా ప్రతి మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో ఉండే ఎంజాయ్‌మెంట్‌ అది. కానీ ఇప్పుడు? నూమాయిష్‌కి వెళ్లే ముందు జేబు పరిస్థితి చూసుకోవాల్సిన రోజులు వచ్చాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాలం మారింది, ధరలు పెరిగాయి అన్నది నిజమే. అయితే పెరగాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగితే అది ఇన్‌ఫ్లేషన్ కాదు… ప్రజలపై భారం వేయడమే అవుతుంది. నూమాయిష్‌కి చేరుకునేలోపే విజిటర్లకి మొదటి షాక్‌ పార్కింగ్ దగ్గరే ఎదురవుతోంది. బైక్ పార్కింగ్‌కు 60 రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆవేదన వినిపిస్తోంది. అదీ దగ్గరలో పార్కింగ్ కాకుండా దాదాపు 800 మీటర్లు నడవాల్సిన పరిస్థితి ఉంటే, అది సదుపాయం కంటే ఇబ్బందిగానే అనిపిస్తోందని పలువురు చెబుతున్నారు. కుటుంబంతో, చిన్నపిల్లలతో వచ్చిన వారికి ఇది మరింత కష్టంగా మారుతోంది.

లోపల అడుగుపెట్టగానే రేట్ల దాడి మొదలవుతోందని సందర్శకులు అంటున్నారు. ఎంట్రీ ఫీజు 50rs… నాలుగు మిర్చి బజ్జీలు 100 రూపాయలు, గోలీ సోడా 70 రూపాయలు, సాధారణ వాటర్ బాటిల్ 30 రూపాయలు, ఏ కూల్‌డ్రింక్ తీసుకున్నా దాదాపు 100 రూపాయల వరకు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బయట సగం ధరకు దొరికే వస్తువులు ఇక్కడ ఇంత ఖరీదుగా ఉండటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక పానీపూరీ కూడా రోడ్డుపక్కన 20–30 రూపాయలకు దొరికితే, నూమాయిష్‌లో మాత్రం 150 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది ఎంత దారుణం?

పిల్లల ఎంజాయ్‌మెంట్ కూడా ఇప్పుడు లగ్జరీగా మారుతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకప్పుడు 50–60 రూపాయలున్న రైడ్స్.. ఇప్పుడు పర్ హెడ్ 150 రూపాయల వరకు చేరాయని సందర్శకులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి, పెద్దలకి ఒకటే ధర ఉండటం తల్లిదండ్రులకు అసహనాన్ని కలిగిస్తోంది. కుటుంబంతో వెళ్లి రెండు మూడు రైడ్స్ ఎక్కితేనే వందలు కాదు వేల రూపాయలు ఖర్చవుతున్నాయని వారు అంటున్నారు.

అత్యధిక ధరలు తీసుకుంటే కనీసం నాణ్యత అదే స్థాయిలో ఉండాలని ఆశించడం సహజం. అయితే కొన్ని ఫుడ్ స్టాల్స్ వద్ద హైజిన్ ప్రశ్నార్థకంగా కనిపిస్తోందని, రుచి కూడా ఆశించినంతగా లేదని పలువురు సందర్శకులు పేర్కొంటున్నారు. ధరలు ఫైవ్‌స్టార్ స్థాయిలో ఉంటే, క్వాలిటీ మాత్రం ఆ స్థాయిలో లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వీటన్నిటికంటే ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం సోషల్ మీడియా హైప్‌. ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయన్సర్లు “మస్ట్ విజిట్”, “అద్భుతం”, “ఫ్యామిలీకి బెస్ట్ ప్లేస్” అంటూ రివ్యూలు ఇస్తున్నారు, కానీ.. అసలు పరిస్థితులపై ఎంతవరకు నిజాయితీగా మాట్లాడుతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వ్యూస్ కోసం వచ్చే ఈ ఓవర్ హైప్ ప్రజలను తప్పుదారి పట్టించకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నూమాయిష్‌ ప్రత్యేకత ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండటమే. మధ్యతరగతి కుటుంబాలు భారం అనిపించకుండా వెళ్లగలగడం దాని అసలైన బలం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇది పండుగ కంటే హై-కాస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లా మారుతోందనే భావన కలుగుతోంది. సరైన పార్కింగ్ సదుపాయాలు, ఫుడ్ రేట్లపై కొంత నియంత్రణ, పిల్లలకి ప్రత్యేక ధరలు, నాణ్యతపై పర్యవేక్షణ… ఇవన్నీ అమలు చేస్తేనే నూమాయిష్ తన పాత గుర్తింపును నిలబెట్టుకోగలదు. లేకపోతే… ఒకప్పుడు ప్రజల పండుగగా నిలిచిన నూమాయిష్‌, కేవలం ఖరీదైన జ్ఞాపకంగా మిగిలిపోతుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ALSO READ: స్మశానంలో మొదలై, చరిత్రగా మారిన ఒక అమ్మ జీవితం.. సింధుతాయ్ సప్కల్ జీవన ప్రయాణం!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *