Menu

Life Style: 25ఏళ్లకే చనిపోయిన వ్యక్తులను 75ఏళ్ల వరకు ఎందుకు పాతిపెట్టరు?

Lakshmi Aruna 6 months ago
motivational quotes

“చాలామంది 25 ఏళ్లకే చనిపోతారు.. కానీ వాళ్లని 75 ఏళ్లకు పాతిపెడతారు…’ అదేంటి అనుకుంటున్నారా? దానికి అర్థం తెలుసుకోవాల్సిందే!

మనిషి జీవితంలో కొంత వయసు వచ్చేసరికి చాలామంది చనిపోతారు. చనిపోవటం అంటే ఊపిరి ఆగిపోదు.. గుండె కొట్టుకోవడమూ ఆగిపోదు.. వాళ్ళు శారీరకంగా బతికే ఉంటారు కానీ మానసికంగా జీవించడం మాత్రం ఆగిపోతుంది. బయటకు వారు నవ్వుతుంటారు, పనిచేస్తుంటారు, మాట్లాడుతుంటారు.. కానీ అంతర్లీనంగా వాళ్లలో బతుకుమీద ఆశ మాత్రం మెల్లగా చనిపోతుంది. కలలు కనడం కూడా మానేస్తారు. ‘నేను ఇప్పుడేమైనా కొత్తగా చేయగలనా?’ అని తమమీదే అనుమానం పెంచుకుంటారు. ‘సమాజం ఏమంటుందో?’ అనే భయం వారిని పీడిస్తుంది. రోజూ ఒకేలా నడుస్తున్న జీవితం… కొత్తదనాన్ని, ఉత్సాహాన్ని, ఆరాటాన్ని పూర్తిగా మింగేస్తుంది. అప్పుడు మనిషి బతికినే చచ్చినట్టే. “చాలామంది 25 ఏళ్లకే చనిపోతారు.. కానీ వాళ్లని 75 ఏళ్లకు పాతిపెడతారు…’ అనే మాటకు అర్థం ఇదే!

25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మనకు కలలు ఉంటాయి, ఉత్సాహం ఉంటుంది, ఎదగాలనే తపన ఉంటుంది. కానీ కాలం గడుస్తూ కొంతమంది ఆ కలలను గోడకు తగిలించి వేలాడదీస్తారు. అంటే వాళ్ళ ఆశలకు దండేసి దణ్ణం పెడతారన్నమాట. ఎందుకంటే విఫలం అవుతామేమో అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్నవాళ్లు ఏమంటారో అనే ఆలోచన వాళ్ళను కట్టేస్తుంది. అలా మనం మన కలలను చంపేస్తాం. కానీ జీవితం అలా ఆగిపోవడానికి కాదు.

జీవితం అంటే శ్వాస తీసుకోవడమే కాదు.. ప్రతి రోజు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగడం. వయసు పెరిగినంత మాత్రాన కలలు కనడం ఆగిపోవాలా? లేదు. నేర్చుకోవడంలో ఆలస్యం అనేది ఉండదు. మారడంలో భయం అవసరం లేదు. ఎందుకంటే జీవితం మన చేతుల్లో ఉంది. దాన్ని ఎలా మలచాలో మనమే నిర్ణయించాలి. విజయం సాధించిన వారు పుట్టుకతో గొప్పవారేమీ కాదు. వారు తమలోని ఆ జ్వాలను ఆరిపోనీవ్వరు. ఎన్నిసార్లు పడినా మళ్లీ లేస్తారు. మళ్లీ మొదలుపెడతారు. అదే నిజమైన జీవితం. 25 ఏళ్లకు మనసు చచ్చిపోయి.. 75 ఏళ్ల వరకు.. కేవలం శరీరం మాత్రమే బతికే జీవితం అసలు జీవితమే కాదు కాదు.. దానికి అర్థమే ఉండదు.

నిజంగా జీవించాలంటే, ప్రతి రోజు మనసులోని ఆ వెలుగును వెలిగించుకోవాలి. మనకు ఇష్టం ఉన్న పనిని చేయాలి. మన కలలను మళ్లీ తాకాలి. వాటిని తిరిగి వెలిగించాలి. ఒక చిన్న అడుగు అయినా ముందుకే వేయాలి. ఎందుకంటే జీవితం అంటే అదే. ప్రతి ఉదయం కొత్త ఆశతో లేచి, మన కలల దిశగా సాగిపోవడం. కాబట్టి, 25 ఏళ్లకే మనసును చంపేయకండి. 75 ఏళ్లు వచ్చే వరకు ప్రతి రోజూ కొత్తగా బతకండి. కలలు కనండి.. వాటిని నమ్మండి, ముందుకు సాగండి. ఎందుకంటే వయసు పెరగొచ్చు కానీ జీవం మాత్రం తగ్గకూడదు. జీవించండి.. కేవలం బతకకండి..!

ALSO READ: కన్నీటి చుక్కలో దాగిన శాంతి.. ఈ సమాజంపై ఓ మహిళ ఒంటరిగా గెలవగలదా?


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *