Menu

Trump Tariff Plans: ఇండియా నెత్తిన ట్రంప్‌ పిడుగు.. ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన ప్రెసిడెంట్!

Praja Dhwani Desk 1 year ago
donald trump tariff plan

‘అమెరికాకు హాని చేసే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తాం..’ ఇండియా(India), చైనా(China), బ్రెజిల్‌(Brazil) పేర్లను ప్రస్తావించి మరీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(donald trump) పేల్చిన భారీ బాంబు ఇది. గతంలో ఎన్నడూ లేని విధంగా, సంప్రాదాయానికి భిన్నంగా డెమొక్రటిక్‌ పార్టీని పక్కనపెట్టి మరీ భారతీయ ఓటర్లు ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీకి ఓటు వేసి ట్రంప్‌ గెలుపులో కీలక పాత్ర పోషించారు. తీరా ట్రంప్‌ గెలిచిన తర్వాత ఇండియాపై రోజుకొక హైడ్రోజన్‌ బాంబు పేల్చుతున్నారు. అమెరికా పౌరులకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ని రద్దు చేస్తానని ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్‌ అదే సమయంలో ఇతర దేశాలపై భారీగా టారిఫ్‌లు విధిస్తానని కుండబద్దలు కొట్టారు. ఇంతకీ ట్రంప్‌ చెప్పింది సాధ్యమేనా? ఇది తెలుసుకోవాలంటే ఓ సారి ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లాలి.

అమెరికా చరిత్రలో స్వర్ణయుగం

1870-1913 మధ్యకాలం అమెరికా చరిత్రలో ఓ Golden Era. డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు అవే రోజులకు అమెరికా తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నారు. అందుకే నాటి ఆర్థిక విధానాలనే మళ్లీ ప్రవేశపెడతానని చెబుతున్నారు. నాటి ఆర్థిక వ్యవస్థ మొత్తం టారిఫ్‌ల ఆధారంగానే నడిచేది. అమెరికా ఫెడరల్ ఆదాయానికి ప్రధాన వనరుగా టారిఫ్‌లు ఉండేవి. దిగుమతులపై అమెరికా అధిక సుంకాలు విధించిన కాలమది. విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై అధిక టారిఫ్‌లు విధించడం ద్వారా అమెరికా తమ పరిశ్రమలను రక్షించుకుంది. అదేసమయంలో వచ్చిన ఇండస్ట్రియల్ రివల్యూషన్ ప్రభావంతో ఉక్కు, రైల్వే, చమురు లాంటి పరిశ్రమలు అమెరికా వ్యాప్తంగా విస్తరించాయి. ఆ కాలంలో అమెరికాకు యూరప్ నుంచి అనేకమంది వలసదారులు రావడంతో కార్మిక వనరులు పెరిగాయి. అందుకే ఆ నాడు పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందాయి. నాడు అంతర్జాతీయ వాణిజ్యంపై అంతగా ఆధారపడని అమెరికా.. స్వయం సమృద్ధి లక్ష్యంగా ఎంతో పురోగతి సాధించింది. అయితే అప్పుడు, ఇప్పుడు ఒకటి కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. ట్రంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రద్దు ఐడియా, ఇతర దేశాలపై టారిఫ్‌ల పెంపు ప్రతిపాదన వర్కౌట్ కాదని బల్ల గుద్ది చెబుతున్నారు.

అప్పుడూ, ఇప్పుడూ ఒక్కటేనా?

1913 ముందు వరకు అమెరికా టారిఫ్‌ల ద్వారా ప్రధానంగా ఆదాయం పొందింది. 1913లో 16వ సవరణ ద్వారా ఫెడరల్ ఆదాయపు పన్ను ప్రవేశపెట్టే ముందు వరకు టారిఫ్‌లు, ఎక్సైజ్ పన్నులు అమెరికాకు ప్రధాన ఆదాయ వనరులు. ఆ తర్వాత ప్రపంచం మారుతూ వచ్చింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య విధానాలు, ప్రభుత్వ ఖర్చులు కూడా మారుతూ వచ్చాయి. అప్పటికీ, ఇప్పటికీ చాలా మారింది. నిజానికి గ్లోబలైజేషన్ కారణంగా అమెరికా అంతర్జాతీయ వాణిజ్యంపై ఎక్కువగా ఆధారపడుతోంది. దిగుమతులపై అధిక టారిఫ్‌లు విధిస్తే ధరలు పెరిగి అది వినియోగదారులకు భారం అవుతుంది. అంటే ఇతర దేశాల ప్రొడక్ట్స్‌ను అమెరికన్లే కొనుగోలు చేయలేని స్థితి వస్తుంది. అటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు టెక్నాలజీ, దాని అనుబంధ పరిశ్రమలు ఎంతో ముఖ్యమైనవి. ఇవి గ్లోబల్ మార్కెట్‌తో లింకై ఉంటాయి. టారిఫ్‌ల పెంపు వల్ల కంపెనీల వ్యయాలు పెరుగుతాయి. ఇక 1870-1913 మధ్య కాలంలో అమెరికా ప్రభుత్వం ఖర్చులు తక్కువగా ఉండేవి. సంక్షేమ పథకాలు ఊసే లేదు. దేశ ప్రజల అవసరాలను ప్రభుత్వం చూసుకునే అవసరం పెద్దగా ఉండేది కాదు. ఇక ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ఖర్చులు భారీగా పెరిగాయి. ఆరోగ్యం, సోషల్‌ సెక్యూరిటీ, విద్య, మిలటరీ కోసం ఆదాయం అవసరం. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ను రద్దు చేసి కేవలం ఇతర దేశాలపై విధించే టారిఫ్‌ల ద్వారా మాత్రమే ఈ ఖర్చులను సమకూర్చడం అసాధ్యం.

అధిక ద్రవ్యోల్బణ ముప్పు

ఇక దిగుమతులపై టారిఫ్‌లు పెంచితే, ఇతర దేశాలు ప్రతీకార చర్యలకు దిగుతాయి. అమెరికా ఎగుమతులపైనా అవి టారిఫ్‌లు విధిస్తాయి. ఇది అమెరికా వ్యాపారాలను నాశనం చేస్తుంది. అటు ఆదాయపు పన్ను లేకపోతే ప్రభుత్వానికి తగినంత డబ్బు రాదు. అప్పుడు సంక్షేమ పథకాలు నిలిపివేయవలసి వస్తుంది. ఇది పేద ప్రజలను రోడ్డున పడేలా చేస్తుంది. అటు ట్రంప్ ప్రతిపాదించిన External రెవెన్యూ సర్వీస్ అనేది దిగుమతులపై టారిఫ్‌లు, సుంకాలు, ఇతర ఆదాయాలను సేకరించే ప్రత్యేక సంస్థ. దీని ద్వారా విదేశాల నుంచి భారీగా ఆదాయం సమకూరుతుందని ఆయన భావిస్తున్నారు. కానీ వీటి అమల్లో ఉండే సవాళ్లు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలప్రభావం లాంటి అంశాలను ట్రంప్‌ ఆలోచించడంలేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టారిఫ్‌లు పెరగడం ద్వారా దిగుమతుల ధరలు పెరిగి.. అది వినియోగదారులకు నడ్డి విరుస్తుంది. దీని కారణంగా ద్రవ్యోల్బణం పెరగవచ్చు. అదేవిధంగా, పన్ను కోతల ద్వారా ప్రజల వద్ద డబ్బు పెరగడంతో వినియోగమూ పెరగవచ్చు. ఇది కూడా అటు తిరిగి ఇటు తిరిగి ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్‌ ప్రతిపాదించిన విధానం ఫైనల్‌గా అమెరికాను తీవ్ర కష్టాల్లో, నష్టాల్లో పడేస్తుంది.

చూస్తూ ఊరుకోరు కదా

ట్రంప్‌ మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఇతర దేశాలపై భారీగా సుంకాలు విధిస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. తమ పౌరుల నుంచి ట్యాక్స్‌ కలెక్ట్ చేయకుండా కేవలం ఇతర దేశాలపైనా టారిఫ్‌ విధిస్తే అమెరికాకు స్వర్ణయుగం వస్తుందని భ్రమపడుతున్నారు. అమెరికా ఫస్ట్ అనే విధానాన్ని బలంగా పాటించాలని కంకణం కట్టుకున్న ట్రంప్‌ తన ఆలోచనలతో చర్యలతో అమెరికాను లాస్ట్‌లో పడేసేలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాకు ఏ మాత్రం హాని తలపెట్టని ఇండియాపై ఇప్పటికీ రెండుసార్లు నోరు పారేసుకున్నారు ట్రంప్‌. బ్రిక్స్‌ దేశాలు ప్రతిపాదించిన డాలర్‌ ఆల్టెర్‌నెట్‌ కరెన్సీకి ఇండియా నేరుగా మద్దతు ఇవ్వకున్నా భారత్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాడు సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడేమో ఇండియాను హానికరమైన దేశమంటూ నోరుజారారు. ట్రంప్‌ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తమ దేశంపై అనవసర, అదనపు, ఆర్భాటపు సుంకాలు విధిస్తే ఏ దేశమైనా అమాయకంగా చూస్తూ ఊరుకోదు. Tit for Tat ఉంటుంది. 2018లో చైనా అమెరికాకు అలానే రిటర్న్‌ టారిఫ్‌ గిఫ్ట్‌ ఇచ్చిపడేసింది. ఈ సారి చైనాతో పాటు మరికొన్ని దేశాలూ అలానే చేయవచ్చు..!

ఇది కూడా చదవండి: సీ-సెక్షన్‌ ఆపరేషన్లకు క్యూ కడుతున్న భారతీయులు.. అమెరికాలో అసలేం జరుగుతోంది?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *