ఏళ్లుగా ఎదురుచూపులు. రాత్రి పగలు కష్టపడి చదివిన చదువులు. కోచింగ్ సెంటర్లలో గడిపిన రోజులు. అమ్మానాన్నల ఆశలు, స్నేహితుల ప్రోత్సాహం. ఇవన్నీ మోసుకుంటూ, తెలంగాణలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కన్నారు వేలాది మంది యువతీ యువకులు. Group 1 ప్రిలిమ్స్ అనే మొదటి అడ్డంకిని దాటి, మెయిన్స్ అనే అసలైన యుద్ధంలో పోరాడి, ఫలితాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు.
తీరా ఫలితాలు వచ్చాక, కొందరి ఇళ్లలో పండగ వాతావరణం, మరికొందరి ఇళ్లలో నిరాశ. అయితే, ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఫలితాల్లో ఏదో తేడా జరిగిందని, తమకు అన్యాయం జరిగిందని కొందరు అభ్యర్థులు హైకోర్టు మెట్లెక్కారు. ఇప్పుడు, అందరినీ ఆశ్చర్యపరుస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. TGPSC విడుదల చేసిన Group 1 మెయిన్స్ ఫలితాలను పూర్తిగా రద్దు చేసింది.
ఈ తీర్పు కొందరికి పెద్ద షాక్ అయితే, మరికొందరికి ఊరటనిచ్చింది. అసలు హైకోర్టు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? TGPSC చేసిన తప్పులేంటి? ఇప్పుడు అభ్యర్థుల భవిష్యత్తు ఏంటి? వివరంగా చూద్దాం.
హైకోర్టు తీర్పులో అసలేముంది?
విషయం చాలా సింపుల్. TGPSC నిర్వహించిన మూల్యాంకన (evaluation) పద్ధతిలో బోలెడు తప్పులున్నాయని హైకోర్టు తేల్చి చెప్పింది. అందుకే, పాత ఫలితాలను పూర్తిగా పక్కన పెట్టేయమని ఆదేశించింది.
- ఫలితాలు రద్దు: మార్చి 2025లో విడుదల చేసిన మార్కుల లిస్ట్, ర్యాంకుల లిస్ట్ చెల్లవు. వాటిని చెత్తబుట్టలో వేయమన్నంత పని చేసింది.
- మళ్ళీ దిద్దండి, కానీ చేతులతో: ఈసారి డిజిటల్ వద్దు, గిజిటల్ వద్దు. ప్రతీ ఒక్కరి పేపరును మ్యానువల్‌గా, అంటే చేతులతోనే, సబ్జెక్టులో నిపుణులైన ప్రొఫెసర్లతో మళ్ళీ దిద్దించాలని స్ట్రిక్ట్‌గా చెప్పింది.
- డెడ్‌లైన్ 8 నెలలు: ఈ మొత్తం ప్రాసెస్, అంటే పేపర్లు దిద్దడం దగ్గర నుండి ఫైనల్ లిస్ట్ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్చుకోవడం వరకు, అంతా 8 నెలల్లో పూర్తి చేయాలని గట్టిగా ఆదేశించింది.
- వార్నింగ్ కూడా ఇచ్చింది: ఒకవేళ ఈ 8 నెలల్లో చెప్పినట్టు చేయకపోతే, Group 1 మెయిన్స్ పరీక్షనే పూర్తిగా రద్దు చేస్తామని, ప్రిలిమ్స్ పాసైన వాళ్లందరికీ మళ్లీ మెయిన్స్ పెట్టాల్సి వస్తుందని గట్టి వార్నింగ్ ఇచ్చింది.
TGPSC చేసిన “ఘనకార్యాలు” ఏంటి?
కోర్టు ఇంత సీరియస్ అవ్వడానికి కారణం TGPSC నిర్లక్ష్యమే. అభ్యర్థులు కోర్టు ముందు పెట్టిన సాక్ష్యాలు చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది.
- తెలుగు పేపర్‌ను ఇంగ్లీష్ ప్రొఫెసర్ దిద్దడం: తెలుగు మీడియంలో రాసిన సమాధాన పత్రాలను, సరిగా తెలుగు రాని ఇంగ్లీష్ మీడియం ప్రొఫెసర్లు దిద్దారట. ఇది ఎంత పెద్ద తప్పో ఆలోచించండి.
- రూల్స్ పట్టించుకోలేదు: ఏ రూల్స్ సరిగ్గా పాటించలేదని, ఇష్టమొచ్చినట్టు వ్యవహరించారని కోర్టు అభిప్రాయపడింది.
- ఒకే సెంటర్ నుండి టాప్ ర్యాంకులు: కొన్ని ఎగ్జామ్ సెంటర్ల నుండి మాత్రమే చాలా ఎక్కువ మందికి టాప్ ర్యాంకులు రావడంపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
- మార్కుల్లో తేడాలు (Moderation లేదు): ఒకే జవాబుకు ఒక టీచర్ 10 మార్కులు, ఇంకో టీచర్ 5 మార్కులు వేయకుండా చూసే ‘మోడరేషన్’ పద్ధతిని సరిగ్గా వాడలేదట. దీనివల్ల ఇంగ్లీష్ మీడియం వాళ్లకు ఎక్కువ, తెలుగు మీడియం వాళ్లకు తక్కువ మార్కులు వచ్చాయని తేలింది.
ఇప్పుడు ఎవరి పరిస్థితి ఏంటి?
- అభ్యర్థులు: పాసైన వాళ్ల ఆనందం ఆవిరైంది, ఫెయిలైన వాళ్లకు కొత్త ఆశ పుట్టింది. కానీ అందరూ మళ్లీ టెన్షన్‌లో పడ్డారు. ఈ 8 నెలలు ఏం జరుగుతుందోనని ఎదురుచూడాలి. ఇది ఒకరకంగా వాళ్ల జీవితాలతో ఆడుకోవడమే.
- TGPSC: TGPSC పరువు పూర్తిగా పోయింది. ఒక పరీక్షను కూడా సరిగ్గా పెట్టలేరా అని అందరూ విమర్శిస్తున్నారు. ఇప్పుడు వాళ్ల ముందున్నది పెద్ద సవాల్. నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలి.
- రాజకీయం: ఇక రాజకీయ పార్టీలకు ఇదొక మంచి అవకాశం. అధికార పార్టీని విమర్శించడానికి ప్రతిపక్షాలకు పెద్ద అస్త్రం దొరికింది. ఉద్యోగాలు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ BRS పార్టీ విమర్శలు మొదలుపెట్టింది.
హైకోర్టు తీర్పుతో Group 1 ప్రయాణం మళ్లీ మొదటికి వచ్చింది. ఇది అన్యాయం జరిగిందని భావించిన వారికి న్యాయం చేసినా, అందరినీ ఒక రకమైన అనిశ్చితిలోకి నెట్టింది. ఇప్పుడు బంతి TGPSC కోర్టులో ఉంది. వాళ్లు ఎంత పారదర్శకంగా, ఎంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారన్న దానిపైనే 563 ప్రభుత్వ ఉద్యోగాల భవిష్యత్తు, వేలాది మంది అభ్యర్థుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. చూద్దాం… ఈ 8 నెలల్లో అయినా అభ్యర్థుల కలలు నెరవేరతాయో లేదో.

TS Police: జుట్టు పట్టుకుని ఈడ్చిపడేస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్..! ఏ ప్రభుత్వంలోనైనా ఖాకీల తీరింతేనా?