Menu

Pakistan: అక్కడ షియాలు కనిపిస్తే వెంటాడి మరీ చంపుతున్నారు.. పాకిస్థాన్‌లో పతాకస్థాయికి చేరిన వర్గపోరు!

Praja Dhwani Desk 2 months ago
why are shias community targeted in pakistan

పాకిస్థాన్‌లో ఆ వర్గంలో పుట్టడమే శాపంగా మారింది. షియా ముస్లింలను చంపడమే లక్ష్యంగా ఉగ్రదాడులు, బాంబు బ్లాస్టులు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న జరిగిన ఇస్లామాబాద్‌ మసీద్‌ ఆత్మాహుతి దాడి ఘటనైనా 2012లో రావల్పిండిలో షియాల ఊరేగింపుపై జరిగిన ఆత్మాహుతి బాంబు దాడి ఘటనైనా ఇదే విషయాన్ని చెబుతోంది. ఇంతకి పాక్‌లో షియాలు ఎందుకు లక్ష్యంగా మారుతున్నారు? ఈ హింస వెనుక ఎవరి హస్తముంది?

పాకిస్థాన్‌లో షియాలు ఎందుకు లక్ష్యంగా మారుతున్నారన్న ప్రశ్నకు ఒక్క కారణం లేదు. ఇది మతం, రాజకీయాలు, ఉగ్రవాదం, రాష్ట్ర వైఫల్యం లాంటి అంశాలు కలిసిన ఒక దీర్ఘ సంక్షోభం.

మొదట సంఖ్యలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. పాకిస్థాన్ జనాభాలో షియా ముస్లింలు దాదాపు 15 నుంచి 20 శాతం వరకు ఉంటారు. అంటే సుమారు 3.5 నుంచి 4 కోట్ల మంది. ప్రపంచంలోనే అతిపెద్ద షియా జనాభా ఉన్న దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. మానవ హక్కుల సంస్థల అంచనాల ప్రకారం 2000 సంవత్సరం తర్వాత నుంచి ఇప్పటివరకు కనీసం 2 వేల మందికి పైగా షియా ముస్లింలు లక్ష్యిత హత్యల్లో ప్రాణాలు కోల్పోయారు. కొన్ని స్వతంత్ర అధ్యయనాలు ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నాయి. ముఖ్యంగా బలోచిస్తాన్‌లోని హజారా షియాల పరిస్థితి మరింత భయానకంగా ఉంది. క్వెట్టా నగరంలోనే గత రెండు దశాబ్దాల్లో వెయ్యికి పైగా హజారా షియాలు హత్యకు గురయ్యారు. ఈ హింస వెనుక ప్రధానంగా సున్నీ అతి తీవ్రవాద సంస్థలే ఉన్నాయి. లష్కర్-ఏ-జాంగ్వీ, సిపా-ఏ-సహాబా పాకిస్థాన్, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ విభాగం లాంటి గ్రూపులు షియాలను మతద్రోహులుగా చిత్రీకరిస్తూ బహిరంగంగా చంపడాన్ని సమర్థించాయి. ఇవి కేవలం మాటలకే పరిమితం కాలేదు. మసీదులు, ఇమాంబారాలు, అషూరా ఊరేగింపులు, అంత్యక్రియలు కూడా దాడుల లక్ష్యాలయ్యాయి.

2012లో రావల్పిండిలో అషూరా ఊరేగింపుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 20 మందికి పైగా షియాలు చనిపోయారు. 2013లో క్వెట్టాలో జరిగిన రెండు భారీ బాంబు పేలుళ్లలో దాదాపు 200 మంది హజారా షియాలు ప్రాణాలు కోల్పోయారు. 2015లో షికార్పూర్ మసీదు దాడిలో 60 మందికి పైగా మరణించారు. 2017లో పరాచినార్ మార్కెట్ బాంబు దాడిలో 75 మంది చనిపోయారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ఇక ఈ దాడులు ఎందుకు ఆగడం లేదన్నదానికి ప్రభుత్వ వైఫల్యం పెద్ద కారణం. పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థలపై నిషేధాలు ఉన్నా అవే గ్రూపులు పేర్లు మార్చుకుని మళ్లీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. చాలా కేసుల్లో దోషులను పట్టుకోవడంలేదు. ఒకవేళ పట్టుకున్నా శిక్ష పడడంలేదు. దీంతో దాడులు చేసే వారికి భయం లేకుండా పోయింది. మరోవైపు ఈ దాడులకు మరో ప్రధాన కారణం ప్రాంతీయ రాజకీయాలు. సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య మత ఆధారిత శక్తి పోరు పాకిస్థాన్ లోపల ప్రతిబింబిస్తోంది. సున్నీ తీవ్రవాద గ్రూపులకు విదేశీ మద్దతు లభిస్తోందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వం స్పష్టంగా చర్యలు తీసుకోలేకపోయింది. ఇటు భద్రతా పరంగా చూస్తే దీని ప్రభావం దేశమంతా పడుతోంది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్న హింస చివరకు మొత్తం సమాజాన్ని అస్థిరంగా మారుస్తుంది. షియా ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించినా దాడులు ఆగడం లేదు. ప్రజలు తమ మతాన్ని దాచుకుని బతకాల్సిన పరిస్థితి వస్తోంది. కొందరు దేశం విడిచి వెళ్లిపోతున్నారు.

ఫిబ్రవరి 6న ఇస్లామాబాద్‌లో జరిగిన మసీదు దాడి ఈ సమస్య ఇంకా ముగియలేదని చెప్పడానికి పెద్ద ఎగ్జాంపుల్‌. దేశ రాజధానిలోనే 36 మంది షియా ప్రార్థకులు చనిపోతే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. నిజానికి ఇది కేవలం వర్గ ఘర్షణ మాత్రమే కాదు. ఇది పౌరుల భద్రతపై ప్రశ్న. ఒక దేశం తన కోట్ల మంది పౌరులను వారి వర్గం కారణంగా రక్షించలేకపోతే అది జాతీయ భద్రతా వైఫల్యమే. పాకిస్థాన్‌లో షియా ముస్లింలపై కొనసాగుతున్న ఈ లక్ష్యిత హింస ఆ దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద మౌన సంక్షోభాల్లో ఒకటిగా మారిందని చెప్పవచ్చు.
ALSO READ: కంటికి కనిపించని ప్రమాదం.. ముగ్గురు మైనర్ సిస్టర్స్‌ను చంపేసిన కొరియన్ ప్రపంచం..!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *