దేశంలో మరోసారి ట్రాన్స్‌జెండర్ హక్కులపై పెద్ద చర్చ మొదలైంది. ఒక చట్ట సవరణ ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారింది. ట్రాన్స్‌జెండర్ హక్కులను రక్షించేందుకు తీసుకొచ్చిన చట్టమే ఇప్పుడు వారి గుర్తింపును తగ్గించేలా మారుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ప్రకారం ప్రతి వ్యక్తికి తన లింగ గుర్తింపును స్వయంగా నిర్ణయించుకునే హక్కు ఉంది. అదే హక్కును ఇప్పుడు కొత్త సవరణ బలహీనపరుస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సవరణ అమలులోకి వస్తే ట్రాన్స్‌మెన్, నాన్‌బైనరీ వ్యక్తులు లాంటి అనేక లింగ వైవిధ్య గుంపులు చట్టపరంగా కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు స్వీయ గుర్తింపును తొలగించి వైద్య పరీక్షలు, అధికారుల అనుమతులు తప్పనిసరి చేసే విధానాన్ని కూడా ఇందులో ప్రతిపాదించారు. ఇంతకీ ఈ కొత్త ట్రాన్స్‌జెండర్ సవరణ బిల్లు ఏంటి? ఇందులో ఏ మార్పులు ఉన్నాయి? అవి ఎందుకు ఇంత పెద్ద వివాదానికి దారి తీస్తున్నాయి?
ముందుగా ఓసారి 2014 సుప్రీంకోర్టు తీర్పును అర్థం చేసుకోవాలి. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన నల్సా తీర్పు ట్రాన్స్‌జెండర్ హక్కుల చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. ఆ తీర్పులో లింగ గుర్తింపు వ్యక్తిగత స్వేచ్ఛకు చెందిన అంశమని, ప్రతి వ్యక్తికి తన జెండర్‌ను తానే నిర్ణయించుకునే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవప్రదమైన జీవితం లాంటి మౌలిక హక్కులతో ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పు తర్వాతే కేంద్ర ప్రభుత్వం 2019లో ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టంలో ట్రాన్స్‌మెన్, ట్రాన్స్‌విమెన్, జెండర్‌క్వీర్, ఇంటర్‌సెక్స్ వ్యక్తులు లాంంటి విభిన్న లింగ గుర్తింపులను విస్తృతంగా నిర్వచించారు. ముఖ్యంగా స్వీయ గుర్తింపుతో ఐడెంటి సర్టిఫికెట్ పొందే అవకాశం కూడా అందులో ఉండేది. ఇప్పుడు తీసుకొచ్చిన 2026 సవరణ బిల్లు ఈ వ్యవస్థలోనే పెద్ద మార్పులు ప్రతిపాదిస్తోంది.
కొత్త నిర్వచనం ప్రకారం ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు పొందే పరిధిని చాలా వరకు తగ్గించారు. కొన్ని సంప్రదాయ గుర్తింపులు మాత్రమే చట్టంలో కొనసాగుతాయని ప్రతిపాదించారు. ట్రాన్స్‌మెన్, ట్రాన్స్‌విమెన్, నాన్‌బైనరీ లాంటి గుర్తింపులు నిర్వచనం నుంచి తొలగించారన్న విమర్శలు వస్తున్నాయి. దీని వల్ల అనేక లింగ వైవిధ్య గ్రూపులు చట్టపరమైన గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మరొక పెద్ద మార్పు స్వీయ గుర్తింపు హక్కును తొలగించడం. 2019 చట్టం ప్రకారం ఒక వ్యక్తి అఫిడవిట్ ద్వారా తన లింగ గుర్తింపును నమోదు చేసుకునే అవకాశం ఉండేది. కానీ కొత్త సవరణలో ముందుగా వైద్య ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ బోర్డు పరిశీలన, వారి సిఫారసులు, జిల్లా అధికారుల అనుమతి లాంటి అనేక దశలు పూర్తయిన తర్వాత మాత్రమే గుర్తింపు సర్టిఫికెట్ పొందే అవకాశం ఉంటుంది. ఈ బిల్లులో ఉన్న కొన్ని శిక్షా నిబంధనలు కూడా చర్చకు దారి తీశాయి. నిజమైన అక్రమ రవాణా లేదా దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి కఠిన చట్టాలు అవసరమనే విషయంలో పెద్దగా చర్చ అవసరంలేదు కానీ చట్టంలోని పదజాలం విస్తృతంగా ఉండటం వల్ల ట్రాన్స్‌జెండర్లకు ఆశ్రయం ఇచ్చే కమ్యూనిటీ నెట్‌వర్కులు, సహాయక వ్యవస్థలు కూడా అనవసరంగా సమస్యల్లో పడే అవకాశం ఉందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు సుప్రీంకోర్టు ఇప్పటికే స్వీయ లింగ గుర్తింపును మౌలిక హక్కుగా గుర్తించిన పరిస్థితిలో ఆ హక్కును పరిమితం చేసే చట్టం నిలబడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లు చట్టంగా మారితే భవిష్యత్తులో కోర్టుల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ వివాదం ఒక చట్ట సవరణకే పరిమితం కాదు. ఇది వ్యక్తిగత గుర్తింపు హక్కులు, లింగ వైవిధ్యానికి సమాజం ఇచ్చే స్థానం, రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛలను ఎలా అర్థం చేసుకోవాలనే పెద్ద ప్రశ్నల చుట్టూ తిరుగుతోంది. అందుకే ఈ బిల్లు పార్లమెంట్‌లో ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొనుందనే అంశం ఆసక్తిని రేపుతోంది.
ALSO READ: ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారిన మహిళల నిరసనలు

నన్ను నాలా బ్రతకనివ్వని ఈ సమాజం నాకెందుకు? నిన్ను నీలాగే ప్రేమించు. నిన్ను నీలాగే గౌరవించు!
LGBTQ: పాత చింతకాయ పచ్చడి ప్రసంగాలు మానుకుంటే చాలా మంచిది..! వారి పట్ల ఇంత వివక్ష ఎందుకు?
LGBTQ: అణచివేతల చీకట్లో నిలబడ్డ వెలుగులు.. ప్రేమకు పరిధులుంటాయా? ఇది వినిపించని గొంతుల గర్జన!
LGBTQ: మరణించిన తర్వాత కూడా వారిపై వివక్షే.. అంతిమసంస్కారాల కోసం ‘గే’ నరకవేదన!