Menu

America-Israel weapons crisis: ఆయుధాలు కొరతతో లబోదిబోమంటున్న అమెరికా-ఇజ్రాయెల్‌!

Praja Dhwani Desk 2 months ago
iran isreal america weapons war explained

ఆయుధాలను తెలివిగా వాడడమే యుద్ధంలో అసలుసిసలైన స్ట్రాటజీ..! ఈ విషయంలో ఇజ్రాయెల్‌-అమెరికా వెనుకబడినట్టుగా అనిపిస్తోంది. అవును..! ఎవరి దగ్గర ఎంతకాలం ఆయుధాలు మిగులుతాయన్నదే అసలు యుద్ధం. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధంలో మొదటి రోజుల్లోనే వందల సంఖ్యలో మిసైళ్లు ఆకాశాన్ని చీల్చాయి. వేల సంఖ్యలో డ్రోన్లు గాలిలో తిరిగాయి.. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది..మొదటి రోజు వందల్లో దాడులు చేసిన ఇరాన్… ఇప్పుడు పదుల్లోకి పడిపోయింది.. దాదాపు 90 శాతం వరకు మిసైల్ ప్రయోగాలు తగ్గినట్లు అంచనాలు చెబుతున్నాయి.

ఇటు అమెరికా, ఇజ్రాయెల్‌ పరిస్థితి కూడా ఇంతే. ప్రతి మిసైల్‌ను ఆపడానికి లక్షల రూపాయల్లో కాదు.. కోట్ల విలువైన ఇంటర్‌సెప్టర్లు వినియోగించాల్సి వస్తోంది.
ఒక్కో ఇంటర్‌సెప్టర్ ఖర్చు కోట్లలో ఉండటంతో నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. ఒకవైపు తక్కువ ఖర్చు డ్రోన్లు.. మరోవైపు ఖరీదైన రక్షణ వ్యవస్థలు..! ఇప్పుడు ఈ యుద్ధం ఒకే దిశలో కదులుతోంది..! ఇంతకీ మిసైళ్లు ఎవరి దగ్గర ముందుగా అయిపోతాయో వారు ఓడిపోయినట్టుగా భావించవచ్చా?

నిజానికి యుద్ధం మొదటి దశలో ఏ దేశమైనా ఎడాపెడా ఆయుధాలను ఉపయోగిస్తుంది. కానీ తర్వాత అదే యుద్ధం.. దేశాల సామర్థ్యాన్ని పరీక్షించడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు అదే దశలోకి ఈ యుద్ధం వచ్చేసింది. మొదటి రోజుల్లో భారీగా మిసైళ్లు, డ్రోన్లు ఉపయోగించిన తర్వాత ఇప్పుడు రెండు పక్షాలూ వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ఇది కేవలం వ్యూహ మార్పు మాత్రమే కాదు.. నిల్వలను కాపాడుకోవాల్సిన అవసరం కూడా. అమెరికా, ఇజ్రాయెల్‌కు అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. అవి చాలా ఖరీదైనవి. వాటిని పరిమిత సంఖ్యలోనే తయారు చేస్తారు. ముఖ్యంగా లక్ష్యాన్ని ఖచ్చితంగా తాకే ప్రెసిషన్ మిసైళ్లు, దీర్ఘశ్రేణి దాడి ఆయుధాలు ఎక్కువగా వినియోగిస్తే వాటిని వెంటనే రీప్లేస్ చేయడం సులభం కాదు. అందుకే మొదట భారీ స్థాయిలో దాడులు చేసిన తర్వాత ఇప్పుడు తక్కువ ఖర్చుతో పనిచేసే బాంబులు, దగ్గర నుంచి దాడి చేసే ఆయుధాల వైపు మారినట్టు కనిపిస్తోంది. ఇక రక్షణ వ్యవస్థల విషయానికి వస్తే ఇక్కడే అసలు ఒత్తిడి ఎక్కువగా ఉంది. మిసైల్‌ను అడ్డుకోవడానికి ఉపయోగించే ప్రతి ఇంటర్‌సెప్టర్ ఖరీదు చాలా ఎక్కువ. ఒక దాడిని అడ్డుకోవడానికి పలుమార్లు ఇంటర్‌సెప్టర్లు ప్రయోగించాల్సి వస్తుంది.

ఈ స్థాయి దాడులు ఎక్కువకాలం కొనసాగితే రక్షణ వ్యవస్థల నిల్వలపై ఒత్తిడి పెరగడం సహజం. అలా ఇది ఒక అసమాన యుద్ధంగా మారుతోంది. ఒకవైపు తక్కువ ఖర్చుతో తయారయ్యే డ్రోన్లు, మిసైళ్లు.. మరోవైపు వాటిని అడ్డుకునే ఖరీదైన టెక్నాలజీ.

దాడి చేయడం కంటే దాన్ని అడ్డుకోవడమే ఖరీదైన పరిస్థితి. ఇదే ఇప్పుడు సమీకరణాన్ని పూర్తిగా మార్చుతోంది. అమెరికా వద్ద పెద్ద మొత్తంలో ఆయుధ నిల్వలు ఉన్నా ఈ యుద్ధం ఒకే ప్రాంతంలో మాత్రమే జరుగడం లేదు. ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఒత్తిడులు ఉన్నాయి. అందుకే ఒకేసారి అన్ని చోట్ల ఈ స్థాయి వినియోగాన్ని కొనసాగించడం సవాలుగా మారుతుంది. ఇదే కారణంగా ఉత్పత్తి పెంచాల్సిన అవసరం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే నిరంతరం రక్షణ వ్యవస్థలపై ఆధారపడే దేశం కావడంతో ప్రతి దాడిని అడ్డుకోవాల్సిన బాధ్యత ఎక్కువ. అంటే అక్కడ వినియోగం ఇంకా వేగంగా జరుగుతుంది. లాంగ్‌ టర్మ్‌లో ఇది నిల్వలపై మరింత ఒత్తిడిని తీసుకురావచ్చు. చరిత్ర ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది.. గగనతల ఆధిపత్యం ఉన్నా యుద్ధం వెంటనే ముగిసిపోదు. గాజాలో, యెమెన్‌లో జరిగిన యుద్ధాలు ఇదే విషయాన్ని చూపించాయి.

కేవలం బాంబులు, మిసైళ్లు మాత్రమే ఫలితాన్ని నిర్ణయించవు. ఎంతకాలం ఆ దాడులను కొనసాగించగలిగామన్నదే కీలకం. ఇప్పుడు ఈ యుద్ధం కూడా అదే దిశలో కదులుతోంది. వేగంగా దాడి చేసే దశ దాటిపోయింది.. ఇప్పుడు నిల్వలను లెక్కించుకునే దశ మొదలైంది. ఒక్కో మిసైల్ విలువ.. ఒక్కో ఇంటర్‌సెప్టర్ ఖర్చు.. ఒక్కో దాడి వెనుక ఉన్న సామర్థ్యం.. ఇవే ఇప్పుడు యుద్ధాన్ని నిర్ణయించే అంశాలు.

ALSO READ: కోచింగ్ అవసరమా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇదే!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *