Menu

Hathras Stampede: మనుషులు చేసిన దేవుళ్ల కోసం మూర్ఖపు చేష్టలు.. ఈ చావులకు బాధ్యులు ఎవరు?

Tri Ten B

‘మీరేంటి సర్.. లాజిక్కులు ఎవరూ నమ్మరు.. అందరికీ మ్యాజిక్‌లే కావాలి. అందుకే మన దేశంలో సైంటిస్టుల కంటే బాబాలే ఫేమస్‌..’ అల్లు అర్జున్‌ నటించిన జులాయ్‌ సినిమాలో డైలాగ్‌ ఇది. ఇది అక్షర సత్యమే. బాబా కాళ్ల కింద మట్టి కోసం తన్నుకోని చివరికి ఆ మట్టిలోనే కలిసిపోవడం ప్రమాదం కాదు.. అది ఆత్మహ*త్యే..! ఎందుకంటే హత్రాస్‌ భోలే బాబాకు మహిమలు ఉన్నాయని నమ్మడం పూర్తిగా అజ్ఞానమే. ఆ అజ్ఞానానికి నమ్మకం అనే పదం తగిలించి కవర్‌ చేసుకోవడం మూర్ఖత్వం. మా నమ్మకాలు మావి.. ఎవరి నమ్మకాలు వారివని చెప్పడం వితండవాదం. నమ్మకాలకు ఓ తర్కం లేకపోతే దానికి విలువ ఇవ్వాల్సిన అవసరం కానీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం కానీ లేదు. ఎవరి నమ్మకాలు వారివే అని ఎవరికి వారు అనుకోబట్టే హత్రాస్‌ ఘటనలు, కుంభమేళా తొక్కిసలాటలు జరుగుతున్నాయి. చచ్చిన తర్వాత ప్రాణం తిరిగి రాదు.. వాళ్లు నమ్మిన దేవుళ్లు, బాబాలు, పాస్టర్లు పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేరు. ఎందుకంటే వారంతా మాయగాళ్లు.. జనాలను వెర్రొలని చేసి ఆడుకునే మోసగాళ్లు.

హత్రాస్‌ తొక్కిసలాట ఘటన.. 120కు పైగా భక్తులు దుర్మరణం

అక్కడ చావడమేంటో.. స్వర్గానికి వెళ్లడమేంటో..:
ఇండియాలో మతపరమైన కార్యక్రమాల్లో తొక్కిసలాటలు జరగడం కొత్తమీ కాదు.. ఇటివలి కాలంలోనే జరుగుతున్న విషాదాలు అంతకన్నా కాదు. 1954 ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 1,000 మంది మరణించారు. దేవుడి సన్నిధిలో ప్రాణం విడిస్తే స్వర్గానికి వెళ్తారని భావించే వారు మన కళ్ల ముందే కనిపిస్తుంటారు. ఆలయంలోనో, నమాజ్‌ సమయంలోనో చనిపోతే దేవుడు దగ్గరకు వెళ్తారని చెబుతుంటారు. తన సన్నిధిలో తనను నమ్ముకున్న భక్తుల ప్రాణాలనే దేవుడు కాపాడలేకపోవడం విడ్డూరం. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారని చెప్పుకోవడం హాస్యాస్పదం.

హత్రాస్‌ తొక్కిసలాటలో చిన్నారిని కోల్పోయి రోదిస్తున్న తల్లి

మఠాధిపతులే రాష్ట్రాన్ని ఏలుతుంటే ఇలానే అవుతుంది:
ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌ తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 120కు పైనే ఉన్నా ఇప్పటివరకు భోలేబాబా పేరు FIRతో నమోదుకాలేదు. కార్యక్రమానికి 80వేల మందికి పర్మిషన్‌ ఇస్తే 2లక్షల మంది వచ్చారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారో అర్థంకావడం లేదు. మఠాధిపతులే సీఎంగా ఉన్న రాష్ట్రంలో న్యాయఅన్యాయాల గురించి ఆలోచించడం, ప్రశ్నించడం అవివేకమే అవుతుంది. ఎంతైనా యూపీ సీఎంగారు భవిష్యత్‌ ప్రధాని అభ్యర్థి కూడా కదా.. అందుకే బీజేపీ చెప్పుచేతల్లో నడిచే మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా కూడా భోలాబాబాను విలన్‌గా చూపిస్తూ యోగి అదిత్యనాథ్‌ అసమర్థతను కప్పిపుచ్చుతోంది.

ఎప్పటినుంచో ఇంతే:
దేశంలో బాబాలు చేసే మోసాలను అరికట్టే చట్టాలు అసలు ఉన్నాయా? ఉంటే పని చేస్తున్నాయా? ఓ వ్యక్తి తనకు తానుగా నేను దేవుడిని అని చెప్పుకోవడం ఏంటి? నాకు మహిమలు ఉన్నాయని చెబితే ప్రజలు దాన్ని గుడ్డిగా నమ్మడం ఏంటి? ఇదంతా ఇండియాలో ఏదో ఈ మధ్య మొదలైంది కాదు.. భారత చరిత్రలో ఇలా ప్రజలను బురిడి కొట్టించిన బాబాలు చాలానే ఉన్నారు. వారికి పెద్ద పెద్ద గుళ్లు కూడా ఉన్నాయి. వారి కోసం ఉపవాసాలు చేసే పిచ్చి భక్తులూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కల్కిలు, సత్యసాయిలు ఉన్నారు, ఉండేవారు. కోట్ల రూపాయల ఫండింగ్‌లు తెచ్చుకుంటూ వేల రూపాయలను ప్రజల కోసం ఖర్చు పెట్టే దొంగ స్వామీజీల ట్రస్టులూ ఉన్నాయి. వీరందరికి ప్రభుత్వాల అండదండలు కూడా ఉన్నాయి. అదనంగా సెలబ్రిటీల ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉంది.

2019లో లక్ష్మీ కాంత శర్మ అనే ఓ స్వామీజీ చెప్పిన ఓ మాటతో తెలంగాణలోని నార్కెట్‌పల్లి వేణుగోపాల స్వామీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆ ఆలయాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు పోతాయని ఆ స్వామీజీ చెప్పారు. తర్వాత తెలిసిన అసలు నిజమేంటంటే ఆ ప్రాంతానికి చెందిన రియల్‌ ఎస్టెట్‌ వ్యాపారులు ఆ స్వామీజీతో అలా చెప్పించారు.. పలు మీడియా ఛానెల్స్‌కు డబ్బులు ఇచ్చి మరీ ఆ స్వామీజీ మాటలను ప్రమోట్ చేశారు.

అన్ని మతాల్లోనూ ఇంతే:
ఇదంతా ఓ మతానికి సంబంధించిన వ్యవహారం కాదు. హజ్‌ యాత్రికుల మరణాలు ప్రతీఏడాది ఉండేవే. 2024లోనూ భారీ ఉష్ణోగ్రతల కారణంగా వేలాది మంది హజ్‌ యాత్రికులు మృత్యువాతపడ్డారు. గతంలో చాలాసార్లు తొక్కిసలాటలు జరిగి వేలాది మంది మరణించారు. ఇవన్ని ఆత్మహత్యలే.. ఎందుకంటే ఈ ముహూర్తంలో, ఈ రోజున మాత్రమే దేవుడిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని నమ్మడమేంటో ఇలా గుంపులుగుంపులుగా వెళ్లి ప్రాణాలను కూడా లెక్కచేయని భక్తులకే తెలియాలి.

పాస్టర్లా.. డాక్టర్లా:
అటు క్రిస్టియన్‌ పాస్టర్లు బాబాల కంటే ఏం తక్కువ కాదు.. కానీ మీడియా కవరేజీ తక్కువ. చర్చిల్లో ఫాదర్లు, పాస్టర్లు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మే కొందరు ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు డాక్టర్‌ దగ్గరకు వెళ్లకుండా చర్చిలోనే వ్యాధి నయం అవుతుందని భావిస్తారు. దీనికి నమ్మకం అని పేరు పెడతారు. ఇలా చేసిన వారిలో చాలా మంది చనిపోయినట్టు ఎన్నో వార్తా కథనాలు చెబుతున్నాయి. హార్ట్‌లో హోల్‌నే హీల్‌ చేసే కేఏ పాల్‌, వర్షాన్ని కూడా ఆపేసే బ్రదర్‌ అనిల్‌ మన దగ్గర చాలా ఫేమస్‌ కూడా.

సాఫ్ట్‌కోర్‌ మూఢత్వం.. ఆధ్యాత్మికత:
ఇప్పటివరకు పైన చెప్పినవన్ని హార్డ్‌కోర్‌ మూఢత్వాలు. అయితే సాఫ్ట్‌కోర్‌ మూర్ఖత్వం కూడా ఉంటుంది. దానికి స్పిరిట్యూవలిటీ అనే పేరు ఉంటుంది. అంటే తెలుగులో ఆధ్యాత్మికత అని అర్థం. మతాన్ని నమ్మడం కంటే ఈ ఆధ్యాత్మికతని నమ్మడం మంచిదని ఇటివలీ కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదంతా వ్యాపారంలో భాగం. సద్గురు జగ్గీవాసుదేవ్ లాంటి వారిని చూస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. ఆధ్యాత్మికత అనేది ఓ వ్యాపారి తన ప్రొడక్ట్‌ను అమ్ముకునే వస్తువు మాత్రమే. కాస్త సైన్స్‌ పదాలు యాడ్‌ చేసి ఎవరైనా ఇంగ్లీష్‌లో ఉపన్యాసం ఇస్తే వారిని గురువులగా భావించడం కూడా మూర్ఖత్వమే అవుతుంది.. అయితే దీన్ని అంగీకరించే వారు చాలా తక్కువగా ఉంటారు. వీళ్లంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే పైకి మంచిగా కనిపించే ఆధ్యాత్మికత చివరకు ఉగ్రరూపం దాల్చి మతోన్మాదంవైపే వెళ్తుంది.

కోరికలు తీర్చుకోవడం కోసమే..:
నాలుగు మంచి మాటలు ఇంగ్లీష్‌లో చెప్పినంతా మాత్రానా వాళ్లందరిని దేవుడిగా భావించడమేంటో అర్థంకాదు. నిత్యానంద ఈ ట్రిక్కుతోనే వేల కోట్లు సంపాదించాడు. ఆశా రామ్ బాపులు, డేరాబాబులు చివరకు కటకటాల పాలైనా సమాజానికి చేయాల్సిన నష్టాన్ని ఎప్పుడో చేసేశారు. వీరి ఆశ్రమాల్లో ఏ పుస్తకాలు ఉంటాయో తెలియదు కానీ వారిపై ఉన్న లైంగిక ఆరోపణలు, కేసులు చూస్తే మాత్రం కామసూత్రను ఎక్కువగా విశ్వసిస్తారని తెలుస్తుంది. ఎందుకంటే చిన్నారులపైనా లైంగిక దాడులు చేసే ఘోరమైన బుద్ధి ఈ స్వామజీలకే ఉంటుంది. ఆశ్రమానికి వచ్చిన ఆడవారితో బలవంతంగా లైంగిక కోరికలు తీర్చుకోవడం, అంగీకరించకపోతే ఆశ్రమంలోనే పాతిపెట్టి చంపడం ఈ బాబాలు చేసే నిత్యఘోరాలు. తమ శారీరక కోరికలు తీర్చుకోవడం కోసమే బాబాల అవతారమేత్తే వాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటారు. వీటికి ఆధ్యాత్మికత ఫ్లేవర్‌ పూసి స్పిరిట్యూవల్‌ గురువులగా మారుతారు.

శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం పెంపొందించుకోవడం దేశంలోని ప్రతి పౌరుని విధి’ అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A చెబుతోంది. అటు శాస్త్రీయత ఇంత అభివృద్ధి చెందుతున్నా, దేశంలో పౌరులు మూఢనమ్మకాలవైపు వెళ్తున్నారు. దీనికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బాహాటంగానే మద్దతు పలుకుతుండడం బాధాకరం!

ఇది ఎవరి పాపం? :
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదంతా బాబాలకు, ఆధ్యాత్మిక గురువులకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. వేల సంవత్సరాలుగా ఉన్న గుళ్లు, చర్చీలు, మసీదులు ఇతర మత ఆలయాల్లోనూ ఈ తరహా ఘటనలే కనిపిస్తుంటాయి. ఇటు హత్రాస్‌ తొక్కిసలాట ఓ బాబా వల్ల జరిగిందని ఆయనపై నమ్మకం లేని వారు చెబుతున్నారు కానీ మరీ ఇతర ఆలయాల్లో, కుంభమేళలో, శబరీమలలో, పుష్కరాల్లో, ఇటు మసీదులు, చర్చిల వద్ద జరిగిన తొక్కిసలాటలు ఎవరి పాపం? ఇదంతా మెయిన్‌ స్ట్రీమ్‌ దేవుళ్ల పాపమా?

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *