ప్రకృతి అందాలతో నిండిన కశ్మీర్ లోయ మళ్ళీ కన్నీరు మూటగట్టుకుంది. కానీ ఈసారి ఆ కన్నీరు మౌనంగా సాగడంలేదు..భీకర శబ్దంతో కశ్మీర్ లోయ మారుమోగుతోంది. తరతరాల అణచివేతకు గురైన వారి గుండెలు ఒక్కసారిగా ఆవేదనతో ముందుకుసాగుతున్నాయి. ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న లోయ ఒక్కసారిగా ఒకే గొంతుకగా మారింది. పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి.. కశ్మీరీలను ఒక్కటి చేసింది. పచ్చని కొండల మధ్య, రక్తం ఏరులై పారిన చోట భయాన్ని అణిచివేసిన ప్రజలు.. ఇప్పుడు తమ భావజాలానికి దగ్గరవుతున్నారు. వారి గుండె లోతుల్లో నుంచి ఒక్కటే మాట తిరిగి వస్తోంది. ఆ మాట పేరే ‘కశ్మీర్యత్..’! ఇప్పుడు ఈ పదం చుట్టూనే కశ్మీర్ అంతా ఐక్యంగా నడుస్తోంది. ఇంతకీ కశ్మీర్యత్ అంటే ఏంటి?
ఒక్క తాటిపైకి కశ్మీరులు:
కశ్మీర్యత్ అనేది కేవలం ఒక పదం కాదు.. అది కశ్మీర్ ప్రజల ఆత్మ. అది మతాలను కాదు, మనుషులను చూస్తుంది. హిందూ, ముస్లిం, సిక్కు అని తేడా లేకుండా, అందరినీ ఒక్కటిగా చూడడమే కశ్మీర్యత్. ఇది ప్రేమ, సహనం అనే భావాల మీద నిలిచిన శాశ్వతమైన సంప్రదాయం. తరతరాలుగా కశ్మీర్‌లో ప్రజలు పరస్పర గౌరవంతో కలిసి జీవించారు. ఒకరిమీద మరోకరు ప్రేమ చూపారు.. పండుగలు కలిసి జరుపుకున్నారు.. ఒకరి ఆలయాలకు మరోకరు వెళ్లారు. ఇదే కశ్మీర్యత్. ఇప్పుడు ఆ కశ్మీర్యత్‌పై దాడి జరిగిందనే భావన అక్కడి ప్రజల్లో కలకలం రేపుతోంది. పహల్గాం దాడి తర్వాత కశ్మీర్ అంతా ఒక్కటైంది. దుకాణాలను ఎవరికి వారు స్వచ్ఛందంగా మూసివేశారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు అన్నీ క్లోజ్ అయ్యాయి. ఊరూరా దీపాలు వెలిగించి.. మౌనంగా నిలబడి.. తమ ఆవేదనను చూపిస్తున్నారు కశ్మీరీలు. ఇది ఒక్క దాడికి ప్రతిస్పందన కాదు.. ఇది తమ సంస్కృతిని, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం సగటు కశ్మీరీ చూపిస్తున్న ఐక్యమత్యం!
మానవతా భావమే కశ్మీర్యత్
అయితే ఇప్పటి ఈ ఐక్యత ఒక్కసారిగా పుట్టింది కాదు.. ఇది తరతరాల సంస్కృతికి చిహ్నం. కశ్మీర్ నేలపై వందల ఏళ్లుగా అన్నీ మతాలు కలసి జీవించాయి. వేర్వేరు దేవుళ్ల పూజలు, వేర్వేరు ప్రార్థనల శబ్దాలు.. కానీ హృదయాల లయ మాత్రం ఒకటే. ఇదే కశ్మీర్యత్‌కు పునాది. అక్కడి ప్రజల ఆంతరంగిక తత్వం, ఒకరినొకరు అర్థం చేసుకునే శక్తి ఈ భావనను నిర్మించింది. హిందూ సన్యాసుల నుంచి సూఫీల వరకు కశ్మీర్ గడ్డపై ప్రేమను బోధించారు. వారి పద్యాలు హృదయాల్ని తాకేలా ఉండేవి.. భాష వేరు అయినా భావం ఒక్కటే అన్నట్టు.. ఒకరికొకరు తమ మతాలను గౌరవించుకునేవారు. శివరాత్రి వచ్చినా, ఈద్ వచ్చినా.. అది అందరికి పండుగే. కేవలం ప్రార్థనల విషయంలో కాదు.. అక్కడి పల్లె జీవితం, సంగీతం, సాహిత్యం, హస్తకళలు అన్నీ కలసి పుట్టిన మానవతా భావమే కశ్మీర్యత్. ఆ భావన ఇప్పుడు ప్రతి గదిలో, ప్రతి గుండెలో తిరుగుతోంది. ఇది ఊహ కాదు.. తమ బతుకు బండిని మోయాలన్న కాంక్ష. కశ్మీర్యత్ పుట్టింది ఆ లోయలోనే.. పెరిగింది ప్రజల గుండెల్లోనే..! ఇప్పుడు ఆ గుండె లోతుల్లోను చీల్చాలని చూస్తున్న ఉన్మాదులకు కశ్మీర్యత్ భావన అడ్డుగా నిలబడాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.
కశ్మీర్ కల్లోలానికి కారణం మతోన్మాదమే
నిజానికి ఈ కశ్మీర్యత్ భావనను చీల్చే ప్రయత్నాలు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. తరతరాలుగా వికసించిన ఈ ఐక్యం క్రమంగా బలహీనపడింది. అందుకు ప్రధాన కారణం ఆలోచనలపై కాకుండా, మతాలపై ఆధారపడే రాజకీయాలు మొదలవడం. 1990లో కశ్మీరీ పండితుల ఊచకోత తర్వాత పరిస్తితులు తలకిందులయ్యాయి. ఇది కశ్మీర్యత్ గుండెపై పడిన మొట్టమొదటి భారీ ఆక్రమణ ముద్ర. ఒక మతం చెందిన ప్రజలను వారి నివాసాల నుంచి వలస వెళ్లిపోవడంతో వందల ఏళ్లుగా ఏర్పడిన స్నేహబంధాలు, మానవ సంబంధాలు ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. మానవత్వం నిలబడాల్సిన చోట అనుమానాలు, భయాలు, ద్వేషాలు మొదలయ్యాయి. ఇది కశ్మీర్యత్ అనే భావనను విరిగిపోయేలా చేసింది. కొన్ని రాజకీయ శక్తులు కశ్మీర్‌ను మరింత దారుణంగా మార్చేశాయి. మత వాదాన్ని పెంచి పోషిస్తూ రాజకీయంగా ఎదిగే ప్రయత్నాలు చేశాయి. అప్పటి నుంచి ప్రజల గుండెల్లో ఉన్న కశ్మీర్యత్‌ను బయట ప్రపంచానికి కనపడకుండా పోయింది. కేవలం రాజకీయ ప్రస్థావనలకే కశ్మీర్ అంశం పరిమితమైంది. అయితే రోజులెప్పుడు ఒకేలా ఉండవు కదా.. కశ్మీర్‌పై దాదాపు అన్నీ వైవుల నుంచి జరుగుతున్న దాడులను అక్కడి ప్రజలు భరించలేకపోతున్నారు. పహల్గాం ఘటన తర్వాత కశ్మీర్యత్ భావన మరోసారి పురుడు పోసుకోవడం వెనుక దశాబ్దాల అణచివేత ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే పహల్గాం దాడికి వ్యతిరేకంగా కశ్మీర్ సమాజం చూపిన స్పందన అక్కడి ఐక్యాన్ని, పోరాటాలను కళ్లకు కట్టింది.
ALSO READ: ఆర్టికల్-370 రద్దు చారిత్రాత్మక తప్పిదం.. ఈ లెక్కలే సాక్ష్యం!

Delhi Blasts Updates: ఇది ప్రమాదమా? కుట్రా? ఎర్రకోట పేలుడు వెనుక నిజమేంటి?
Journalism-Terr*rism: టెర్రరిజం స్థాయికి చేరిన జర్నలిజం..! ఏకంగా ఉగ్రవాదులకే సవాల్ విసురుతున్నారుగా!
Pulwama to Pahalgam: ఆర్టికల్-370 రద్దు చారిత్రాత్మక తప్పిదం.. ఈ లెక్కలే సాక్ష్యం!
Jammu Kashmir: అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ తంటాలు.. కశ్మీర్‌లో అమాయకుల చావులకు కారణం ఎవరు?
కశ్మీర్.. మోదీ బిగ్గెస్ట్ డిజాస్టర్.. ఉగ్రదాడులు ఆగేదెన్నడు?