Menu

Gmail ID Change: మీ జీమెయిల్‌ ఐడీని మార్చుకునే ఛాన్స్.. డేటా కూడా డిలీట్ అవ్వదు!

Praja Dhwani Desk 2 months ago
how to change gmail id

ఎన్నో ఏళ్ల క్రితం పెట్టుకున్న జీమెయిల్ ఐడీని ఇప్పటికీ అలాగే వాడుతున్నారా..? పేర్లు మారిపోయాయి.. అవసరాలు మారిపోయాయి కానీ జీమెయిల్ మాత్రం అదే ఉందా? ఇప్పటివరకు ఒకసారి ఐడీ క్రియేట్ చేస్తే దాన్ని మార్చే అవకాశం ఉండేది కాదు. అందుకే చాలా మంది పాత మెయిల్ ఐడీలతోనే కొనసాగాల్సి వచ్చేది.

ఇప్పుడు అదే విషయంలో గూగుల్ కీలక మార్పు తీసుకొచ్చింది. అదే అకౌంట్‌ను కొనసాగిస్తూ జీమెయిల్ అడ్రెస్‌ను మార్చుకునే ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. అంటే పాత మెయిల్స్, డేటా ఏవీ పోకుండా కొత్త ఐడీకి మారే అవకాశం. ఇదే విషయాన్ని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది? ఏ లిమిట్స్ ఉన్నాయి?

ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే మీ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ కొత్తగా కావాలనుకున్న జీమెయిల్ పేరును సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అందుబాటులో ఉన్న పేర్లలో మీకు నచ్చినదాన్ని ఎంచుకుని మార్చుకోవచ్చు.

ఒకసారి మార్చిన తర్వాత మీ పాత జీమెయిల్ ఐడీ పూర్తిగా మాయమవ్వదు. అది మీ అకౌంట్‌కు లింక్‌గానే ఉంటుంది. అంటే ఎవరికైనా మీ పాత ఐడీ మాత్రమే తెలిసినా.. వారు పంపే మెయిల్స్ కూడా మీకే వస్తాయి. కొత్త ఐడీ, పాత ఐడీ రెండూ ఒకే ఇన్‌బాక్స్‌లోకి చేరుతాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది. మీరు వదిలేసిన పాత జీమెయిల్ ఐడీని మరెవరూ తీసుకోలేరు. అది మీ అకౌంట్‌కే రిజర్వ్‌గా ఉంటుంది. అంటే మీ పాత గుర్తింపును కూడా మీరు కోల్పోరు. అయితే ఈ ఫీచర్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయి. జీమెయిల్ అడ్రెస్‌ను తరచుగా మార్చే అవకాశం ఉండదు. ఒకసారి మార్చిన తర్వాత మళ్లీ మార్చాలంటే కనీసం ఒక సంవత్సరం వెయిట్ చేయాలి. మొత్తం జీవితకాలంలో కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా వ్యక్తిగత అకౌంట్లకు అందుబాటులోకి వస్తోంది.

ఆఫీస్ ద్వారా నిర్వహించే అకౌంట్లకు ఈ మార్పు చేయాలంటే అడ్మినిస్ట్రేటర్ అనుమతి అవసరం ఉంటుంది. ఇక గూగుల్ మరో కొత్త మార్పును కూడా తీసుకొస్తోంది. జీమెయిల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లు పెరుగుతున్నాయి. ముఖ్యమైన మెయిల్స్‌ను గుర్తించడం, టాస్క్‌లను హైలైట్ చేయడం, ట్రావెల్ లేదా బుకింగ్స్‌కు సంబంధించిన సమాచారం ఒకే చోట చూపించడం లాంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తానికి ఈ కొత్త ఫీచర్ వల్ల ఒక పెద్ద సమస్యకు పరిష్కారం దొరికినట్టే. పాత ఐడీతో ఇబ్బంది పడాల్సిన అవసరం తగ్గుతుంది.. కొత్త అవసరాలకు తగ్గట్టు జీమెయిల్‌ను మార్చుకునే అవకాశం వస్తుంది.

ALSO READ: కోచింగ్ అవసరమా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇదే!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *