Menu

Maha kumbhmela Stampede: మౌని అమావస్య రాసిన మృత్యుశాసనం.. 1954 నుంచి 2025 వరకు భక్తులను చంపేసిన ముహూర్తాల మూఢత్వం!

Tri Ten B
mauni amavasya mahakumbhmela stampedes

ఫిబ్రవరి 3, 1954.. ఆ రోజు మౌని అమావస్య.. మహాకుంభమేళా(MahaKumbhmela)లో అత్యంత పవిత్రమైన రోజు.. ప్రయాగ్‌రాజ్ నగరం జనసంద్రంగా మారింది. గంగానది ఒడ్డున 20 లక్షల మందికి పైగా భక్తుల ఒక చోటే చేరారు.. ఓవైపు గంటలు మోగుతున్న శబ్దం… మరోవైపు గంగా తీరంలో మెరిసిపోతున్న దీపాల వెలుగు.. ఎటు చూసినా ఆధ్యాత్మిక పరవశం. ఉదయం 8 గంటలు దాటింది.. VIPలు వస్తున్నారు..VVIPలూ వస్తున్నారు.. ఇంతలోనే రద్దీ ఊహించని విధంగా పెరిగిపోయింది.. జనాలు గంగాతీరానికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు తాళం వేసిన ఇనుప గేట్ ముందు కాపు కాస్తున్నారు. అయితే ఓ మహా సునామీలా భక్తుల ప్రవాహం పెరిగి ఒక్కసారిగా గేట్ విరిగిపడింది. క్షణాల్లోనే వేలాది మంది కిందపడ్డారు. వెనక నుంచి వస్తున్నవారు ముందున్నవారిని తొక్కేస్తూ పోయారు. నిమిషాల వ్యవధిలో గంగా నది తీరం మరుభూమిగా మారింది. భక్తుల ఆశలు, ప్రార్థనలన్నీ ఒక్కసారి రక్తంతో తడిసిపోయాయి. కొందరికి చేతులు విరిగాయి.. మరికొందరికి కాళ్లు పోయాయి.. ఇంకొంతమంది తలలు పగిలాయి.. మొత్తం 800 మందికిపైగా ప్రాణాలు పొగొట్టుకున్న విషాద ఘటన అది. అధికారిక లెక్క 800 మంది అని ప్రభుత్వం ప్రకటించినా ప్రత్యక్ష సాక్షులు చెప్పినదాని ప్రకారం నాటి మరణం సంఖ్య 1000కి పైగానే ఉంటుంది. ఈ ఘటన జరిగి 71 ఏళ్లు గడిచాయి. మరోసారి అదే కుంభమేళ.. అదే మౌని అమావస్య.. అదే మృత్యువు..! 2025 జనవరి 29 అర్థరాత్రి దాటిన తర్వాత ప్రయోగ్‌రాజ్‌లో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇలా కుంభమేళ సమయంలో తొక్కిసలాటలు జరగడం ఈ రెండు సార్లు మాత్రమే జరగలేదు. గతంలోనూ కుంభమేళ తొక్కిసలాటలు వందలాది మందిని బలితీసుకున్నాయి.

ప్రభుత్వమే చంపేసింది..

1986లో కుంభమేళ సందర్భంగా హరిద్వార్ నగరం జనంతో కిక్కిరిసిపోయింది. లక్షలాది మంది భక్తులు గంగా తీరానికి తరలివచ్చారు. గంగా నదిలో స్నానం చేస్తే జన్మ జన్మాల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అదే సమయంలో నగరంలో మరో కోలాహలం మొదలైంది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు హరిద్వార్‌కు వస్తున్నారని పోలీసులు సెక్యూరిటీ టైట్ చేశారు. నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్ బహదూర్ సింగ్‌తో సహా ఇతర ప్రముఖులు కోసం ప్రత్యేకంగా మార్గాలు ఏర్పాటు చేశారు. ఆ మార్గాల్లో సాధారణ భక్తులను అడ్డుకోవడానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలు దాటింది. భక్తుల రద్దీ పెరిగిపోతుంది. పోలీస్ బ్యారికేడ్లు జనసంద్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా పోలీసులు గట్టిగా నిలబడ్డారు. అయితే అదే సమయంలో జరిగిన ఒక చిన్న ఘటన పెను విషాదానికి కారణమైంది. ఒక వృద్ధురాలు లైన్‌లో కిందపడిపోయింది. ఆమె వెనక ఉన్న మరో మహిళ తనకు తెలీకుండా ఆ వృద్ధురాలను తొక్కేసింది. పోలీసులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే జనమంతా ముందుకు పరిగెత్తారు. కేవలం 30 సెకన్లలోనే వందల మంది నేలపై పడ్డారు. వారిని తొక్కుకుంటూ ఇతరులు వెళ్లడంతో చాలామందికి ఊపిరాడక కొన్ని నిమిషాల్లోనే మరణించారు. కొన్ని గంటల తర్వాత చూస్తే అక్కడ చాలా శవాలు కనిపించాయి. నాటి ఘటనలో 200 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు.

భయంతోనే..

ఇక 2003లో నాసిక్‌లోనూ కుంభమేళ సమయంలో తొక్కిసలాట జరిగింది. గోదావరి నదిలో స్నానం చేయడానికి వచ్చిన వేలాది భక్తులు ఒకరిపై ఒకరు పడ్డారు. ఈ ఘటనలో 39 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. 2013 ఫిబ్రవరి 10న, అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో కుంభమేళా సందర్భంగా ఒక ఫుట్‌బ్రిడ్జ్ కూలిపోవడంతో, భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ తొక్కిసలాటలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రచారం ఫుల్‌.. సేఫ్టీ నిల్

ఇలా మొత్తంగా 5సార్లు కుంభమేళలో ఘోరాలు జరిగాయి. ఓవరాల్‌గా కుంభమేళ తొక్కిసలాట మృతుల సంఖ్య వెయ్యికు పైనే అధికారికంగా రికార్డు అయ్యింది. ఇక ఇప్పటి పెనువిషాదానికి కూడా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. మౌని అమావస్యకు భక్తులు పోటెత్తుతారని స్వయంగా సీఎం యోగి కొన్ని రోజుల ముందే ప్రకటించారు. 10 కోట్ల మంది ఒక్కరోజే స్నానాలు ఆచరిస్తారని చెప్పారు. అయినా అదే రోజు తొక్కిసలాట జరగడంపై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ‘ప్రచారం ఫుల్‌.. సెక్యూరిటీ నిల్‌’ అని కాంగ్రెస్‌ పార్టీ… యోగి టార్గెట్‌గా మండిపడుతోంది. జనం వస్తారని ముందుగానే తెలిసినా ఈ ఘటనల ఎందుకు జరిగిందో చెప్పాలని ప్రశ్నిస్తోంది.

ఇది కూడా చదవండి: పుణ్యం కోసం వెళ్తే ప్రాణాలే పోతాయ్.. కుంభమేళ నుంచి తిరుపతి వరకు దేశాన్ని విషాదంలో ముంచేసిన మతపరమైన తొక్కిసలాటలు!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *