Menu

FIRSTS | భారత్‌లో మొదటిసారి ‘నేను గే’ అని ప్రపంచానికి చెప్పిన వ్యక్తి ఎవరు?

Tri Ten B (Triya) 2 months ago
who is ashok row kavi

🏳️‍🌈 FIRSTS
Breaking Barriers. Making History.

1986..ముంబై..!

ఆ రోజుల్లో “గే” అనే పదాన్ని బహిరంగంగా పలకడానికే చాలామంది భయపడేవారు. కుటుంబం ఏమంటుందో, సమాజం ఎలా చూస్తుందో, ఉద్యోగం పోతుందేమో, స్నేహితులు దూరమవుతారేమో… ప్రతి భయం ఒక మనిషి జీవితాన్ని మౌనంలో బంధించేది. అలాంటి కాలంలో ఒక భారతీయుడు దేశం మొత్తం వినేలా ఒక నిజం చెప్పాడు.

“నేను గే.”

ఆ ఒక్క మాటతో ఆయన తన జీవితాన్నే కాదు… భారత LGBTQ ఉద్యమ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని కూడా ప్రారంభించాడు. ఆయనే అశోక్ రో కావి.

ఎవరీ అశోక్‌ రో కావి:

1947 జూన్ 1న ముంబైలో జన్మించిన అశోక్ రో కావి చిన్నప్పటి నుంచే తనలో మిగతా అబ్బాయిలకు భిన్నమైన భావాలు ఉన్నాయని గుర్తించారు. అయితే ఆ కాలంలో వాటికి పేరు కూడా తెలియదు. సమాధానాలు వెతుకుతూ కొంతకాలం సన్యాస జీవితాన్ని కూడా ఎంచుకున్నారు. చివరికి తనను తాను దాచుకుని బతకడం కంటే… తన నిజాన్ని అంగీకరించి జీవించడం గొప్పదని నిర్ణయించుకున్నారు. అదే నిర్ణయం తర్వాత ఆయన జీవితాన్నే మార్చేసింది.

1986లో ఒక ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశోక్ రో కావి బహిరంగంగా తాను గే అని ప్రకటించారు. భారత మీడియాలో ఒక వ్యక్తి తన సెక్సువల్‌ ఓరియన్‌టేషన్‌ గురించి ఇంత స్పష్టంగా మాట్లాడటం అదే తొలిసారి. ఆ ప్రకటనతో విమర్శలు వచ్చాయి. అవమానాలు ఎదురయ్యాయి. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే తనలాగే మౌనంగా జీవిస్తున్న వేలాది మంది కోసం మాట్లాడాల్సిన అవసరం ఉందని ఆయన నమ్మారు.

ఆ ఆలోచనే 1990లో మరో చరిత్రకు నాంది పలికింది. బాంబే దోస్ట్(Bombay Dost) పేరుతో భారత్‌లోనే తొలి LGBTQ మ్యాగజైన్‌ను ప్రారంభించారు. ఇంటర్నెట్ లేని కాలంలో ఆ మ్యాగజైన్ వేలాది మందికి ఒక అద్దంలా మారింది. “నేను ఒక్కడినే కాదు” అనే ధైర్యాన్ని ఎంతోమందికి ఇచ్చింది. దేశం నలుమూలల నుంచి లేఖలు రావడం ప్రారంభమైంది. తమ జీవితాలను తొలిసారి ఎవరో అర్థం చేసుకున్నారనే భావన ఎంతోమందిలో కలిగింది.

‘బాంబే దోస్ట్’ ఎందుకు భారత LGBTQ చరిత్రలో ప్రత్యేకం?

1990లో ప్రారంభమైన ‘బాంబే దోస్ట్’ భారత్‌లోనే తొలి LGBTQ మ్యాగజైన్‌గా గుర్తింపు పొందింది. ఇంటర్నెట్ అందుబాటులో లేని కాలంలో LGBTQ కమ్యూనిటీకి సమాచారం, అనుభవాలు, పరస్పర మద్దతు అందించిన అరుదైన వేదికగా ఇది నిలిచింది.

ది హమ్‌సఫర్ ట్రస్ట్ (The Humsafar Trust) ఏం చేస్తుంది?

ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ది హమ్‌సఫర్ ట్రస్ట్ LGBTQ+ కమ్యూనిటీ కోసం ఆరోగ్య సేవలు, HIV అవగాహన, మానసిక ఆరోగ్య సహాయం, న్యాయ సలహాలు, హక్కుల పరిరక్షణ, సామాజిక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న భారత ప్రముఖ సంస్థల్లో ఒకటి.

అక్కడితో ఆయన ప్రయాణం ఆగలేదు. 1994లో ది హమ్‌సఫర్‌ ట్రస్ట్ (The Humsafar Trust) స్థాపనలో కీలక పాత్ర పోషించారు. భారత్‌లో LGBTQ కమ్యూనిటీ కోసం పనిచేసిన తొలి పెద్ద సంస్థల్లో ఒకటిగా అది ఎదిగింది. ఆరోగ్యం, న్యాయ సహాయం, మానసిక ఆరోగ్యం, అవగాహన, హక్కుల కోసం ఆ సంస్థ చేసిన పని తర్వాతి తరాల ఉద్యమానికి బలమైన పునాది వేసింది.

ఈరోజు సోషల్ మీడియాలో వేలాది మంది ధైర్యంగా తమ ఐడెంటిని ప్రకటిస్తున్నారు. ప్రైడ్ పరేడ్‌లు జరుగుతున్నాయి. LGBTQ హక్కుల గురించి బహిరంగంగా చర్చ జరుగుతోంది. ఈ మార్పు ఒక్కరోజులో రాలేదు. ఒకప్పుడు ఒంటరిగా నిలబడి “నేను గే” అని చెప్పడానికి ధైర్యం చేసిన కొద్దిమంది వల్లే ఈ ప్రయాణం మొదలైంది. అశోక్ రో కావి అలాంటి గొంతుల్లో ఒకరు.

ALSO READ: ఒక క్రిస్టియన్ సెయింట్ చివరకు LGBTQ+ కమ్యూనిటికి ఐకాన్‌గా ఎలా మారాడు? 1700ఏళ్ల చరిత్ర!


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *