రోజులు మారతాయి. రాత్రులు ఒక్కొక్కటిగా కాలంలో కలిసిపోతాయి. కొత్త ముఖాలు జీవితంలోకి వస్తాయి. కొత్త మాటలు వినిపిస్తాయి. కాలం ముందుకు సాగిపోతూ మనిషిని కూడా తన వెంట తీసుకెళ్తుంది. చూసినప్పుడు జీవితం మారిపోయినట్టే అనిపిస్తుంది కానీ మనసు ఏ విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోదు. కొన్ని జ్ఞాపకాలు కాలంతో కలిసి కరిగిపోవు. ఎప్పుడో ఒకసారి ఒక పాట వినిపిస్తుంది. కారణం లేకుండానే గుండె ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ స్వరాల్లో ఎప్పుడో ఒకరి నవ్వు దాగి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రయాణంలో కూర్చుని బయటకి చూస్తుంటే మనసు దూరాల్ని కాదు జ్ఞాపకాల్ని లెక్క పెడుతుంది. ఎప్పుడో ఒకసారి తన చేతి వేళ్లు పట్టుకుని నడిచిన దారి గుర్తుకొస్తుంది. ఎప్పుడో ఒకసారి తన కౌగిలిలో ప్రపంచం చిన్నదైపోయిన క్షణం గుర్తుకు వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది.. కొన్ని బంధాలు ముగిసిపోవచ్చు కానీ వాటి గుర్తులు మాత్రం మనసులో ఎప్పుడూ పూర్తిగా మసకబారకుండా ఉంటాయి. వాళ్లు కనిపించకపోయినా వారి స్పర్శ మాత్రం మనసులో మిగిలిపోతుంది. అందుకే ప్రేమ చిత్ర విచిత్రమైనది. అది కొన్నిసార్లు గుండెను హాయిగా తాకుతుంది. కానీ అదే ప్రేమ కొన్నిసార్లు గుండెను భారం చేసి తీవ్రంగా నొప్పిస్తుంది. అయినా ఎందుకో ఆ బాధనే మనిషి మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవాలనుకుంటాడు. ఎంత విడ్డూరమో కదా!
కొన్నిసార్లు ఆ విడ్డూరం ఎక్కడ మొదలైందో గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. గుర్తు చేసుకుంటే పెద్ద పెద్ద కథలేవి కనిపించవు. చాలా చిన్న చిన్న క్షణాలే కనిపిస్తాయి. ఎవరో ఒకరి రాక కోసం మనసు ఎంత ఆత్రుతగా ఎదురుచూసిందో గుర్తుకు వస్తుంది. వారు కనిపించిన ఆ ఒక్క క్షణంలో గుండె ఒక్కసారిగా తేలికైపోయిన ఆ అనుభూతి గుర్తుకు వస్తుంది. వారితో కలిసి నడిచిన సాయంత్రాలు గుర్తుకొస్తాయి. ప్రేమకు పెద్ద ఘటనలు అవసరంలేదు.. ఇలాంటి సాధారణ క్షణాల్లోనే అది నెమ్మదిగా పెరుగుతుంది. ఎవరైనా దగ్గరగా ఉన్నప్పుడు మనసులో కలిగిన ఆ ప్రశాంతమైన ఆనందం.. చెప్పలేనంత మృదువుగా గుండెల్లో స్థిరపడిపోతుంది. ఆ క్షణాల్లో కాలం ఎంత నెమ్మదిగా కదిలిందో అప్పుడు అర్థంకాదు.. కానీ రోజులు గడిచిన తర్వాత అవే చిన్న క్షణాలు మనసులో నిలబడిపోతాయి. పెద్దగా ఏమీ జరగనట్టే అనిపించిన ఆ రోజులు, తర్వాత గుర్తు చేసుకుంటే జీవితంలోనే అత్యంత అందమైన భాగాలుగా కనిపిస్తాయి.
కొన్నిసార్లు ప్రేమ మనిషికి ఒక వింత పాఠం నేర్పుతుంది. మొదట్లో అది దగ్గరగా ఉండాలని కోరుకుంటుంది. మన రోజుల్లో, మన మాటల్లో, మన జీవితంలోనే ఆ మనిషి ఉండాలని అనిపిస్తుంది. కానీ కాలం కొన్నిసార్లు వేరే దారిని చూపిస్తుంది. అప్పుడు మనసు నెమ్మదిగా ఇంకో నిజాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెడుతుంది. ప్రేమ ఎప్పుడూ మన పక్కనే ఉండాలని కోరుకోదు. మనకు దగ్గరలో లేకపోయినా ఎక్కడో ఒక చోట వాళ్లు ఆనందంగా ఉన్నారనే ఆలోచన గుండెలో ఒక హాయిని కలిగిస్తుంది. ప్రేమను దగ్గరగా ఉండటంతోనే కొలవకూడదు.. దూరంగా ఉండి కూడా ప్రేమించవచ్చని తెలిసివస్తుంది. దూరం నుంచే వారి ఆనందాన్ని కోరుకోవడంలో అసలైన ప్రేమ లోతు తెలుస్తుంది.
కొన్నిసార్లు ప్రేమ మనిషికి చాలా కఠినమైన నిజాన్ని తెలిసేలా చేస్తుంది. దగ్గరగా ఉండాలని తపించిన మనసే ఒక రోజు దూరాన్ని అంగీకరించడం నేర్చుకుంటుంది. మొదట అది ఓటమిలా అనిపిస్తుంది. గుండెకి భారంగా మారుతుంది. కానీ కాలం గడిచేకొద్దీ ఆ బాధలోనే మరో అర్థం దాగి ఉందని తెలుస్తుంది. మన దగ్గర బంధించి ఉంచుకోవాలని ఎవర్నీ కోరుకోకపోవడమే ప్రేమ. వారు సంతోషంగా ఉండే దారే వారికి సరైనదే అయితే ఆ దారినే మనసు మౌనంగా అంగీకరిస్తుంది.
అలాంటి ప్రేమ చాలా అరుదు. ఎందుకంటే మనిషి సాధారణంగా ప్రేమను సొంతం చేసుకోవాలనుకుంటాడు. హక్కుగా భావిస్తాడు., కానీ నిజంగా ప్రేమించినప్పుడు మాత్రం మనసు ఇంకోలా ఆలోచిస్తుంది. వారి నవ్వు ఎక్కడో దూరంలో వినిపించినా గుండె నిండిపోతుంది. వారి రోజులు ప్రశాంతంగా గడుస్తున్నాయనే ఆలోచనే మనసుకు సరిపోతుంది. దగ్గరగా లేకపోయినా, దూరం పెరిగినా, మనసులో ఒక చోట మాత్రం వారి ఆనందం కోసమే పరితపించేలా జీవితం మారిపోతుంది. ఆ ఆలోచనలు జీవితాంతం మనతో కలిసి నడిచే ఒక గుర్తుగా నిలిచిపోతాయి. ప్రేమ అప్పుడు ఒక సముద్రంలా అనిపిస్తుంది. పైపైకి చూస్తే అలలు గట్టిగా ఎగసిపడుతున్నట్టు కనిపిస్తాయి. కష్టాల కడలి అలలు గుండెను తాకుతూనే ఉంటాయి. కానీ లోతులో మాత్రం ఒక అపారమైన నిశ్చలం ఉంటుంది. ఆ లోతులో ద్వేషం ఉండదు, స్వార్థం ఉండదు, ఎవరినైనా బంధించాలనే కోరిక ఉండదు. అక్కడ ఉండేది ఒక్క భావమే.. వారు సంతోషంగా ఉండాలనే ఆశ మాత్రమే.
ప్రేమను చాలామంది కలిసి ఉండే బంధంగా మాత్రమే ఊహిస్తారు. కానీ నిజమైన ప్రేమ కొన్నిసార్లు అలా ఉండదు. మనసుకు ఎంతో దగ్గరైన వ్యక్తి మన జీవితంలో లేకపోయినా, వారు సంతోషంగా ఉండాలని కోరుకునే భావనలోనే ప్రేమ అసలు అర్థం కనిపిస్తుంది. మనతో కలిసి నడవకపోయినా, వారి ముఖంలో చిరునవ్వు తగ్గకూడదని కోరుకునే ఆ అనుభూతి. అప్పుడే తెలుస్తుంది ప్రేమ అంటే సొంతమనే భావన కాదు.. ఎవరో ఒకరి ఆనందాన్ని మన హృదయంలో దాచుకుని చూసే గొప్ప అనుబంధమే..! అదే అసలైన ప్రేమ. అదే నిజమైన ప్రేమ..!
ALSO READ: నిజమైన ప్రేమంటే ఏంటో మర్చిపోయిన తరానికి ఓ జ్ఞాపకం! ఇంతకీ ప్రేమంటే బాధ్యతా… లేదా భారమా?

Relationship Tips: మీ లైఫ్ పార్ట్నర్తో చెప్పకూడని నాలుగు విషయాలు.. ఇది సిక్రెసీ కాదు ప్రైవసీ!
Emotional Intelligence: ప్రపంచాన్ని నడిపించే ఒక్కే ఒక్క శక్తి ఎంపతి.. బండరాళ్ల లాంటి మనసులను కూడా కరిగించగలదు!
Relationships: బాధలో కలిసి కన్నీరు కార్చేదే నిజమైన ప్రేమ.. నీ మౌనాన్ని వినగలిగే ఆ ఒక్క మనసు ఎక్కడ దొరుకుతుంది?
Relationship: నిజమైన ప్రేమంటే ఏంటో మర్చిపోయిన తరానికి ఓ జ్ఞాపకం! ఇంతకీ ప్రేమంటే బాధ్యతా… లేదా భారమా?
Relationships: కన్నీటి చుక్కలో దాగిన శాంతి.. ఈ సమాజంపై ఓ మహిళ ఒంటరిగా గెలవగలదా?
Single Mother: భయం మధ్య బతికిన ధైర్యం… ఇద్దరు పిల్లల కోసం ప్రపంచంతో పోరాడిన ‘నిర్భయ’!