Menu

Haridwar Incident: ఒక చావు.. ఎన్నో ప్రశ్నలు.. ఏది నిజం?


పురోగతి కోసం నిలబడే ఏ వ్యక్తి అయినా పాత విశ్వాసంలోని ప్రతి అంశాన్ని విమర్శించాలి, నమ్మకూడదు..వాటిని సవాలు చేయాలి.


Sumanth Thummala

మనిషి చంద్రుడు మీదకు చేరుకున్నా మూఢనమ్మకాలు మాత్రం ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. చదువుకున్న వారు కూడా శాస్త్రీయ విజ్ఞానానికి తిలోదకాలు ఇస్తున్నారు. ఇంగిత జ్ఙానం చదువుకున్న విజ్ఞానం రెండూ మూలకు పడేసి ఎవరో ఏదో చెప్పారని పిచ్చిపిచ్చి నమ్మకాలను నమ్మడమే కాకుండా ఇతరులు కూడా పాటించేలా చేస్తున్నారు. ఇలాంటి ఓ పిచ్చి నమ్మకమే హరిద్వార్ లో ఓ పిల్లాడి ప్రాణాన్ని తీసిందన్న వార్త వైరల్‌గా మారింది. అయితే ఇందులో నిజనిజాలపై గందరగోళం నెలకొంది.

చేయి దాటిన ప్రాణం:
ఢిల్లీలోని సోనియా విహార్‌లో రాజ్‌కుమార్ సైనీ-శాంతి దంపతులకు రవి అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. అతను బ్లడ్ క్యాన్సర్‌ బారిన పడ్డాడు. ట్రీట్‌మెంట్‌ కోసం దంపతులు గంగారం ఆస్పత్రికి తీసుకెళ్లారని అక్కడ వారు చేతులెత్తేయడంతో హరిద్వార్‌లోని గంగానదిలో స్నానం చేపించడానికి దంపతులు తీసుకువచ్చారని పోలీసు సూపరింటెండెంట్ (సిటీ) స్వతంత్ర కుమార్ సింగ్ ముందుగా చెప్పారు. దీంతో పిల్లాడిని గంగనదిలో అదే పనిగా ముంచడం వల్లే చనిపోయాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే సాయంత్రానికి పోస్టుమార్టం రిపోర్ట్‌ మరోలా వచ్చిందంటూ ఎస్పీ ప్రెస్‌ మీట్ పెట్టారు. గంగనదిలో పిల్లాడిని ముంచడం కంటే ముందే చనిపోయాడని ఎస్పీ చెప్పారు. ఇక ఉదయం గంగారం ఆస్పత్రి గురించి కుమార్‌సింగ్‌ మాట్లాడితే సాయత్రం ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రి గురించి ప్రస్థావన వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులను సంప్రదించామని.. వైద్యానికి వారు నిరాకరించాలేదని క్లారిటీ ఇచ్చినట్టు ఎస్పీ చెప్పుకొచ్చారు.

స్థానికులు ఏం చెబుతున్నారు?
గంగనది వద్ద ఉన్న స్థానికులు చెబుతున్న వెర్షన్‌ వేరేలా ఉంది. హరిద్వార్‌కి వెళ్ళాక ఆ ఏడేళ్ల పిల్లాడితో తల్లిదండ్రులు ఒడ్డున మంత్రాలు పఠించారని.. ఆ తర్వాత అతని అత్త పదేపదే తనని నీళ్లలో ముంచారని స్థానికులు చెబుతున్నారు. మొదట పిల్లాడి అరుపులు కూడా విన్నామని అంటున్నారు. అందుకే కుటుంబసభ్యులను నిలదీశామంటున్నారు. ఇక వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఆ పిల్లాడిని మూడు నాలుగు నిమిషాల పాటు నీళ్లలోనే ముంచడం చూసిన చుట్టుపక్కల భక్తులు వెంటనే ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి నీళ్లలో నుంచి పైకి లేపి చూశారు అప్పటికే అపస్మాకస్థితిలో ఉన్నారు. అక్కడ స్థానికంగా ఉన్న భక్తులు ఆ చిన్నారి అత్త, తల్లితండ్రులను పిల్లాడిని చంపారన్న కారణంతో కొట్టారు. అయినప్పటికీ ఆ పిల్లాడి అత్త ఆ బిడ్డ తిరిగి వస్తాడని తన బతుకుతాడని, మీకు కావాలంటే వీడియోలు తీసుకోండి అని నవ్వుతూ మాట్లాడటం వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుంది.

ట్యాక్సీ డ్రైవర్‌ ఏం చెబుతున్నాడు?
ఢిల్లీ నుంచి హరిద్వార్ కు కుటుంబాన్ని కారులో తీసుకొచ్చిన డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణం ప్రారంభం నుంచే చిన్నారి అస్వస్థతకు గురై ఉన్నాడు. హరిద్వార్ చేరుకునే సరికి చిన్నారి పరిస్థితి విషమించింది. చిన్నారి ఆరోగ్యం క్షీణించడం, గంగానదిలో స్నానం చేయడం గురించి కుటుంబ సభ్యులు తన కారులో మాట్లాడుకున్నారని డ్రైవర్ చెబుతున్నాడు. దీంతో ఈ కేసుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

➡ ట్యాక్సీ డ్రైవర్‌ చెప్పిన వివరాల ప్రకారం తన కారు దిగే సమయంలో పిల్లాడు బతికే ఉన్నాడు. పోస్టు మార్టం రిపోర్ట్‌లో నీళ్లలో ముంచే సమయానికే పిల్లాడు చనిపోయినట్టు వచ్చింది. కారు దిగిన తర్వాత గంగలో ముంచడానికి మధ్యలో ఏం జరిగింది?

➡ పిల్లాడి శవంతోనే కుటుంబసభ్యులు గంగలో ముంచడానికి వెళ్లారా? అలా అయితే ఆ పిల్లాడు బతికొస్తాడని అత్త ఎందుకు చెప్పినట్టు?

➡ చనిపోయిన పిల్లాడిని పదేపదే నీటిలో ఎందుకు ముంచినట్టు? స్థానికులు వచ్చి అడిగితే చనిపోయిన పిల్లాడినే ముంచుతున్నాం అని కుటుంబసభ్యులు ఎందుకు చెప్పలేకపోయారు?

➡ పిల్లాడి గొంతు విన్నామని చెబుతున్న స్థానికుల మాటల్లో నిజమెంతా?

➡ ఎయిమ్స్‌ వైద్యులు చికిత్స నిరాకరించలేదని క్లారిటి ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు ట్రీట్‌మెంట్‌ కాదని హరిద్వార్‌కు ఎందుకు వచ్చారు?

తగ్గని మూఢనమ్మకాలు:
ఈ కేసుపై నిజనిజాలు నిలకడ మీద తెలుస్తాయి. పోలీసులు ఇవాళ చెప్పింది రేపు చెప్పకపోవచ్చు.. రేపు చెప్పింది ఎల్లుండికి చెప్పకపోవచ్చు.. ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్‌గా అర్థమవుతోంది. గంగలో బతికున్న పిల్లాడిని ముంచినా.. శవాన్ని వదిలేసినా అది పిచ్చినమ్మకమే అవుతుంది. నీటిలో శవాల్ని వదలడం పర్యావరణానికి ఎంతో కీడు చేస్తుంది. గంగనదిలో శవాల కుప్పలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు

మదనపల్లిలో జరిగింది గుర్తుంది కదా:
శాస్త్రీయ విజ్ఞానం పెరిగే కొద్దీ జనాలు మూఢనమ్మకాలకు దూరంగా వెళ్లాలి. కానీ ఇటీవల నమ్మకాలు, సంస్కృతి, సంప్రదాయాలు అనే పేరుతో అనేక మూఢనమ్మకాలను పెంపొందిస్తున్నారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ లో ఇటువంటి కంటెంట్ విపరీతంగా వస్తున్నాయి. ఆ వీడియోలను మెసేజ్ లను చూసి జనాలు దాన్లో ఉన్న తర్కాన్ని, హేతుబద్ధతను చూడకుండా నమ్మేస్తున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇందులో చదువుకున్న వారు కూడా అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లిలో తన సొంత పిల్లల్ని చంపేసుకుని శివుడు ప్రత్యక్షమవుతాడని అనుకున్న ఒక లెక్చరర్ దంపతుల ఉదంతం కూడా చూశాం. అలాగే వాస్తు, జాతకాలు, ఆరోగ్య సంబంధిత విషయాల మీద ఎన్నో మూఢనమ్మకాలు జనాలలో ఉంటున్నాయి. ధన ప్రాప్తి కలుగుతుందని, అనారోగ్యం నయమవుతుందని,వృత్తిపరమైన- వ్యాపార సంబంధిత లాభాలకు కూడా ఇటువంటి మూఢనమ్మకాలను పెంచుతున్నారు. ఇటీవల కేరళలో కూడా ఇలా ధన ప్రాప్తి కలుగుతుందని నరబలి ఇచ్చిన ఉదంతం చూశాం. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పాలకులే స్వయంగా ఇటువంటి ఎన్నో మూఢనమ్మకాలను ముందుండి నడిపిస్తున్నారు.

హేతువాదం – ప్రశ్నించే తత్వం పెరగాలి!
ఇటువంటి నమ్మకాలను ప్రశ్నిస్తే మా నమ్మకాలు మా ఇష్టం అని దాటవేస్తారు. కానీ ఇలా మోసం చేసేవారు ప్రాణాలు తీస్తున్న వారివి కూడా వాళ్ల దృష్టిలో నమ్మకాలే కదా! భగత్ సింగ్ అన్నట్టు, “పురోగతి కోసం నిలబడే ఏ వ్యక్తి అయినా పాత విశ్వాసంలోని ప్రతి అంశాన్ని విమర్శించాలి, నమ్మకూడదు.. సవాలు చేయాలి. అతను ప్రబలమైన విశ్వాసం యొక్క ప్రతి సందు మరియు మూలను ఒక్కొక్కటిగా వివరించాలి. గణనీయమైన హేతువు తర్వాత ఎవరైనా ఏదైనా సిద్ధాంతం లేదా తత్వశాస్త్రంలో విశ్వసిస్తే, అతని విశ్వాసం స్వాగతించబడుతుంది. ఏదైనా నమ్మకానికి ‘కారణం’ మార్గదర్శక సూత్రంగా ఉండాలి.”
మూఢనమ్మకాలు లేని సమాజమే మానవజాతి పురోగతి కి మార్గదర్శకం. ఎటువంటి నమ్మకాలను ఎప్పుడు కూడా తార్కికంగా ఆలోచిస్తూ ప్రశ్నిస్తూ ఉండాలి. అప్పుడే సమాజం శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ముందడుగు వేస్తుంది.

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *