Book Fair In Hyderabad: పుస్తకాలకు మించిన ఆయుధాలు ఈ ప్రపంచంలో లేనే లేవు. తుపాకులు, బాంబులు, బెదిరింపులతో మరని వాళ్లు సైతం ఓ పుస్తకంతో మారిపోతారు. రాతలు, అక్షరాలు అనేక దేశాలను విప్లవబాట పట్టించాయి. బానిసత్వంలో మగ్గేలా చేసిన పాలకులకు ఎదురెళ్లేలా చేశాయి. వారిని సరిహద్దుల వరకు తరిమితరిమి కొట్టాయి. 23(1907-1931)ఏళ్లు బతికిన భగత్‌సింగ్ తన జీవితంలో 550కు పైగా పుస్తకాలు చదివాడు. స్కూల్ డేస్(1913-1921)లో 50కు పైగా పుస్తకాలు చదివిన భగత్‌సింగ్.. కాలేజీ రోజుల్లో 200కు పైగా పుస్తకాలు చదివాడు. జైలు జీవితం గడిపిన రెండేళ్లలో ఏకంగా 300కు పైగా పుస్తకాలు చదివాడు భగత్‌సింగ్. తనని ఉరి తియ్యడానికి కొద్ది సేపటి ముందు వరకు కూడా భగత్‌సింగ్ పుస్తకాలు చదువుతూనే ఉన్నాడంటే వాటి ప్రభావం అతనిపై ఎంతల ఉందో అర్థం చేసుకోవచ్చు.
అంధకారంలో మగ్గుతున్న ప్రపంచానికి అసలు వెలుగులు ఎలా ఉంటాయో చెప్పింది పుస్తకాలే. చార్లెస్ డార్విన్ పరిశోధనల సారంతో విడుదలైన ‘ది థీయరీ ఆఫ్ ఈవల్యూషన్’ పుస్తకం ప్రపంచ ఆలోచనా స్థితిని మార్చేసింది. ఛాందసవాదులపై పెను ఉప్పెనలా విరుచుకుపడింది. జ్ఙానాన్ని బోధించాలన్నా.. అజ్ఞానాన్ని తరమికొట్టాలన్న అందుకు పదునైన ఆయుధం పుస్తకం. అదే సమయంలో పుస్తకాల్లో మంచి పుస్తకాలు, చెడు పుస్తకాలు అని ఉండవు.. మంచీచెడులు సబ్జెక్టివ్ మాత్రమే. ఇదంతా ఒకరి వ్యక్తిగత అభిప్రాయానికి సంబంధించిన వ్యవహారం.
సైంటిస్టులకైనా, స్టోరీ టెల్లర్స్‌కైనా, ఫిలోసఫర్స్‌కైనా వారి ఆలోచనలు షేర్ చేసుకునే సాధనం పుస్తకం. ఒక మనిషి ఆలోచనా స్థితిని మార్చే పవర్ పుస్తకాలకుంటుంది. అందుకే తరాలు మారుతున్నా పాఠకుల సంఖ్య కాస్త తగ్గినట్టు అనిపించినా ఈనాటికి పుస్తక ప్రేమికులు మన కళ్లముందు కనిపిస్తూనే ఉంటారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు వెళ్లిన వారు ఎవరైనా ఈ విషయాన్ని చెబుతారు. ఫిబ్రవరి 9న మొదలైన బుక్ ఫెయిర్ 19వరకు కొనసాగనుంది.