Menu

Menstrual Leave: ఈ దేశాల్లో మహిళలకు నెలసరి సెలవు.. లిస్ట్‌లో మీరు ఊహించని పేరు!

Praja Dhwani Desk 3 months ago
menstrual leave

జాబ్ చేసే మహిళలకు మెన్‌స్ట్రువల్ లీవ్ ఇవ్వాలా? ఈ అంశంపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. మెన్‌స్ట్రువల్ లీవ్‌ను తప్పనిసరి చేయాలనే పిటిషన్‌పై విచారణ జరుపుతున్న సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీశాయి.

అలాంటి చట్టం తీసుకొస్తే మహిళల ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు. కంపెనీలు మహిళలను నియమించడంలో వెనుకడుగు వేయవచ్చని కూడా అభిప్రాయపడ్డారు. ఇది కాస్త బిగ్‌ డిబెట్‌కు కారణమైంది. అయితే నిజంగా మెన్‌స్ట్రువల్ లీవ్ ఎందుకు అవసరం? ప్రపంచంలోని ఇతర దేశాలు ఈ విషయంలో ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నాయి?

మెన్‌స్ట్రువల్ లీవ్ అనే ఆలోచన కొత్తది కాదు. ప్రపంచంలోని కొన్ని దేశాలు చాలా కాలం క్రితమే ఈ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1947లో జపాన్ ఈ విషయంలో ముందడుగు వేసింది. అక్కడ పని చేసే మహిళలకు నెలసరి సమయంలో సెలవు తీసుకునే హక్కు కల్పించారు. దీన్ని ‘సెయిరి క్యుకా’ అని పిలుస్తారు. అయితే ఈ సెలవు పెయిడా, ఆన్‌-పెయిడా అన్నది కంపెనీల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. 1948లో ఇండోనేషియా కూడా ఇలాంటి విధానాన్ని అమలు చేసింది. అక్కడ మహిళలకు ప్రతి నెల రెండు రోజుల పెయిడ్ లీవ్‌తీసుకునే అవకాశం ఉంది. ఇటు దక్షిణ కొరియాలో కూడా మెన్‌స్ట్రువల్ లీవ్‌కు చట్టబద్ధ గుర్తింపు ఉంది. అక్కడ మహిళలకు నెలకు ఒక రోజు సెలవు ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ సెలవు తీసుకోకపోతే కంపెనీలు అదనపు చెల్లింపు కూడా ఇస్తాయి.

ఆఫ్రికాలోని జాంబియా కూడా ఈ విషయంలో ప్రత్యేక విధానం అమలు చేస్తోంది. అక్కడ దీన్ని స్థానికంగా ‘మదర్స్ డే’ అని పిలుస్తారు. మహిళలు ప్రతి నెల ఒక రోజు సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది మహిళల ఆరోగ్య అవసరాలను గుర్తించిన విధానంగా భావిస్తారు. తైవాన్‌లో కూడా మెన్‌స్ట్రువల్ లీవ్‌కు చట్టబద్ధత ఉంది. అక్కడ మహిళలు సంవత్సరానికి మూడు రోజుల వరకు ఈ సెలవు తీసుకోవచ్చు.

అదే సమయంలో వియత్నాంలో మరో ప్రత్యేక విధానం అమల్లో ఉంది. అక్కడ మహిళలు నెలసరి సమయంలో రోజుకు 30 నిమిషాల అదనపు విశ్రాంతి తీసుకోవచ్చు లేదా అవసరమైతే మూడు రోజుల వరకు సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక యూరప్‌లో ఈ విధానాన్ని అధికారికంగా అమలు చేసిన తొలి దేశం స్పెయిన్.

2023లో స్పెయిన్ ప్రభుత్వం మెన్‌స్ట్రువల్ లీవ్ చట్టాన్ని ఆమోదించింది. తీవ్రమైన నొప్పితో బాధపడే మహిళలకు మూడు నుంచి ఐదు రోజుల వరకు సెలవు తీసుకునే అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఈ సెలవుల ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. ఇలా చేయడం వల్ల కంపెనీలు మహిళలను నియమించడంలో వెనుకడుగు వేయకుండా ఉండాలనే ఉద్దేశం. అయితే మెన్‌స్ట్రువల్ లీవ్ అంశంపై ప్రపంచవ్యాప్తంగా రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒకవైపు మహిళల ఆరోగ్య అవసరాలను గుర్తించి ప్రత్యేక సెలవులు ఇవ్వాలని కొందరు వాదిస్తుంటే, మరోవైపు ఇలాంటి విధానం ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని మరో వర్గం భావిస్తోంది.

ఇండియాలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు అయ్యేలా ఎలాంటి మెన్‌స్ట్రువల్ లీవ్ చట్టం లేదు. అయితే కొన్ని ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగినులకు ప్రత్యేకంగా ఈ సెలవులను అనుమతిస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలు కూడా విద్యార్థినులకు ఈ సౌకర్యాన్ని కల్పించడం ప్రారంభించాయి. ఇప్పుడీ అంశం సుప్రీంకోర్టులో చర్చకు రావడంతో దేశవ్యాప్తంగా మరోసారి పెద్ద డిబేట్ మొదలైంది. మహిళల ఆరోగ్య అవసరాలు, ఉద్యోగ అవకాశాలు రెండింటి మధ్య బ్యాలెన్స్‌ చేయడం ఎలా అనే అంశంపై ఎవరి అభిప్రాయాలు వాళ్లు వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: ఆ 6 దేశాల్లో ప్రజాస్వామ్యం ఎందుకు లేదు? గల్ఫ్‌ దేశాలను వణికిస్తున్న ఇరాన్-ఇజ్రాయెల్ వార్..!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *