Menu

Youtube Rama Nandana: అందుకే యూట్యూబ్‌లో ఫేమ్‌ని చూసి గుడ్డిగా నమ్మకూడదని చెప్పేది!

Lakshmi Aruna 2 months ago
youtube nandu world scam

Nandu World: యూకేలో నివసిస్తున్న ప్రముఖ తెలుగు యూట్యూబర్ రమా నందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్‌పై మోసం ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. విదేశీ ఉద్యోగాలు, వీసా రెన్యూవల్‌లు, స్పాన్సర్‌షిప్ డాక్యుమెంట్లు ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీసు దర్యాప్తులో ఉంది.

ఫిర్యాదు వివరాల ప్రకారం, గతేడాది నవంబర్‌లో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన శివక్రాంతి కుమార్ ఈ ఫిర్యాదు చేశారు. లండన్‌లో చదువుకుంటున్న సమయంలో తనకు పరిచయమైన మధుకర్, తన వీసా రెన్యూవల్‌తో పాటు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ అందిస్తానని, తన భార్యకు కూడా యూకేలో ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన ఆరోపించారు.

ఈ నేపథ్యంలో 2023లో డెస్టినీ కన్సల్టెన్సీకి సంబంధించిన రెండు బ్యాంకు ఖాతాలకు సుమారు రూ.15 లక్షలు బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ఈ కన్సల్టెన్సీ కార్యాలయాలు ఉన్నట్లు సమాచారం.

అయితే తరువాత తనకు అందించిన సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ నకిలీదని తేలిందని శివక్రాంతి కుమార్ ఆరోపించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా కేవలం రూ.2 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించారని తెలిపారు. ఈ కేసులో మధుకర్‌ను ఏ1గా, రమా నందనను ఏ2గా, మోహన్‌రావును ఏ3గా పోలీసులు చేర్చారు.

రమా నందన నిర్వహిస్తున్న నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందింది. కుటుంబ జీవితం, ప్రయాణాలు, షాపింగ్, యూకేలో రోజువారీ జీవనశైలికి సంబంధించిన వీడియోలతో ఆమెకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఈ కేసు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.

కొన్ని సోషల్ మీడియా పోస్టులలో ఉద్యోగాలు, వీసాలకు సంబంధించిన హామీల పేరుతో మరికొందరు కూడా డబ్బులు చెల్లించి మోసపోయి ఉండవచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు వ్యక్తులు ఒక్కొక్కరు రూ.20 లక్షల వరకు చెల్లించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా వెలువడలేదు.

మరోవైపు రమా నందన ఈ ఆరోపణలను ఖండించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందిస్తూ, కొందరు వ్యక్తిగత కక్షల కారణంగా తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాను గానీ, తన భర్త గానీ ఎలాంటి కంపెనీని నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. తమ పేర్లను దుర్వినియోగం చేస్తూ ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కేసుకు సంబంధించి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు నిందితులు కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థాన పరిశీలనలో ఉండగా, దర్యాప్తు కొనసాగుతోంది.


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *