Menu

Life Style News: దేవుడు ఎవరు? సమాధానం మీ దగ్గరే ఉంది.. ఎలాగో తెలుసుకోండి!

Lakshmi Aruna 7 months ago
who is god atheism quotes

“దేవుడు ఎవరు?” ఏవండోయ్ మిమ్మల్నే అడుగుతున్నా దేవుడు ఎవరు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగిన ఈ ప్రశ్నను మీరు ఎప్పుడైనా మీ మనసులో వేసుకున్నారా? ఆకాశాన్ని చూస్తూ, రాత్రి నక్షత్రాల మధ్యలో ఎక్కడో దూరంలో ఉన్న ఒక శక్తిని ఊహించారా? ఆకాశం.. పైనే ఎందుకుండాలి? నక్షత్రాలను అక్కడ ఎవరు అతికించారు? అమ్మో ఒక్కసారిగా సూర్యుడు చంద్రుడు ఈ గ్రహాలు నేల రాలిపోతే…కానీ అవి అక్కడ ఉండటానికి కారణం ఎవరు? దేవుడే అంటారా? మీరు ఎప్పుడైనా దేవుడ్ని చూశారా? ఆయన ఎవరో ఎలా ఉంటారో తెలుసా మీకు? లేదా.. దినచర్యలో మనం ఎదుర్కొనే కష్టాల్లో, ఓదార్పు కోసం మనసులో ఎక్కడో దేవుడు ఉన్నట్టు అనిపించిందా? మనమూ… ప్రపంచం కూడా దేవుణ్ని ఎవరు? ఆయన ఎక్కడుంటాడు? ఆయన రూపం ఏంటి? అనే విషయంలో ఒక్కటిగా లేము కదా. విభిన్నమైన సమాజాలు, విభిన్న దేవుళ్ళు.. కానీ ఆశ్చర్యమేంటంటే… భావన మాత్రం ఒక్కటే ఆయన ఉన్నాడన్న నమ్మకం. ఇది నిజమో కాదో.. పక్కనపెడదాం..! హిందూమతంలో అయితే దేవుడు ఆకారంతో ఉంటాడు, అలాగే ఆకారంలేకుండా కూడా ఉంటాడు. అతను విష్ణువు, శివుడు, పార్వతి… కానీ ఆంతరార్థంగా చూస్తే “బ్రహ్మం” అన్నది అన్నిటికీ మూలమంటారు. క్రైస్తవులకి ఆయన ప్రేమమూర్తి. యేసు ద్వారా మానవాళిని కాపాడిన తండ్రిలాంటి దేవుడు. ఇస్లాంలో.. దేవుడు ఒక్కడే అల్లాహ్. ఆయనకు రూపం లేదు. కానీ ఆయన మాటలే దారి చూపే వెలుగులు. బౌద్ధంలో? దేవుడు అంటే వ్యక్తి కాదు.. కానీ ఒక సుదీర్ఘ ప్రయాణం. అదే నిజమైన శాంతి దారిలో దేవునికి సమానం.

నా పిలుపుకి ప్రతిస్పందించేది నువ్వేనా?

తత్వశాస్త్రంలో దేవుడు అంటే ఒక సూత్రం… ఒక మొదలు,ఒక అంతం. అంటే ఏదో దూరమైనది కాదు.. మనలోనే ఉండే జ్ఞానం, ప్రేమ, నిజాయితీ.. ఇవే దేవుని రూపాలు అంటారు. కానీ నిజంగా దేవుడు ఎవరు అనేది మన మనసు తేల్చాలి. ఒక పిల్లవాడు పడిపోయినప్పుడు తల్లి చేతులు పట్టుకుని లేపిన ఆ ప్రేమలో దేవుడు ఉంటాడు.ఎదుటి వ్యక్తి ఆకలితో అలమటిస్తున్నప్పుడు అన్నం పెట్టే చేతుల్లో ఉంటాడు…ఆపదలో ఉన్నప్పుడు రక్షించే ఆలోచనలో ఉంటాడు…కానీ మనమంతా మనల్ని ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడు అని ఎదురుచూస్తుంటాం…అదే దేవుణ్ణి వెతకడం నిత్యం చేస్తూనే ఉంటాం… ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని, గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ కళ్ళు మూసుకుని ప్రశ్నించండి…’నన్ను సృష్టించింది ఎవరు?’ ‘నా పిలుపుకి ప్రతిస్పందించేది ఎవరు?’ వెంటనే శబ్దం వినపడదు… కానీ ఓ జ్ఞానం పుట్టుకొస్తుంది. దేవుడు అంటే వెలుగు మాత్రమే కాదు…కళ్ళలో నిండిన చీకటి కూడా.ఆ చీకటిలో నువ్వు ఎంతమందికి ఉపయోగపడ్డావు? ఎంతమందిని బాధ పెట్టావు? అని ప్రశ్నించుకో? అప్పుడు దేవుడు ఎవరు?అని మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం కచ్చితంగా దొరుకుతుంది.. ఆయన మీరు నమ్మినట్టు ఉంటాడు. మీరు కలలలో ఊహించినట్టు ఉంటాడు.

ప్రేమగా, శాంతిగా, ధైర్యంగా మీరే జీవించగలిగితే… దేవుడు ఎక్కడో కాదు మీలోనే ఉంటాడు.ఎందుకంటే… దేవుడు బయట కాకపోవచ్చు. కానీ మనలో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. ఆ మనసును ఏ కల్మషం, కర్కశం, కుళ్ళు లేకుండా ఉంచగలిగితే…నీ లోపలే ప్రశాంతంగా దేవుడు ఉంటాడు.

నువ్వు ఎలాంటి వాడివో అర్థం చేసుకోవాలి:

దేవుడు ఎక్కడో తెలియాలంటే నీ లోపల ఉన్న జీవి ఎలాంటి వాడో తెలియాలి…కాబట్టి ముందు నీ ఉనికి ఏంటి నువ్వు ఎలాంటి వాడివి అనేది తెలుసుకో…అప్పుడు ఒకరోజు నీలోని దేవుడే నీకు సమాధానం ఇస్తాడు.. ఫ్రెండ్స్ ఇది నేను ఏ మతాన్ని కించపరచటానికి చెప్పేది కాదు…మనలో మనం కొట్టుకు చచ్చే మతానికంటే…మనకంటూ దేవుడిచ్చిన గొప్ప మతం మానవత్వం దాన్ని నిలబెట్టుకోవడానికి మనం ఆలోచిద్దాం…ఇది నా మనసులో దైవం చెప్పిన మాట..మరి మీ దేవుడు.. అదే అని మీ మనసు ఏం చెబుతుంది? ఇది నా అభిప్రాయం మాత్రమే.. మరి మీరు కూడా ఓసారి ఆలోచించండి..!

ALSO READ: పెళ్లి అవసరమా? ఈ సామెతలు కనిపెట్టిన సన్నాసులు ఎవరు?


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *