ఢిల్లీ(Delhi) ఎర్రకోట(Red fort) దగ్గర జరిగిన పేలుడుతో ఒక్క క్షణంలో శాంతి భగ్నమైపోయింది. సాయంత్రం సుమారు 6 గంటల 50 నిమిషంలో సమయంలో, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నడుస్తున్న హ్యుందాయ్ i20 కారు ఒక్కసారిగా మంటల్లో కాలిపోయింది. ఆ మంటలు క్షణాల్లోనే పక్కనున్న వాహనాలకు వ్యాపించాయి. ఎర్రకోట దగ్గర పొగ కప్పుకోవడంతో.. ఆ దృశ్యం చూసినవారికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టైంది. ఈ పేలుడులో 8మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 20మందికి పైగా గాయపడ్డారు. కొందరిని అగ్నిమాపక సిబ్బంది సమయానికి బయటకు తీసుకొచ్చారు. మరికొందరు తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటు డాక్టర్లు రక్తదాతలను ముందుకు రావాలని కోరుతున్నారు.
పేలుడు జరిగిన కారు హర్యానా నంబర్ ప్లేట్ కలిగి ఉంది. ఆ వాహనం గత కొన్ని నెలల్లో పలుమార్లు యజమానులు మారినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఆ కారు చివరి యజమాని ఎవరో, అది ఎర్రకోట సమీపంలో ఎందుకు ఉందో అనే అంశంపై దర్యాప్తు జరుగుతోంది. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు, బాం*బ్ స్క్వాడ్ బృందం పేలుడు పదార్థాల అవశేషాలను సేకరిస్తోంది.
ఈ ఘటన వెంటనే దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఢిల్లీ నగరాన్ని హై అలర్ట్‌లో ఉంచారు. పక్క రాష్ట్రాల పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు . ఎర్రకోట.. దేశ చరిత్రకు ప్రతీక, స్వాతంత్ర్య దినోత్సవానికి కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతం. అక్కడే ఇంత భారీ పేలుడు జరగడం కేవలం ఒక ప్రమాదం కాదు, అది భద్రతా వ్యవస్థకు ఒక గట్టి హెచ్చరిక. అయితే ఇలాంటి పేలుళ్లు ఢిల్లీలో ఇదే తొలిసారి కాదు. ఢిల్లీ అనే నగరానికి గతమంతా గాయాల జ్ఞాపకాలే. ఎర్రకోట గోడలపై కాలం ఎర్రగా ముద్ర వేసినట్లు, ఉగ్రదాడులు అక్కడ ప్రతి రాయి మీద భయాన్ని చెక్కాయి. 25ఏళ్ల క్రితం డిసెంబర్‌లో రెడ్ ఫోర్ట్ లోపల లష్కరే తోయిబా ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపారు. ఆ ఘటనతోదేశమంతా ఒక్కసారిగా నిలిచిపోయింది. బుల్లెట్లు గోడలను తాకుతూ ప్రతిధ్వనించినప్పుడు ఆ శబ్దంలో భయం, ఆగ్రహం, వేదన కలిసిపోయాయి. రక్తం నేల మీద చిందినప్పుడు అది కేవలం సైనికుల రక్తం కాదు, అది దేశ గౌరవం గాయపడిన క్షణం. ఆ రాత్రి ఢిల్లీ ఆకాశం నిశ్శబ్దంగా ఉన్నా, దాని గుండె మాత్రం ఉరిమింది.
తర్వాతి సంవత్సరాలు ఢిల్లీలో మళ్లీ శాంతిని వాగ్దానం చేసినా, 2008 సంవత్సరం ఆ వాగ్దానాన్ని చిదిమేసింది. ఓ సాయంత్రం, వ్యాపార వీధులు కాంతులతో మెరిసిపోతున్న వేళలో ఒక్కసారిగా ఆ కాంతి మసకబారింది. వరుసగా పేలిన బాంబులు సంతోషాన్ని చీల్చి భయాన్ని మిగిల్చాయి. చప్పట్లు, నవ్వులు, పిల్లల కిలకిలలు ఒక్క క్షణంలో కేకలుగా మారాయి. ఎక్కడ చూసినా పొగ, గందరగోళం, మృతదేహాలు. ఆ సమయంలో ఎవరికీ తెలియదు ఎవరు బ్రతుకుతారో, ఎవరు క్షణంలో మాయమవుతారో. నగర వీధుల్లో వాలిన పొగలో అల్లాడుతూ అగ్నిలో కరిగిన ఆశలు మాత్రమే మిగిలాయి. ఢిల్లీ ఆ రోజు మళ్లీ రక్తపు వాసనను పీల్చుకుంది. ఆ రాత్రి కేవలం ప్రాణాలు కోల్పోయిన వారి కథ కాదు, అది మనిషి క్రూరత్వం ఎక్కడిదాకా వెళ్తుందో చూపించిన ఒక భయానక సత్యం. 2008 వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 26 మంది చనిపోయారు, 130 మందికి పైగా గాయపడ్డారు. ఇటు 2011లో ఢిల్లీ హైకోర్ట్ ముందు జరిగిన పేలుడులో 15 మంది మరణించారు. ప్రతీసారి ఘటనల రూపం మారింది, కానీ ప్రాణాలు మాత్రం సాధారణ ప్రజలవే ఉన్నాయి.
ఇక నవంబర్ 10న జరిగిన పేలుడు కూడా అదే దుస్థితిని మళ్లీ గుర్తుచేస్తోంది. ఒక క్షణం నిర్లక్ష్యం… ఒక చిన్న తప్పు… ఒక అనుమానాస్పద కారు. అంతే, నగరం మొత్తాన్ని భయంతో కమ్మేస్తుంది. ఈసారి కూడా ప్రజలే బాధితులు అయ్యారు. చిన్న చిన్న వ్యాపారులు, రోడ్డుపై ఆగి ఉన్న ప్రయాణికులు, సిగ్నల్ దగ్గర వేచి ఉన్న కుటుంబాలు ఎవరు ఊహించరు, ఆ ఒక్క క్షణం వారిని ఎప్పటికీ మార్చేస్తుందని. దర్యాప్తు సంస్థలు ఇప్పుడు అన్నివైపులా దృష్టి పెట్టాయి. ఇది ఉద్దేశపూర్వక దాడా? కారు లోపం వల్ల జరిగిందా? లేక ఎవరైనా పన్నిన కుట్రలో భాగమా? అన్నది తేలాల్సి ఉంది. NIA, NSG బృందాలు కూడా విచారణలోకి దిగాయి. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ప్రజలకైతే ఇప్పుడు ఒకటే విజ్ఞప్తి.. వదంతులు వ్యాప్తి చేయొద్దు. అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి. ఎవరికైనా అనుమానాస్పద వాహనం లేదా వ్యక్తి కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి. భయంతో కాదు, బాధ్యతతో వ్యవహరించండి. ఇండియా ఇప్పటికే ఎన్నో దాడులు చూసింది. ప్రతి సారి మళ్లీ నిలబడింది. కానీ ప్రతి పేలుడు మన భద్రతా వ్యవస్థల్లో ఉన్న చిన్న లోపాన్ని గుర్తు చేస్తుంది. ఎర్రకోట పేలుడు కూడా అలాంటిదే. అది ఒక హెచ్చరిక, మన అప్రమత్తత ఎంత ముఖ్యమో గుర్తు చేసే గడియారం లాంటిది. జీవితాలు మళ్లీ మామూలు స్థితికి వస్తాయేమో కానీ, ఆ సాయంత్రం మంటల్లో మిగిలిన నిశ్శబ్దం మాత్రం చాలా కాలం గుర్తుండిపోతుంది. ఈ ఘటన వెనుక నిజం ఏది ఉన్నా బయటపడుతుంది కానీ.. మనం నేర్చుకోవలసింది ఒక్కటే..భద్రత అంటే కేవలం గన్‌లు, పోలీసు చెక్‌పోస్టులు కాదు… అది మన చుట్టూ ఉన్న అప్రమత్తత.

Yamuna Expressway Accident: బస్సులో ప్రయాణించడం ఇక సేఫ్ కాదా? ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే ప్రమాదానికి కారణాలేంటి?
Jammu Kashmir: అసలు కశ్మీర్ ప్రజలు ఎవరు? వారి చరిత్ర ఏంటి? ఆ భూభాగాన్ని నాశనం చేసిందెవరు?
Journalism-Terr*rism: టెర్రరిజం స్థాయికి చేరిన జర్నలిజం..! ఏకంగా ఉగ్రవాదులకే సవాల్ విసురుతున్నారుగా!
Pulwama to Pahalgam: ఆర్టికల్-370 రద్దు చారిత్రాత్మక తప్పిదం.. ఈ లెక్కలే సాక్ష్యం!
BJP Victory in Delhi: బీజేపీ ఎలా గెలిచింది? ఆప్ ఎందుకు ఓడింది?
Delhi Congress Downfall: ఆర్యభట్టకు కాంగ్రెస్ ఘనమైన నివాళులు.. హ్యాట్రిక్ బాతు గుడ్లతో ఆల్‌టైమ్ చెత్త రికార్డు.. హస్తిన గడ్డపై హస్తం పార్టీ హీరో నుంచి జీరో స్థాయికి ఎలా పడిపోయింది?