Menu

Relationship: నమ్మకం బీటలు వారితే…మొత్తం కుటుంబమే చిద్రమవుతుంది! సీతారాం, రేణుక కథ చెబుతున్నది ఇదే!

Lakshmi Aruna 4 days ago
markapuram love issue

ప్రేమ, నమ్మకం, గౌరవం మీద నిలబడాల్సిన వివాహ బంధం… ఒక చిన్న తప్పు, ఒక తప్పుడు నిర్ణయం, ఒక అజాగ్రత్తతో ఎలా కూలిపోతుందో చూపించే బాధాకర ఘటన ఇది. బయటికి చూస్తే సంతోషంగా కనిపించే కుటుంబాల వెనుక… ఎలాంటి సంఘటనలు దాగి ఉంటాయో మనం ఊహించలేం. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుక 2018లో వివాహం చేసుకుని… ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ పరిసర ప్రాంతమైన బాచుపల్లిలో నివసిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మంచి జీతం సంపాదిస్తూ కుటుంబాన్ని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించిన భర్త… తన కుటుంబంలోనే జరుగుతున్న మార్పులను గమనించలేకపోయాడనే చెప్పాలి.

కాలక్రమేణా, భార్య ప్రవర్తనలో వచ్చిన మార్పులు… బయట ఆమెకున్న సంబంధాలపై అనుమానాలు… చివరికి అవి నిజమేనని తెలిసిన సందర్భం సీతారాం జీవితాన్ని పూర్తిగా కుదిపేసింది. వ్యక్తిగతంగా ఉండాల్సిన కొన్ని విషయాలు… వీడియోల రూపంలో రికార్డ్ కావడం, అవి సోషల్ మీడియాలో బయటకు రావడం… ఇవన్నీ ఒక్కసారిగా అతని గౌరవం, భావోద్వేగాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా ఆ వీడియోలు పబ్లిక్ అవ్వడం అతనికి తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించింది. మన సమాజంలో వ్యక్తిగత గోప్యతకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలుసు… అలాంటిది ఒక ఆడదాన్ని వాడుకుని ఆ విషయాన్ని పబ్లిక్ చేయాలి అనుకునే ఇంకో మగవాడి మృగ ఆలోచనలకు ఒక కుటుంబమే చిద్రమయిపోయింది. గోప్యంగా ఉంచాల్సిన ఒక సున్నిత విషయం బయటపడితే ఒక వ్యక్తి ఎలా కుంగిపోతాడో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. ఇక్కడ తప్పెవరిది? కుటుంబం ఉన్నా కూడా వేరొకరితో సంబంధం పెట్టుకున్న ఆమెదా? లేక ఆమెను వాడుకుని అవసరం తీరాక ఆమె విషయాన్ని పబ్లిక్ చేసిన ఆమె ప్రియుడిదా? లేక సంపాదించే సత్తా ఉండి…తన భార్య చేసిన తప్పుకి కుంగిపోయి..తన ఇద్దరు పిల్లల్ని అనాథలుగా మిగిల్చిన ఆ భర్తదా? కారణం ఏదైనా కావొచ్చు కానీ ఇక్కడ మోసపోయింది పిల్లలే.

భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక… సీతారాం ఫిబ్రవరి నెలలో ఒక పెద్ద సూసైడ్ నోట్ రాసి తన బాధను వ్యక్తపరిచాడు. ఆ లేఖలో అతని మాటలు చూస్తే… ఒక భర్తగా తన బాధ, తన నమ్మక ద్రోహం గురించి అతను ఎంతగా కుంగిపోయాడో అర్థమవుతుంది. “నేను నా కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకున్నా… కానీ నాకు ద్రోహం జరిగింది” అనే భావనతో… చివరకు అతను తన ప్రాణాలను తీసుకున్నాడు. కానీ ఇక్కడ కుటుంబం అంటే కేవలం భార్యేనా? తన పిల్లలు కారా? ఈ నిర్ణయం అతని జీవితాన్ని మాత్రమే కాదు… ఇద్దరు చిన్న పిల్లల భవిష్యత్తును కూడా చీకట్లోకి నెట్టింది.

ఈ ఘటన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్ ఆధారంగా సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే… ఒక వ్యక్తిగత సమస్య ఎందుకు ఇంత దారుణమైన ముగింపుకు దారి తీసింది? సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుకుని పరిష్కారం కనుక్కోవడం ఎందుకు జరగలేదు? మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు సహాయం ఎందుకు తీసుకోలేదు?

ఇది కేవలం ఒక కుటుంబ కథ కాదు… సమాజానికి ఒక హెచ్చరిక. సోషల్ మీడియా వాడకం పెరిగిన ఈ కాలంలో… వ్యక్తిగత విషయాలను నిర్లక్ష్యంగా షేర్ చేయడం ఎంత ప్రమాదకరమో మనం అర్థం చేసుకోవాలి. ఒక వీడియో, ఒక పోస్ట్… కేవలం కొన్ని సెకన్లలో వైరల్ అవుతుంది… కానీ దాని ప్రభావం మాత్రం జీవితాంతం ఉంటుంది. అలాగే, సంబంధాల్లో నమ్మకం చాలా ముఖ్యం… అది ఒక్కసారి బీటలు వారితే తిరిగి నిర్మించడం చాలా కష్టం.

ఇంకా ముఖ్యంగా… మానసిక ఆరోగ్యం గురించి మనం సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా… అది పరిష్కారం కానిదేమీ కాదు. కానీ ఆ క్షణంలో తీసుకునే ఒక తప్పు నిర్ణయం… తిరిగి రాని నష్టాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు… లేదా నిపుణుల సహాయం తీసుకోవడం చాలా అవసరం.

చివరగా… ఒక వైరల్ వీడియో, ఒక వ్యక్తిగత తప్పు… కానీ దాని వల్ల చిద్రమైన ఒక కుటుంబం… అనాథలైన ఇద్దరు పిల్లలు… ఈ కథ మనకు చెబుతున్న మెసేజ్ ఒక్కటే.. నమ్మకం కాపాడుకోండి, వ్యక్తిగత గోప్యతను గౌరవించండి, సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడండి… ఎందుకంటే ఒక క్షణిక నిర్ణయం… ఒక జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.

ALSO READ: వార్తల్లో కులం పేరును ప్రస్తావిస్తే క్యాస్ట్ కార్డ్‌ వాడుకున్నట్టా? సనాతన వీరులు కచ్చితంగా ఇది తెలుసుకోండి!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *