Menu

Chiraiya: ‘చిరైయా’ వెబ్‌ సిరీస్‌ చూపించిన కఠిన నిజం..! ఆమె ‘వద్దు’ అంటే వద్దు అంతే..!

Lakshmi Aruna 3 months ago
Chiraiya review: Divya Dutta's show is an unflinching take on marital rape

ఒక రాత్రి… ఆమె చాలా అలసిపోయి ఉంది. శరీరం నొప్పితో విలవిలలాడుతుంది. మనసు ఇంకాస్త బరువుగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనులైనా, ఆఫీస్ ఒత్తిడైనా, ఎక్కడ ఉన్నా ఆమె బాధ్యతలు మాత్రం ఆగవు. అందరి కోసం పరుగులు తీస్తూ, నవ్వుతూ తన అలసటను తానే మింగేసుకుంటూ రోజు గడుస్తుంది. అలాంటి రోజు చివరికి చేరి రాత్రి వచ్చేసరికి ఆమె శరీరం నిద్రను, విశ్రాంతిని కోరుకుంటుంది. ఆ సమయంలో ఆమె చెప్పే పదం ‘వద్దు’ ఇది కేవలం ఒక మాట కాదు.. ఆమె శరీరం, ఆమె మనసు, ఆమె హద్దులు చెప్పే ఒక నిజం. కానీ ఆ మాటను భర్తలు పట్టించుకుంటారా? లేదా భార్య కాబట్టి ఆమె శరీరం తన హక్కు అనే భావనలో ఉంటున్నారా? ఇటీవల వచ్చిన చిరైయా(Chiraiya) వెబ్‌ సిరీస్‌ కూడా ఇదే అంశాన్ని ఆలోచించేలా చేస్తోంది. మన చుట్టూ జరుగుతున్న నిజాన్ని ఈ సిరీస్‌ కళ్లకు కట్టింది.

భార్య ‘వద్దు’ అంటే వద్దనేనా? ఆమె నిర్ణయానికి విలువుందా? మన సమాజంలో చాలా మంది మాట్లాడటానికి ఇష్టపడని ఒక విషయం ఉంది కానీ అది చాలా ముఖ్యమైనది. పెళ్లి అనేది ఇద్దరి మధ్య నమ్మకం, గౌరవం, ప్రేమ మీద నిలబడాల్సిన బంధం. కానీ అదే బంధంలో ఒకరికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఏదైనా జరుగుతుంటే.. అది సంబంధమా? లేక అన్యాయమా? లేదా అ*త్యాచారమా?

మనమొక విషయాన్ని ఒప్పుకోవాలి.. ఈ మౌనం సమాజం నేర్పిన మౌనం. చిన్నప్పటి నుంచే అమ్మాయికి ఓర్పు నేర్పిస్తారు, తట్టుకోవడం నేర్పిస్తారు, కుటుంబం కోసం తనను తాను తగ్గించుకోవడం నేర్పిస్తారు. అదే సమయంలో అబ్బాయికి ఒక మాట నేర్పరు.. ఆమె ‘వద్దు’ అంటే ఆగిపోవాలని చెప్పరు. ఎందుకంటే మనం పెంచింది మనుషులను కాదు.. పాత్రలను. భార్య అనే పాత్ర, భర్త అనే అధికారం. అక్కడే సమానత్వం మాయమైపోతుంది.

భార్యకి ఇష్టం లేకుండా భర్త బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని ‘మారిటల్ రే*ప్’ అంటారు. ఇక్కడ ముఖ్యమైన విషయం అంగీకారం(Consent). అంగీకారం ఒకసారి ఇచ్చేసిన హక్కు కాదు. అది ప్రతి సారి ఉండాలి. ఒక మహిళకు ఎప్పుడైనా ‘వద్దు’ అని చెప్పే హక్కు ఉంటుంది. పెళ్లి అయ్యింది కాబట్టి ఆమె ఎప్పుడూ ఒప్పుకోవాల్సిందే అనుకోవడం తప్పు. కానీ మన సమాజం అంగీకారాన్ని అర్థం చేసుకోవాలనే ప్రయత్నమే చేయదు.

ఎందుకంటే అంగీకారం అర్థం అయితే.. అధికారం కూలిపోతుంది. చాలా ఇళ్లలో పెళ్లి అనేది ప్రేమ కాదు… ఒక అనుమతి పత్రం లాగా మారిపోయింది. సె*క్స్‌కు లైసెన్స్‌ లాగా తయారైంది. ఈమె ‘నా భార్య’ అనే ఒక మాటతో ఆమె శరీరంపై ఆమెకే హక్కు లేకుండా పోతుంది. ఆమె అలసట కనిపించదు, ఆమె నొప్పి వినిపించదు. నెలసరి బాధ ఉన్నా పట్టించుకోరు. ఆమెకు నిద్ర కావాలన్నా, విశ్రాంతి కావాలన్నా వినేవారే ఉండరు.

ఇప్పటి చట్టాల ప్రకారం కూడా ఈ అంశాన్ని స్పష్టంగా నేరంగా గుర్తించలేదు. భారతీయ శిక్షాస్మృతి స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహితలో కూడా పెళ్లి సంబంధంలో అంగీకారం లేకపోయినా దాన్ని అ*త్యాచారంగా పరిగణించడంలో స్పష్టత లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక మహిళ తనే తన బాధను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.. అది కూడా తన ఇంట్లోనే.

ఇంతకీ ఈ మార్పు ఎందుకు రావడం లేదు? ఎందుకంటే మనం ఇంకా కుటుంబం అనే మాటను మహిళ కంటే పెద్దదిగా చూస్తున్నాం. ప్రభుత్వ వాదనలు కూడా చాలా సార్లు ఇదే దారిలో సాగాయి. పెళ్లి వ్యవస్థ కాపాడాలని.. దుర్వినియోగం జరుగుతుందనే అర్థంలేని కారణాలను చెబుతుంటారు. కానీ ఒక మహిళ తన శరీరం మీద తనకే హక్కు లేదని చెప్పే వ్యవస్థను కాపాడటం నిజంగా అవసరమా? ఒక బంధం నిలవాలంటే.. అందులో ఒకరి స్వేచ్ఛ త్యాగం కావాలా?

సంస్కృతి, ఆచారం, ధర్మం అనే మాటలు ఇక్కడ చాలా ప్రమాదకరంగా మారుతాయి. ఎందుకంటే ఇవి ప్రశ్నలు అడగకుండా ఆపేస్తాయి. ‘ఇది మన సంప్రదాయం’ అని చెప్పిన వెంటనే.. అన్యాయం కూడా పవిత్రంగా కనిపించడం మొదలవుతుంది. చాలా కాలంగా మనం ఒక ప్రమాదకరమైన ఆలోచనను నమ్ముతున్నాం.. భార్య శరీరం భర్తకు చెందుతుందని భావిస్తున్నాం. ఇది ప్రేమ కాదు.. ఇది అధికారం. ఇది ధర్మం కాదు.. ఇది నియంత్రణ. ఈ ఆలోచనలను ప్రశ్నిస్తే వెంటనే ‘సంస్కృతి మీద దాడి’ అని వితంతవాదం చేస్తారు. అసలు మహిళ శరీరాన్ని మనం ఒక మనిషిగా చూడడం లేదు. ఆమెకి కూడా అలసట ఉంటుంది, ఆమెకి కూడా నొప్పి ఉంటుంది. ఆ సమయంలో ఆమె ‘వద్దు’ అంటే ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం కాకుండా.. ఒక సాధారణ కారణంలా తీసిపారేస్తారు. అంటే ఆమె శరీరం ఆమెది కాదు అన్నట్టే కదా!

ఈ విషయం మీద న్యాయవ్యవస్థలో కూడా విభేదాలు కనిపించాయి. ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ముందు వచ్చిన మారిటల్ రేప్ కేసులో ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు చెప్పారు. ఒకరు దీన్ని నేరంగా గుర్తించాలన్నారు. మరొకరు ఇది చట్టసభ నిర్ణయించాల్సిన విషయం అన్నారు. అంటే చట్టం కూడా ఇంకా తేల్చుకోలేని స్థితిలో ఉంది. ఇప్పుడు ఈ అంశం భారత సుప్రీం కోర్టు ముందుంది. కానీ చట్టం ఆలస్యం చేసినా బాధ మాత్రం ప్రతి రోజూ కొనసాగుతోంది. కొంతమంది ప్రకారం మారిటల్ రే*ప్‌ను నేరంగా గుర్తిస్తే కుటుంబ వ్యవస్థ కూలిసోతుందట. కానీ అది నిజం కాదు. గౌరవం లేని బంధాలే కూలిపోతాయి. అంగీకారం లేని సంబంధాలు విరిగిపోతాయి.

చిరైయా(Chiraiya) లాంటి కథలు మనకు అసౌకర్యంగా అనిపించడానికి ఇదే కారణం. అవి మనం చూడకుండా ఉండాలని అనుకున్న నిజాలను నేరుగా చూపిస్తాయి. ఒక మహిళ మౌనం వెనుక ఉన్న అర్ధాన్ని వినిపిస్తాయి. చివరికి ఒక నిజం మాత్రం మిగులుతుంది. పెళ్లి అనేది అనుమతి కాదు.. అది గౌరవం. బంధం అనేది హక్కు కాదు.. అది బాధ్యత. వద్దు అంటే వద్దనే అర్థం.. అది పెళ్లి అయినా.. కాకపోయినా…!

ALSO READ: ట్రాన్స్‌జెండర్ల హక్కులను కాలరాస్తున్న కేంద్రం..! సమానత్వానికి తూట్లు!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *