ఫిబ్రవరి 1, 2003.. చరిత్రలో ఓ చీకటి రోజు. శాస్త్ర విజ్ఞానానికి భారీ నష్టాన్ని కలిగించిన రోజు. ఇండియాకు చెందిన మొట్టమొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలు, కోట్ల మంది యువతికి ప్రేరణగా నిలిచిన కల్పనా చావ్లా(kalpana chawla) ధ్రువతారగా మారిపోయిన రోజు. ఆమెతో పాటు మరో ఆరుగురు వ్యోమగాములు నేలరాలిన ఘటనలను సైంటిస్టులు, సామాన్యులు ఇప్పటికీ తలుచుకొని కన్నీరు కార్చుతూనే ఉన్నారు. నాడు వీరంతా ప్రయాణిస్తున్న కొలంబియా స్పేస్ షటిల్-STS-107 క్షణాల్లో మంటల్లో కాలి బూడిదైంది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది?
ఆ 16నిమిషాల్లో ఏం జరిగింది?
STS-107 మిషన్, 2003 జనవరి 16న ప్రారంభమైంది. ఈ మిషన్‌ను 16 రోజుల పాటు అనేక శాస్త్రీయ ప్రయోగాల కోసం రూపొందించారు. భూమి వాతావరణ మార్పులపై పరిశోధనలు. గరిష్ట గాలివేగాల్లో స్పేస్‌షిప్ ఎలా పనిచేస్తుందో విశ్లేషించడం, జీరో గ్రావిటీ వాతావరణంలో మానవ శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అధ్యయనం చేసేందుకు కల్పనా చావ్లాతో పాటు మరో ఆరుగురు వ్యోమగాములు అంతరీక్ష ప్రయాణానికి బయలుదేరారు. 16 రోజుల ఈ ప్రయాణంలో కల్పన తన సహచరులతో కలిసి అద్భుతమైన పరిశోధనలు చేశారు. నాసాకు కీలకమైన సమాచారాన్ని అందించారు. అంతరిక్షం నుంచి భూమి ఎంత అందంగా కనిపిస్తుందో వాళ్లు కళ్లకు కట్టారు. ఫిబ్రవరి 1 రానే వచ్చింది. ఆ రోజు కల్పనా టీమ్ తిరిగి భూమికి చేరుకోవాల్సి ఉంది. ఉదయం 8 గంటల 44నిమిషాలకు కొలంబియా స్పేస్ షటిల్ భూమికి తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది. అంతరిక్షంలో ఉన్న ప్రతీ వ్యోమగామికి అది ఎంతో ఉద్వేగ క్షణం. వాళ్లు తమ కుటుంబ సభ్యులను కలవబోతున్నారు. భూమిని మళ్లీ చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ ఆనందం 16 నిమిషాల్లోనే బూడిదైంది.
8 గంటల 50నిమిషాల సమయంలో షటిల్ ఎడమ భుజంలో.. అంటే left wingలో లోపాలు కనిపించాయి. మరో మూడు నిమిషాలకు స్పేస్ షటిల్ వేగంగా కదులడం ప్రారంభమైంది. వెంటనే అందులో ఉష్ణోగ్రత స్థాయిలు అమాంతం పెరిగాయి. మరో ఆరు నిమిషాలకు ఒక్కసారిగా షటిల్ భుజం తెగిపోవడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక్క నిమిషానికి.. అంటే 9గంటలకు కొలంబియా స్పెష్ షటిల్ నాశనమవుతూ టెక్సాస్ ఆకాశంలో మంటల్లో దహించుకుపోయింది. వ్యోమగాముల కలలన్నీ కాలిపోయాయి. భూమికి కొద్దీ నిమిషాల దూరంలో ఉండగానే కల్పనా చావ్లా తన ప్రాణాలను కోల్పోయింది.
నిజానికి ఈ ప్రమాదానికి నాసా వేసిన తప్పుడు అంచనానే కారణమనే వాదన ఉంది. జనవరి 16న లాంచ్ టైమ్‌లోనే స్పేస్ షటిల్ ఎడమ భుజానికి ఫోమ్ ఇన్సులేషన్ తగిలింది. ఫామ్ ఇన్సులేషన్ ఇంధన ట్యాంక్ చుట్టూ ఉంటుంది. ఇది షటిల్ లెఫ్ట్ వింగ్‌కు తాగలడంతో అక్కడ కొద్దీగా చిల్లు పడింది. అయితే ఇది పెద్ద ప్రమాదం కాదని నాసా భావించింది. దానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. కానీ స్పెస్ షటిల్ భూమికి తిరిగి వచ్చే సమయంలో ఈ చిల్లుకారణంగా షటిల్ ఎడమ భుజం ఉష్ణోగ్రత తట్టుకోలేక నాశనమయ్యింది. ఈ ప్రమాదం అంతరిక్ష అన్వేషణలో నాసా చేసిన అతిపెద్ద తప్పిదంగా చరిత్రలో మిగిలిపోయింది. ఇక ఆ రోజు కాలంతో కలిసిపోయిన కల్పనా చావ్లా కోట్లాది ప్రజల గుండెల్లో మాత్రం నిలిచిపోయింది. ఆమె చిన్నప్పుడు విమానాలను చూసి, పైలట్ కావాలని అనుకుంది. భయపడకుండా అమెరికా వెళ్లి, ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. నాసా స్పేస్ షటిల్‌కు ఎంపికైన మొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. 1997లో మొదటి మిషన్ STS-87ని విజయవంతంగా పూర్తి చేసి, 2003లో రెండోసారి అంతరిక్షానికి వెళ్లిన ఆమె మళ్లీ భూమిపై అడుగుపెట్టలేదు. ఆ ఘటనతో కల్పనా తల్లిదండ్రులు ఊహించని దుఖంలో మునిగిపోయారు. అయితే ఇంకెందరో అమ్మాయిల గుండెల్లో మంటలు రగిలించారు కల్పనా. అందుకే ఆమె మరణించలేదు.. మన చుట్టూ ఉన్న నక్షత్రాల్లో కల్పనా ఇంకా సజీవంగానే జీవిస్తోంది.
Also Read: గాల్లో ప్రాణాలు.. అమెరికా, సుడాన్ విమాన ప్రమాదాలకు కారణాలేంటి?