ఇప్పుడు బరువు పెరగడం కేవలం ఆరోగ్యానికి సంబంధించింది మాత్రమే కాదు. వ్యాపారానికి సంబంధించింది కూడా. మీ పొట్ట పెరిగితే… కొందరి బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతోంది. మీరు బర్గర్, పిజ్జా తింటే ఎవరెవరో బిలియనీర్లు అయిపోతారు. మీరు మిర్రర్‌లో మీ లావెక్కిన రూపాన్ని చూసి బాధపడుతున్నప్పుడు.. ఔషధ కంపెనీలు ఆనందంగా డబ్బులు లెక్కిస్తుంటాయి..! అవును..! ఇది నిజం! స్థూలకాయం.. అంటే Obesity ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్‌గా మారిపోయింది.
ఆ ఇంజక్షన్లు మంచివేనా?
ఇండియాలో స్థూలకాయం బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కోటి మంది కాదు, రెండు కోట్ల మంది కాదు ఏకంగా 8 కోట్లకు పైగా భారతీయులు ఒబేసిటీతో బాధపడుతున్నారు. మీ చుట్టూ ఉన్నవారిని చూస్తే.. సగం మందికి పొట్ట కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. వీరంతా ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్లి బరువు తగ్గించే ఇంజక్షన్లు వేయించుకుంటున్నారు. ఎందుకంటే.. ఇప్పుడు బరువు తగ్గడం కూడా ఫ్యాషన్ అయిపోయింది. OTT వెబ్ సిరీస్‌లలో కూడా నటులు ఈ బరువు తగ్గించే ఇంజక్షన్ల గురించి మాట్లాడుతున్నారు! అంటే.. ఇది ఎంత పెద్ద బిజినెస్‌గా మారిందో మీరే అర్థం చేసుకోండి.
పోటీలోకి అగ్రరాజ్యాలు:
ఈ పరిస్థితిని గమనించిన అమెరికా, డెన్మార్క్ లాంటి దేశాల ఫార్మా కంపెనీలు తమ ఔషధాలను ఇండియాలో లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నాయి. USకు చెందిన ఇలి లిల్లీ కంపెనీ తన ఔషధాన్ని 2025లోనే ఇండియా మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. అంతే కాదు, డెన్మార్క్‌కు చెందిన నోవా కంపెనీ కూడా త్వరలో ఇండియాలోకి తన మెడిసిన్‌ను తీసుకురానుంది. ఈ ఔషధాలు GLP-1 Receptor అనే డ్ర*గ్ క్లాస్‌లోకి వస్తాయి. ఇవి కడుపు నిండిటనట్టు ఫీలింగ్ కలిగిస్తాయి. ఆకలిని తగ్గిస్తాయి. తక్కువ తినడానికి అలవాటు చేస్తాయి. కడుపు త్వరగా ఖాళీ కాకుండా చేస్తాయి.. అంటే తిన్నది మెల్లిగా జీర్ణం అవుతుంది. అటు బరువు తగ్గటానికి కొంతమంది డాక్టర్లు ఈ తరహా ఔషదాలను రిఫర్ చేస్తుంటారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి వీటిని ఇస్తున్నారట.
నిజానికి ఒబేసిటీతో బాధపడేవారు బరువు తగ్గడం అవసరం. కానీ ఈ మెడిసిన్స్‌కు అనేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. నొప్పి, వాంతులు, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటివి కొన్ని వేల మందిని ఇబ్బంది పెడుతున్నట్టు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కొంతమంది మందు వాడటం ఆపేసిన వెంటనే మళ్లీ బరువు పెరిగిపోతున్నారట. అంతేకాదు ఈ మందులు ఖర్చు కూడా ఎక్కువే. నెలకి సగటున 25,000 నుంచి 50,000 వరకు ఖర్చవుతుంది..! అంటే.. బరువు తగ్గడానికి సుమారుగా ఏడాది పాటు మందులు వాడుతున్నాం అనుకుంటే 3 నుంచి 6 లక్షల రూపాయలు వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత మందులు వాడడం ఆపేస్తే మళ్లీ బరువు పెరుగుతారని పరిశోధనలు చెబుతున్నాయి.
అటు బరువు తగ్గించే మందుల మార్కెట్ విలువ 5,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. 2020లో ఈ మార్కెట్ 1,300 కోట్లు మాత్రమే ఉండేది. కేవలం 5 ఏళ్లలోనే ఈ మార్కెట్ 4 రెట్లు పెరిగిపోయింది. అంటే బరువు తగ్గించే మందులు అమ్మేవాళ్లే ఎక్కువగా లాభపడుతున్నారని అర్థం. వెయిట్ లాస్ ఇంజక్షన్ క్యాటగిరిలో 2022లో విడుదలైన Semaglutide మందు ఇండియాలో 65శాతం మార్కెట్‌ను ఆక్రమించుకుంది. కొంతమంది దీన్ని విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. ఇంత పెద్ద మార్కెట్ ఉండడంతో భారతీయ కంపెనీలు కూడా పోటీకి వచ్చాయి. గ్లెన్ మార్క్, సిప్లా, డాక్టర్ రెడ్డిస్, సన్ ఫార్మా లాంటి సంస్థలు జనరిక్ GLP-1 మందుల తయారీపై పని చేస్తున్నాయి. ఇప్పుడు అర్థమైందా మీ పొట్ట పెరిగితే.. ఔషధ కంపెనీలకు ఎంత లాభమో! మీ బరువు తగ్గించడమే వాళ్లకు బిజినెస్… కానీ అది కూడా తాత్కాలికంగానే..! ప్చ్.. ఇక మీరే ఆలోచించుకోండి!
ALSO READ: సౌర తుఫాన్లతో ఇంటర్నెట్ సర్వీసులు బంద్.. ఎలాన్ మస్క్‌కు భారీ దెబ్బ!

Weight Gain & Hunger Science: బరువు ఎందుకు తగ్గడం లేదు? (Leptin, Ghrelin, Cortisol)
World Kidney Day : సైజ్ చిన్నదైనా, కాపాడుకోకపోతే లైఫ్ ఖతం! కిడ్నీ ఆరోగ్యం అత్యవసరం!