Pardhi Community: బ్రిటిష్ నియంతలపై పోరాడిన చరిత్ర వారిది. అగ్రకుల ఉన్మాదులను ఎదురించిన గుండె ధైర్యం వారిది. పోలీసుల అరాచక లాఠీ దెబ్బలను, నిర్బంధాలను భరించి, తిరిగి నిలబడిన తెగింపు వారిది. అంతా మోనాలిసా(Monalisa) గురించే మాట్లాడుతున్నారు. మహాకుంభమేళ(Mahakumbh mela)లో తళుక్కుమని మెరిసిన ఈ తేనె కళ్ల భామ చుట్టూ ఎన్నో కథనాలు, వార్తలు కనిపిస్తున్నాయి. అయితే ఆ కళ్ల లోతుల్లో దాగి ఉన్న చరిత్రని తొంగి చూస్తున్న వారు అతి కొద్దీ మందే ఉన్నారు. ఆ అందమైన కళ్ల వెనుక అంతులేని వేదన ఉంది. దండలు అమ్ముకుంటున్న వారి జీవనోపాధి వెనుక కులవివక్ష తిష్ఠ వేసుకోని ఉంది. అణచివేత, అవమానాలు ఉన్నాయి. గ్రామ బహిష్కరణలూ ఉన్నాయి. వారి తెగ పేరు పార్ధీ. వీళ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కనిపిస్తారు. వీళ్ల చరిత్ర తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వీళ్ల ప్రస్తుత పరిస్థితులు తెలుసుకుంటే మాత్రం కన్నీళ్లు వస్తాయి. ఇంతకీ ఏంటా చరిత్ర? ఏంటా ప్రస్తుత కథ?
నిలువ నీడ లేకుండా చేసిన చట్టం
పార్ధీ అంటే వేటగాళ్లు అని అర్థం. వీరి మూలాలు మధ్యభారత అడవుల్లో ఉన్నాయి. శతాబ్దాల క్రితం ప్రకృతి సంరక్షకులుగా వీళ్లు అడవుల్లో జీవనాన్ని సాగించేవారు. కానీ ఇప్పుడు, ప్రభుత్వ నిబంధనలు, వన్యజీవుల సంరక్షణ చట్టాలు వీరి జీవితాన్ని చిన్నాభిన్నాం చేశాయి. గోవులపై సవారీ చేస్తూ అడవుల్లో పక్షులు వేటాడడం వీరి జీవనోపాధిగా ఉండేది. 1972లో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వన్యప్రాణి సంరక్షణ చట్టం వీరి బతుకుల్లో నిలువ నీడ లేకుండా చేసింది. ఓ చట్టాన్ని ఏ ప్రాతిపాదికన తెచ్చినా మంచి ఉద్దేశ్యంతోనే అమలు చేసినా దానికి Other side of coinని చూడడం కూడా ప్రభుత్వ బాధ్యత. ఓ చట్టంతో ఓ తెగ జీవనోపాధి కోల్పోతుందంటే వారికి బతుకు మార్గం చూపించాల్సింది కూడా ఆ చట్టం చేసిన ప్రభుత్వానిదే. కానీ అవేవీ జరగలేదు. అందుకే నేటి పార్ధీలకు ఇల్లు ఉండదు. కనీస ఓటరు గుర్తింపు కార్డు ఉండదు. పట్టించుకునే రాజకీయ పార్టీలూ ఉండవు. అటు గ్రామాల్లో వీళ్లపై కులవివక్ష ఉంటుంది. చేయని నేరాలకు అనుమానాలతో గ్రామాల నుంచి వీళ్లని తరిమేసే పెద్దరాయుళ్లూ ఉంటారు. ఇంతటి అవమానాలను భరించే వీళ్ల తెగ చరిత్ర తెలుసుకుంటే మాత్రం దేశభక్తులగా చెప్పుకునే కొంతమందికి పూనకాలు రావొచ్చు.
దశాబ్దాల పాటు నిర్బంధంలో బతుకీడ్చిన దీనులు
మొఘల్ పాలకులను గడగడలాడించిన మహారాణా ప్రతాప్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచిన పార్ధీ తెగల గురించి మాత్రం చర్చించుకోరు. రాజపుత్రులు యుద్ధాలకు వెళ్లిన సమయంలో పార్ధీలు స్థానిక రాజులకు సాయం అందించేవారట. ఇలా మొఘల్ రాజులపై పరోక్షంగా యుద్ధాలు చేసిన పార్ధీలు బ్రిటిష్‌పాలకులపై మాత్రం నేరుగానే తలపడ్డారు. వారిపై పెద్ద యుద్ధమే చేశారు. 1871లో బ్రిటిష్ ప్రభుత్వం వీరిని క్రిమినల్ ట్రైబ్స్‌గా ముద్రదేసింది. తమపై తిరుగుబాట్లతో ఊపిరి ఆడనివ్వకుండా దాడులు చేస్తున్న పార్ధీలను Criminal Tribes Act కింద కేసులు మోపి హింసించింది. ఈ చట్టం కింద వీరందరిని గ్రామాల బయట శిబిరాల్లో ఉంచి వేధించింది. 1952, ఆగస్టు 31న ఈ చట్టాన్ని భారత్ ప్రభుత్వం రద్దు చేసింది. అందుకే పార్ధీ ప్రజలు ఆగస్టు 15న కాకుండా ఆగస్టు 31ని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు.
తిండికి కూడా గతి లేక..
బ్రిటిష్ పాలకుల నిర్బంధాన్ని 80ఏళ్లకు పైగా భరించిన పార్ధీలకు స్వాతంత్ర్య భారతంలోనూ కష్టాలు తప్పలేదు. కులవివక్ష వారి జీవితాలను నరకకూపంలోకి నెట్టింది. అటు ప్రభుత్వ నిర్ణయాలు, పాలకుల నిర్లక్ష్యం వారి కడుపు కొట్టింది. వన్యప్రాణుల సంరక్షణ పేరిట వీరిని అడవుల నుంచి అధికారులు బలవంతంగా తరిమివేశారు. అడవులు వీరికి నివాసంగా, ఆహార భద్రతకు మూలంగా ఉండేవి. కానీ వీరు జీవించే స్థలాలు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లడంతో దిక్కులేని జీవితం గడపవలసి వచ్చింది. వేట నిషేధం తరువాత, ఈ తెగకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను అందించేందుకు సరైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోలేదు. దీంతో ఈ తెగ తీవ్ర పేదరికంలో కూరుకుపోయింది.
అగ్రకుల ఉన్మాదానికి బలి
అటు పార్ధీ తెగలు సామాజికంగా, ఆర్థికంగా తక్కువస్థితిలో ఉండడంలో అగ్రకుల వేధింపులు పెరిగిపోయాయి. ఎంతోకొంత మిగిలి ఉన్న పార్ధీ భూములను అగ్రకులాల పెత్తందారులు లాక్కున్నారు. వీరిపై తప్పుడు కేసులు పెట్టి, కక్షపూరితంగా దాడులు చేసేవారు. వారంతా తిరిగి ఎదురు తిరగకుండా గ్రామాల నుంచి తరిమేసేవారు. దొంగతనాలు చేశారని.. హత్యల చేశారని ఆరోపిస్తూ గ్రామ బహిష్కరణలు చేసేవారు. ఈ ఆరోపణలు నిజమైన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. అటు ఇంత అణచివేత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మీకు ఆలోచన కలగలేదా? ఓ ఉదాహరణ చెబుతా వినండి. మహారాష్ట్రలోని ఓ గ్రామంలో ఓ మహిళపై ఇలానే దొంగతనం చేసిందని తప్పుడు ఆరోపణలు చేస్తూ గ్రామం నుంచి వెలివేశారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. కేసు రిజస్టర్ చేసుకోని దర్యాప్తు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయకపోగా.. ఆ మహిళను లైంగికంగా వేధించారు. ఓ హోటల్‌లో నిర్బంధించి వారం రోజుల పాటు ఒకరి తర్వాత ఒకరు ఆమెను అనుభవించారని మీడియా సంస్థ ‘ది వైర్(The Wire)’ ఓ కథనంలో రాసుకొచ్చింది. అయినా పోలీసులు ఎక్కువగా ఎవరివైపు ఉంటారో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. పోలీసుల వేధింపులలో పార్ధీ మహిళలు లైంగిక హింసకు గురవడం సాధారణమైపోయింది. ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చినా ఎలాంటి ఉపయోగమూ లేకుండాపోయింది. అందుకే ఫిర్యాదు చేయడానికే పార్ధీ తెగ ప్రజలు సాహసించరు. పైగా పోలీస్ స్టేషన్‌కు వెళ్తే తిరిగి వీరిపైనే తప్పుడు కేసులు పెడతారన్న వాదనా ఉంది.
ఈ పోరాటం ఇంకెన్నాళ్లు?
ఇక ఈ కమ్యూనిటీ ప్రజలు ఎక్కడ నివసిస్తున్నా అక్కడి ప్రజలు మాత్రం వీరిని సాటి మనుషులలాగ కూడా చూడరు. పెళ్లి భోజనాలు ముగిసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని అగ్రకులస్తులు వీధి కుక్కలకైనా పెడతారు కానీ వీళ్లకి మాత్రం ప్లేట్‌లో ఒక అన్నం ముద్ద కూడా పెట్టరని ఐశ్వర్య త్రిపాఠి అనే ఓ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఓ ఆర్టికల్‌లో రాసుకొచ్చారు. ఇంతటి దయనీయ, అమానవీయ స్థితిలో కాలం వెళ్లదీసే పార్ధీ తెగ ప్రజలు కొన్ని సందర్భాల్లో చట్టబద్ధంగా వీరందరిపై పోరాడారు. తమ జీవితాన్ని నరకప్రాయం చేసిన ప్రభుత్వాలు, కులవ్యవస్థపై ఇప్పటికీ అహింస మార్గాంలోనే పోరాడుతున్నారు. తమకు ఓటు హక్కు కల్పించాలని, దేశంలో ఒకరిగా గుర్తించాలని కనిపించే ప్రతీ రాజకీయ నాయకుడిని వేడుకునే యువత పార్ధీ తెగల్లో కనిపిస్తోంది. అయినా వీరిపై తప్పుడు కేసులు పెట్టడం, అసత్య-హత్యా నేరాలు మోపడం ఆగని దుస్థితి. తినడానికి తిండి ఉండదు.. తాగునీరూ ఉండదు. పోషకాహార లోపంతో, వ్యాధులతో బాధపడే ఈ గిరిజన తెగ గురించి పట్టించుకునే నాథుడూ లేడు. ఇది పార్ధీ ప్రజల దీన గాధ.. పోరాట కథ!
ఇది కూడా చదవండి: ఈ కళ్లు ప్రపంచంలో ఎందుకంత స్పెషల్..? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి?