Menu

Barry Wilmore: ఫైటర్ పైలట్ నుంచి వ్యోమగామి వరకు… బుచ్ విల్‌మోర్ ప్రయాణం!

Tri Ten B (Triya) 1 year ago
barry wilmore life

286 రోజులు… అంతరిక్షంలో సాగిన ఒక సాహసగాథ. ప్రపంచం సునీతా విలియమ్స్‌ గురించే ఎక్కువగా మాట్లాడుకుంది.. ఆమె రాక కోసమే ఎక్కువగా ఎదురు చూసింది. కానీ ఈ ప్రయాణంలో మరో వేటగాడు ఉన్నాడు.. మరో కథ కూడా ఉంది. ఆ కథ బ్యారీ విల్‌మోర్ చుట్టూ తిరుగుతుంది. ఆయన్ను బుచ్‌ విల్‌మోర్‌ అని పిలుస్తారు. సునీతతో పాటు 9 నెలల పాటు International Space Stationలో గడిపారు బుచ్‌. భూమి కోసం చేసే అంతరిక్ష ప్రయాణంలో ప్రపంచం కొందరనే కీర్తించవచ్చు కానీ.. నాసా చరిత్రలో బుచ్‌ విల్‌మోర్‌ కథ ఎంతో ప్రత్యేకం.

సునీతతో బ్యారీ

సేమ్‌ టు సేమ్‌ సునీతా లాగే:

అమెరికా-టెనెస్సీలో పుట్టిన బుచ్‌.. చిన్నప్పటి నుంచి గాలిలో ఎగిరే విమానాలను ఎంతో ఇష్టంగా చూసేవాడు. ఆకాశాన్ని చూసినప్పుడల్లా… తన దారి అక్కడే ఉండాలని బుచ్‌కు అనిపించేది. స్కూల్లో మంచి స్పోర్ట్స్‌ ప్లేయర్‌! కాలేజీకి చేరిన తర్వాత కూడా గేమ్స్‌ను వదలిపెట్టలేదు. టెన్నెస్సీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతూ.. తన కాలేజీ ఫుట్‌బాల్ టీమ్‌ కెప్టెన్‌గా ఎన్నో రికార్డులు సృష్టించాడు బుచ్‌ విల్‌మోర్‌. అయితే గ్రౌండ్‌లో గెలిచిన విజయాలతోనే బుచ్‌ సరిపెట్టుకోని ఉంటే మనం ఈ రోజు అతని గురించి మాట్లాడుకునే వాళ్లం కాదేమో. అచ్చం సునీతా విలియమ్స్‌ లాగే బుచ్‌ కూడా నేవీలో తన కెరీర్‌ను మొదలుపెట్టారు. నేవి విమానాన్ని నడపడం ఆయన మొదటి లక్ష్యం. ఆ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. విమానాన్ని కంట్రోల్ చేయడం ఎంత అద్భుతంగా ఉంటుందో.. అదే విధంగా ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలే పోతాయి. కానీ బుచ్‌ ఎక్కడా వెనక్కి తగ్గలేదు.. అదరలేదు.. బెదరలేదు..! ఫైటర్ జెట్ పైలట్‌గా ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ విమానాన్ని నడిపారు బుచ్.

నేవీ టు నాసా:

అమెరికా నేవిలో చేరినప్పుడు తన జీవితంలో అత్యంత కఠినమైన శిక్షణ ప్రారంభమైంది. ప్రతి రోజూ ఓ కొత్త పరీక్ష! ప్రతి క్షణం.. ఓ కొత్త పోరాటం! అతని చేతుల్లో నిత్యం పవర్‌ఫుల్ యుద్ధ విమానాలు ఉండేవి. క్షణాల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పొరపాటు అనే మాటకు స్థానం లేకుండా బుచ్‌ విల్‌మోర్‌ 21 యుద్ధ మిషన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. ఆయన ప్రయాణం అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత నాసా వైపు బుచ్‌ అడుగులు పడ్డాయి. నేవీలో ఆయన నైపుణ్యం, పట్టుదల చూసిన నాసా బుచ్‌ను వ్యోమగామిగా ఎంపిక చేసింది.

యూ ఆర్ గ్రేట్:

2009లో తన తొలి అంతరిక్ష ప్రయాణాన్ని స్పేస్ షటిల్ అట్లాంటిస్ పైలట్‌గా ప్రారంభించారు. 2014లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో కీలక సభ్యుడిగా పని చేశాడు. అంతరిక్షంలో నాలుగు స్పేస్‌వాక్‌లు చేసి, మొత్తం 25 గంటల 36 నిమిషాలు బాహ్య అంతరిక్షంలో గడిపారు బుచ్‌విల్‌మోర్‌. తన జీవితంలో మరో మైలురాయి 2024లో సునీతా విలియమ్స్‌తో కలిసి ISSలో ప్రయాణించడం. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ మిషన్ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టిన బుచ్‌..అంతరిక్షంలోకి వెళ్లి మరొక సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటివరకు మొత్తం 464 రోజులు అంతరిక్షంలో గడిపారు బుచ్‌. ఈ ప్రయాణం.. ఈ విజయం.. ఒక్క రోజులో సాధించింది కాదు. కింద పడినా.. మళ్లీ లేచి ముందుకు వెళ్లడం ఆయన జీవన విధానం. తన లక్ష్యాన్ని చేరుకునే దిశలో బుచ్‌ విల్‌మోర్‌ నడిచిన ప్రతి అడుగు.. రేపటి తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకం!


ALSO READ: సునీతా జీవితం నేర్పిన పాఠం.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కథ!

 

 


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *