Menu

Petrol Price Hike:10 రోజుల్లో నాలుగో సారి పేలిన బాం*బు..కోట్లాది భారతీయులపై ధరల పిడుగు!

Lakshmi Aruna 2 weeks ago
petrol prices in india explained

దేశంలో మళ్లీ భారీ పేలుడు జరిగింది. అది సరిహద్దుల్లో కాదు.. అది నగరాలపై పడిన మిస్సైల్ కాదు. కానీ దాని ప్రభావం కోట్లాది భారతీయుల జేబులను చీల్చేస్తోంది. ప్రతి ఇంటి బడ్జెట్‌ను తగలబెడుతోంది. ఆ బాంబు పేరు పెట్రోల్ బాంబ్. కేవలం 10 వారాల్లోనే నాలుగోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 112 రూపాయలు దాటేయగా.. ఇక రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మే25న పెట్రోల్‌పై లీటర్‌కు 2.61 రూపాయలు, డీజిల్‌పై 2.71 రూపాయలను పెంచాయి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు.

✨ Quick Read

  • 10 వారాల్లో నాలుగోసారి ఇంధన ధరల పెంపు
  • హోర్ముజ్ ఉద్రిక్తతలతో క్రూడ్ షాక్
  • OMCsకు రోజుకు ₹1000 కోట్ల నష్టం

AI-assisted summary, newsroom reviewed

హోర్ముజ్ చుట్టూనే వివాదం ఎందుకు?

ఈ ధరల పెరుగుదల వెనుక అసలు కారణం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు. అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ చమురు మార్కెట్ కుదేలైంది. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ సముద్ర మార్గం ద్వారానే జరుగుతుంది. అక్కడ అంతరాయం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం వస్తుంది. ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది.

ఈ యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఒక దశలో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 125 డాలర్ల వరకు చేరింది. తరువాత కొంత తగ్గినా ఇంకా ప్రమాద స్థాయిలోనే ఉంది. ప్రస్తుతం నార్త్ సీ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 98.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉండగా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 91.57 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు ప్రపంచ మార్కెట్లలో ఇంకా తీవ్ర అస్థిరత ఉందని చూపిస్తున్నాయి.

రోజుకు వెయ్యి కోట్ల నష్టం:

భారత్‌కు ఇది మరింత ప్రమాదకర పరిస్థితి. ఎందుకంటే దేశానికి అవసరమైన ముడి చమురులో దాదాపు 85 శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే దాని ప్రభావం నేరుగా భారత ప్రజలపై పడుతుంది. అందుకే ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వరుసగా ధరలు పెంచుతున్నాయి. ఇటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల కూడా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయి.

భారత్‌కు హోర్ముజ్ జలసంధి ఎందుకు అంత కీలకం?

భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో భారీ భాగం హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారానే వస్తుంది. అక్కడ యుద్ధం లేదా అంతరాయం ఏర్పడితే చమురు సరఫరా, ధరలపై నేరుగా ప్రభావం పడుతుంది.

పెట్రోల్ ధర పెరిగితే కూరగాయల ధరలు కూడా ఎందుకు పెరుగుతాయి?

భారత్‌లో సరుకు రవాణా ఎక్కువగా డీజిల్ వాహనాల ద్వారానే జరుగుతుంది. ఇంధన ధరలు పెరిగితే ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పెరిగి చివరికి కూరగాయలు, పాలు, బియ్యం వంటి నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పడుతుంది.

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి సంస్థలు తమిళనాడు, బెంగాల్‌, అస్సాం, కేరళ ఎన్నికల సమయంలో ఏకంగా 76 రోజుల పాటు ధరలను పెంచకండా ఉండిపోయాయి. ఆ వ్యవధిలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినా దేశంలో పెట్రోల్ ధరలు పెరగలేదు. ఈ సమయంలో ప్రజలకు కొంత ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రించింది. కానీ దీనివల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల నష్టాన్ని భరించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అంటే ఒక్క రోజు ఆలస్యం చేసినా భారీ నష్టం వస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. చివరికి ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకే ఇప్పుడు వరుసగా ధరలు పెంచుతున్నాయి.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ విషయంలో కూడా చర్యలు తీసుకుంది. మార్చి 27న పెట్రోల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని 10రూపాయలు తగ్గించింది. దీనికారణంగా కొంతకాలం ప్రజలకు ఉపశమనం లభించింది కానీ ఎన్నికల ఫలితాల తర్వాత అసలు సినిమా మొదలైంది. నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అంటే కేవలం వాహనదారుల సమస్య కాదు. దేశవ్యాప్తంగా ట్రక్కుల రవాణా ఖర్చులు పెరుగుతాయి. రైతుల వ్యవసాయ ఖర్చులు పెరుగుతాయి. సరుకుల డెలివరీ ఖరీదవుతుంది. ఆన్‌లైన్ వస్తువుల ధరలు పెరుగుతాయి. కూరగాయలు, పాలు, బియ్యం, మందులు ఇలా ప్రతి నిత్యావసర వస్తువుపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే భారత రవాణా వ్యవస్థలో డీజిల్ కీలక పాత్ర పోషిస్తుంది. డీజిల్ ధర పెరిగితే చివరికి మార్కెట్‌లో ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. దీన్నే ఆర్థిక నిపుణులు ద్రవ్యోల్బణం పెరగడం అంటున్నారు.

ఇప్పటికే ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలు ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చమురు ధర పెరిగిన కొద్దీ ఆటోమేటిక్‌గా రవాణా ఛార్జీలు పెరుగుతాయి. చివరికి ఆ భారమంతా సామాన్య ప్రజలపైనే పడుతుంది. మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో కొంత ఆశ కనిపిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై వార్తలు రావడంతో చమురు ధరలు కొద్దిగా తగ్గాయి. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంటనే పరిష్కారం వచ్చే అవకాశాలు తక్కువేనని కామెంట్‌ చేయడంతో మార్కెట్‌లో ఇంకా భయం కొనసాగుతోంది. ఇక నిపుణుల అంచనాల ప్రకారం మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు తగ్గకపోతే భారత్‌లో పెట్రోల్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అదే జరిగితే రానున్న రోజుల్లో సామాన్యుడి బతుకు మరింత భారంగా మారడం ఖాయంగానే కనిపిస్తోంది.

ALSO READ: ఓవెన్‌లోంచి వస్తున్న వేడి ఆవిరిలా మగ్గిపోతున్న భారతం.. ఈ భారీ ఉష్ణోగ్రతలకు కారణాలేంటి?


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *