Menu

Sophie’s World: నువ్వెవరు? ఈ కులాలు, వర్గాలు ఎవరి సృష్టి? నిజంగా దేవుడు ఉన్నాడా?

Tri Ten B 7 months ago
sophies world

నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఎక్కడికెళ్లినా నా ముందు నడిచిన ప్రశ్నలివి. ఒకప్పుడు మతం నన్ను నిర్వచించింది. కులం నా విలువను లెక్కగట్టింది. మా నాన్న ఎక్కడ పుట్టాడన్న విషయమే సమాజం నన్ను ఎలా చూడాలో నిర్ణయించింది. ఆచారాల్ని పాటించకపోతే తప్పుచేశానన్న భయంతో నిద్రపోయిన రోజులెన్నో..! కాని సరిగ్గా 10ఏళ్ల క్రితం నా జీవితం మారిపోవడం మొదలైంది. అదే రోజున నా చేతుల్లోకి ఓ పుస్తకం వచ్చి చేరింది. పేరు Sophie’s World..! నా ఫ్రెండ్‌ ఇచ్చిన Sophie’s World నా ప్రపంచాన్నే మార్చేస్తుందని నేనప్పుడు అనుకోలేదు. ఆ పుస్తకం చదివే కొద్దీ నా గురించి అప్పటివరకు నాకే తెలియని ఎన్నో విషయాలు బయటకొచ్చాయి. ఇది నిజంగా నేనేనా..? అసలు నా నమ్మకాలు నావేనా? పాటిస్తున్న ఆచారాలను నేను ఎప్పుడైనా ప్రశ్నించానా? నిజంగా దేవుడు ఉన్నాడా? ఈ కులాలు, వర్గాలు ఎవరి సృష్టి? ఇలా ఎన్నో ప్రశ్నలు నాలో పెను భూకంపాలు సృష్టించాయి. నేను ఏం నమ్ముతున్నానో కాదు.. ఎందుకు నమ్ముతున్నానో తెలుసుకోవాలనిపించింది. ఈ ఆలోచనే నన్ను నన్నుగా మార్చింది.

ఎందుకు నమ్ముతున్నావు?

‘ఎందుకు’ అనే పదం జీవితంలో ఎంత అవసరమో తెలిసివచ్చింది. ఏ ఒక్క సమాధానాన్ని కూడా ప్రశ్నించకుండా అప్పటివరకు ఎలా జీవించానో అని బాధేసింది. ఆ పుస్తకంలో ఎదురైన ఓ పేరు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. నా మనసు లోతుల నుంచి మెల్లగా ఆ పేరు పలికింది..! అదే సోక్రటీస్..! నిజం చెప్పాలంటే ఆయన మాటలు నాకు మొదట్లో అంతగా అర్థమవ్వలేదు. కానీ ఆయన వేసిన కొన్ని ప్రశ్నలు నా మనస్సును ప్రశ్నించేలా చేశాయి. ‘ఏం నమ్ముతున్నావ్?’ అనే ప్రశ్న కంటే ‘ఎందుకు నమ్ముతున్నావు?’ అనే ప్రశ్న నాకు కొత్త దారిని చూపించింది. నిజంగా ప్రశ్నించని జీవితం కూడా ఓ జీవితమేనా అనే ఒక్క వాక్యం నా లోపల మార్పుకు నాంది పలికింది. ఆ క్షణం నుంచి నేను ఎలాగోలా బతకడానికి కాకుండా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాను. సోక్రటీస్ మాట్లాడిన ప్రతీ మాట నా లోపల ఒక కొత్త తలుపు తట్టింది. అప్పటివరకు ఉన్న నా నమ్మకాలపై నాకు తొలిసారిగా అనుమానం కలిగింది. ఆ అనుమానం నాకు భయాన్ని కలిగించలేదు. ఎందుకంటే..ఆ అనుమానంలో ఓ ప్రశాంతమైన అలజడి ఉంది. మౌనంగా గాయపడే ఒక భావం ఉంది. తనను తానే ప్రశ్నించుకునే ఓ లోతైన ఆలోచన ఉంది. ఆ లోతుల నుంచే నా నిజమైన ఆత్మాన్వేషణ మొదలైంది.

ప్రశ్నించలేని నమ్మకం మూఢత్వమే కదా!

ఆత్మాన్వేషణ అంటే ఆలోచించడమే కాదు.. ఆలోచనల మధ్య అర్థం కోసం సాగించే ఒక యుద్ధం. ప్రతి ప్రశ్నకు సమాధానం దొరకదు కానీ ఆ ప్రశ్నలే నాకు కొత్త దారులు చూపాయి. ‘ఎందుకు’ అనే ఒక్క పదం నిత్యం నా చుట్టూ తిరిగేది. అప్పటివరకు ఇతరులు నమ్మిన విషయాలనే నేనూ నమ్మాను. నిజం చెప్పాలంటే నా జీవితం నాది కాదనిపించింది. ఇతరుల కలలతో, నమ్మకాలతో బతికే బతుకులా అనిపించింది. నిజాన్ని కనిపెట్టడం అంత ఈజీ కాదు.. మనం ఊహించిన దారిలోనూ ఆ నిజం ఉండకపోవచ్చు. కానీ ఆ దారిలోనే నాకు నేను దొరికాను. ప్రశ్నించలేని నమ్మకం మూఢత్వమే అని తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి నేను పుస్తకాలను చదవడం కాదు.. అవే నన్ను అర్థంచేసుకోవడం మొదలెట్టాయి. ప్రతి పేజీ నా ఆలోచనల్ని ప్రశ్నించేది. ప్రతి పదం నాలో దాగిన భయాల్ని బయటకు తీసుకురావాలని ప్రయత్నించేది. పుస్తకంలో సోఫీ ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రతీ తత్వవేత్తతో పరిచయం చేసుకుంటుంది. అలానే నేనూ పరిచయం అయ్యాను..! ఒక రకమైన జీవన యాత్రలో ప్రయాణం సాగించాను. ఆ యాత్రలో ‘దేవుడు ఎవరు?’ అనే ప్రశ్న కంటే..’దేవుడి ఆవిష్కరణ మనదేనా?’ అనే ప్రశ్న నన్ను మరింత లోతుగా ఆలోచించేలా చేసింది. కులాన్ని, మతాన్ని ఒక ఆచారంగా చూసే కోణం నుంచి, వాటిని ఎందుకు అనుసరిస్తున్నామో అన్వేషించే దారిలోకి ఈ పుస్తకం నన్ను మలిచింది.

ఒక్కోసారి మనల్ని మనం కొత్తగా చూడాలంటే.. పాత నమ్మకాలను పక్కనపెట్టాల్సి వస్తుంది. పుస్తకంలోకి దిగిన నా ప్రయాణం వింతగా మారిపోయింది. ఎందుకంటే… ఆ పుస్తక పేజీలలో తత్వాలు కాదు.. అద్దాలు ఉన్నాయనిపించింది. ప్రతీ తత్వవేత్త అడిగిన ప్రశ్న నాకు అద్దంలా ఎదురైంది. వాటిలో నా ప్రతిబింబం కనిపించేది. ఒక చిన్న వాఖ్యమే కానీ.. ‘నువ్వు నువ్వేనా?’ అని అడిగినప్పుడు గుండె అంతా గందరగోళం అయ్యేది. నేను అప్పటివరకు నమ్మిన దేవుడు, చేసిన పూజలు నన్ను మంచి మనిషిని చేయలేకపోయాయని అర్థమైంది. నిజమైన మానవత్వం అంటే ఏంటో ఆలోచించడం మొదలైంది. ఆ పుస్తకం నాకు ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పింది. నిజమైన మతం అంటే ప్రశ్నించగల ధైర్యం. ఒకసారి ఆ కోణంలో ఆలోచించినప్పటి నుంచి. ‘సమాజం ఏమనుకుంటుందో’ అనే మాటలు నాలో బలాన్ని కోల్పోయాయి. వాటి స్థానంలో ‘నిజం ఏంటీ?’ అనే ఒక్క ప్రశ్న మాత్రమే నిలబడింది.

దేవుడికి రూపం అవసరమా?

ప్రతి ఒక్కరూ పుట్టిన వెంటనే ఓ మతం, ఓ కులం, ఓ ప్రాంతాన్ని మనపై రుద్దేస్తారు. వీటిని మనం ఎంచుకోం.. కానీ వాటి కోసమే బతుకుతామనే భావనలో మనమంతా నలిగిపోతున్నాం. కానీ ఆ పుస్తకం నన్ను ఆ భావాల సుడిగుండాల నుంచి బయటకు తీసింది. ఎందుకంటే సోఫీ ప్రయాణంలో ఒక్క తత్వవేత్త కూడా ‘ఇది ఒప్పుకో’ అని చెప్పలేదు. అందరూ ‘ఇది ప్రశ్నించు’ అని మాత్రమే చెప్పారు. ఇదంతా భయంలేని ఆలోచన.. అదే నిజమైన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛే నాకు కొత్తగా అనిపించింది. చాలా మంది మతగ్రంథాలను నమ్మాలాని చెబుతుంటారు.. కానీ Sophie’s World పుస్తకం నమ్మకాన్ని కాదు… నువ్వు ఎందుకు నమ్ముతున్నావో అన్వేషించు అంటుంది. అప్పటివరకు దేవుడికి ఓ రూపముందని అనుకున్న నేను… ఇప్పుడు దేవుడికి రూపం అవసరమా? అని ప్రశ్నిస్తున్నాను. మతం లేకున్నా మంచి మనిషిగా ఉండలేమా అని నిలదీస్తున్నాను. ఇప్పుడు నన్ను నిర్వచించేది మతం కాదు, కులం కాదు, ప్రాంతమూ కాదు.. నన్ను నిర్వచించేది నా ఆలోచనలే..! ఒక్కమాటలో చెప్పాలంటే నార్వే రచయిత జోస్టీన్ గార్డర్ 1991లో రాసిన Sophie’s World నవల నాతో నన్నే కలిపింది. నా ఆలోచనలను స్వేచ్ఛగా తేల్చుకునే హక్కునిచ్చింది. నిజానికి ఇది ఓ పుస్తకం కాదు.. నా అంతరంగాన్ని పేజీలుగా మలిచిన అద్దం. ఇప్పుడు ఎవరైనా నన్ను ‘నువ్వెవరు’ అడిగితే అని ఒకే మాట చెబుతాను. నన్ను నేను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న ఒక మనిషిని అని జవాబిస్తాను. నేను బతికినంత కాలం ఈ ప్రశ్న నాతో నడుస్తూనే ఉంటుంది కానీ.. ఇప్పుడు నేను భయపడుతూ వెనక్కి చూసే వ్యక్తిని కాదు.. ప్రశ్నిస్తూ ముందుకు నడిచే వ్యక్తిని.. ఈ ప్రశ్నించడమే నా బలం..నా పవర్‌.. ఇదే సోఫీ నేర్పిన పాఠం!

ALSO READ: ‘మగాడిద’లు పీక్కుతింటున్నాయ్..! టీవీ 3*3 ఛానెల్‌ పెద్దలు ఓసారి దీన్ని చదవాలి!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *