Menu

Alcohol-Cancer: మందుబాబులకు సైంటిస్టులు దిమ్మదిరిగే షాక్‌.. ఓ పెగ్గు మీ జీవితాన్ని చంపేస్తుంది!

Praja Dhwani Desk 1 year ago
alcohol causes cancer

‘మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం..’ ఇది భారత్‌లో లిక్కర్‌(Liquor) బాటిల్స్‌పై ఉండే వార్నింగ్‌ సైన్. అయితే ఈ హెచ్చరిక సరిపోదని చెబుతున్నారు యుఎస్ సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి. ఆయన విడుదల చేసిన నివేదిక ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. మద్యం సేవించడం క్యాన్సర్ కేసుల పెరగడానికి ఎలా కారణం అవుతుందో ఆయన పూసగుచ్చినట్టు వివరించారు. ఈ నివేదిక ప్రకారం అమెరికాలో క్యాన్సర్‌(Cancer) కేసుల పెరుగుదలకు మూడో అతి పెద్ద కారణం మద్యం సేవించడం. అమెరికాలో ప్రతి సంవత్సరం సుమారు 1,00,000 క్యాన్సర్ కేసులు, 20,000 మరణాలు మద్యపానం అలవాటు కారణంగానే రికార్డవుతున్నాయి. ఇటు ఇండియాలో కూడా మద్యం తాగే వారి శాతం చాలా ఎక్కువే. దీంతో ఈ నివేదిక గురించి భారత్‌లోనూ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా లిక్కర్ బాటిల్స్‌పై లేబలింగ్‌ మార్చాలన్న డిమాండ్‌ గట్టిగా వినిపిస్తోంది.

క్యాన్సర్‌ లెబుల్ ఇండియాలో ఎందుకు లేదు:

మద్యంపై క్యాన్సర్‌కు సంబంధించిన హెచ్చరికలను లేబుల్ చేసిన తొలి దేశం ఐర్లాండ్. 2026 నుంచి ఐర్లాండ్‌లో ప్రతి ఆల్కహాల్ బాటిల్ మీద క్యాన్సర్ సంబంధిత హెచ్చరిక తప్పనిసరి కానుంది. అటు దక్షిణ కొరియాలో ఆల్కహాల్‌పై క్యాన్సర్ స్పెసిఫిక్ హెచ్చరికల సైన్ అవసరమని అక్కడి ప్రభుత్వం కూడా భావిస్తోంది. లివర్‌ క్యాన్సర్‌ హెచ్చరికను ఇప్పటికే దక్షిణకొరియా లేబుల్ చేసింది. అటు కెనడా సైతం ఆల్కహాల్‌పై కొత్త విధానాలను రూపొందించే పనిలో ఉంది. క్యాన్సర్ ప్రమాదం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇటు ఆస్ట్రేలియా ఆల్కహాల్ హెచ్చరికల లేబలింగ్ విధానాలను అనుసరిస్తున్నాయి. ఇక న్యూజిలాండ్‌, స్వీడన్‌ సైతం ఇదే తరహా విధానాలను పాటిస్తున్నాయి. ఇటు ఇండియాలో మాత్రం మద్యంపై క్యాన్సర్ హెచ్చరికలు ముద్రించాలన్న తప్పనిసరి రూల్‌ ఏమీ లేదు. కొన్ని రాష్ట్రాలు ‘ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యానికి హానికరం’ అనే సాధారణ హెచ్చరికల లైన్‌ను కలిగి ఉంటాయి. క్యాన్సర్ గురించి ప్రత్యేకమైన లేబలింగ్ ఇండియాలో లేకపోవడం బాధాకరమంటున్నారు డాక్టర్లు. భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 4 లక్షల ఆల్కహాల్ సంబంధిత క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. లక్షా 50 వేల మందికి పైగా కేవలం మద్యపానం అలవాటు-క్యాన్సర్‌ సంబంధిత కారణంతో చనిపోతున్నారు.

మహిళలకు పెరుగుతున్న ముప్పు

ఇక అమెరికా యుఎస్ సర్జన్ జనరల్ నివేదిక ప్రకారం మద్యం సేవించడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని చెప్పేందుకు మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది డీఎన్‌ఏకి సంబంధించిన అంశం. శరీరం అల్కహాల్‌ను అసిటాల్డిహైడ్ అనే రసాయనంగా మార్చుతుంది. ఇది డీఎన్‌ఏను నాశనం చేస్తుంది. దీంతో మ్యూటేషన్లతో పాటు నియంత్రణలో లేని కణాల వృద్ధి సంభవించి, ట్యూమర్లకు దారితీస్తుంది. ఇక రెండోది ఆక్సిడేషన్ అండ్‌ ఇన్‌ఫ్లమేషన్. అసిటాల్డిహైడ్‌ అసిటేట్‌గా మారే ప్రక్రియలో ఆక్సిడేషన్ జరుగుతుంది. దీనివల్ల ప్రమాదకరమైన ఆక్సిజన్ అణువులు ఉత్పత్తి అవుతాయి. ఇవి కణాలను నశించేలా చేస్తాయి. ఇది చివరకు క్యాన్సర్‌కు దారితీసే ఇన్‌ఫ్లమేషన్‌కు కారణం అవుతాయి. అటు మూడోది హార్మోన్ ఉత్పత్తి. మద్యం సేవించడం ద్వారా ఈస్ట్రోజెన్ లాంటి హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. ఇది బ్రెస్ట్‌ క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇక ప్రతి రోజు ఒక బాటిల్ అల్కాహాల్‌ సేవించే స్త్రీలలో బ్రెస్ట్‌ క్యాన్సర్ ప్రమాదం సుమారు 13శాతం ఉంటుంది. రెండు బాటిల్స్‌ సేవించే స్త్రీలలో ఇది 15శాతం వరకు పెరుగుతుంది.

లెబుల్‌ మారాల్సిందే..!

నిజానికి ఏ మోతాదులోనైనా మద్యం సేవించడం సురక్షితం కాదు. ఎంత తాగుతున్నారు? ఎప్పుడు తాగుతున్నారు? ఎంత కాలం నుంచి తాగుతున్నారు? అన్న విషయాలను పక్కన పెడితే ఆల్కహాల్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం అన్నది అద్యయనం చెబుతున్న నిజం. అటు తాగుడు ఎక్కువైతే కాలేయం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. పురుషుల్లో Reproductive హార్మోన్లు తయారు కావటం తగ్గిపోతుంది. వృషణాలు సన్నబడతాయి. చివరకు శృంగార సామర్థ్యం క్షీణించి వంధ్యత్వం వస్తుంది. ఈ విషయంపై ఎక్కువమందికే అవగాహన ఉన్నా క్యాన్సర్‌ కారణాన్ని మాత్రం ప్రభుత్వాలు ఎక్కువగా ఫోకస్ చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇప్పటికైనా అమెరికా సర్జన్ జనరల్ నివేదిక ప్రాధాన్యతను గుర్తించి.. మద్యం లేబలింగ్ విషయంలో భారత్ ఇతర దేశాలను అనుసరించవలసిన అవసరం ఉందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.

Also Read: చైనాలో పడగ విప్పిన HMPV.. ఇండియాకు ముప్పు పొంచి ఉందా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *