Menu

World Atheist Day: మతాల మంటల నడుమ, దేవుడినే ధిక్కరించిన భావజాలం; నాస్తికత్వం!

Sumanth Thummala 11 months ago

Atheist Day: మతం-దేవుడు. ఈ రెండు మానవ నాగరికతను మార్చడంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించాయి. మంచికైనా చెడుకైనా, మతం అనే వ్యవస్థ దేవుడు అనే భావన ఈ రెండు మనిషిని నడిపించాయి. నడిపిస్తూనే ఉన్నాయి.‌ కానీ ఈ రెండూ లేకుండా మనిషి మనుగడ సాధించలేడా? కచ్చితంగా ఉండొచ్చు. అలా ఉండి చూపించిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్లనే నాస్తికులు అని అంటున్నాం.

అసలేంటీ నాస్తికత్వం?!

నాస్తికత్వం ను ఇంగ్లీష్ లో Atheism అంటారు. నాస్తికత్వానికి అర్థం చాలా చాలా సింపుల్. దేవుడు అనే‌ వాడు ఉండడు అని ధృడ నిశ్చయంతో ఉండడం లేదా దేవుడు ఉన్నాడు అనేదానికి ఆధారాలు లేకపోవడం వల్ల ఏర్పడిన భావన.. ఒక ఐడియాలజీ.

నాస్తికత్వం దాని ప్రశ్నలు!

దేవుడిని నమ్మను అని చెప్పగానే ఆస్తికులు వేసే ప్రశ్న, మతము దేవుడు లేకపోతే మంచి చెడు ఎలా పుట్టాయి? అవి లేకపోతే అల్లకల్లోలం అయ్యేది కదా! అంటారు.‌ దానికి సమాధానం మంచికి – చెడుకి తేడా తెలియడానికి మనకు మతం అక్కర్లేదు సహనుభూతి(Empathy) ఉంటే చాలు. కొన్నిసార్లు వీడియోలో చూస్తుంటాం, ఒక కాకి చనిపోతే చుట్టూ ఉన్న కాకులు వచ్చి దానికోసం అరుస్తాయి. ఒక ఏనుగు చనిపోతే దాని చుట్టూ జరిగే ఆ ఏనుగుల మంద బాధపడుతాయి.‌ మనిషి మిత్రుడు గా ఉన్న కుక్కలు కూడా మనుషులకు సాయం చేయడం గమనించే ఉంటాం. మరి వీటికి ఏ మతం ఉందని?

దేవుడు లేరని మీరు ఎలా చెప్పగలరు? ఉన్నాడనే దానికి ఆస్తికులకు ఉన్న ఆధారమేంటి! వాళ్ళు ఉన్నారని నమ్ముతున్నారు అంతే. నిరూపించలేదు. దేవుడు అనేవాడు ఉంటే ఈ ప్రపంచంలో అశాంతి, విద్వేషాలు, ఆకలి చావులు, మతం – దేవుడి పేరుతోనే కొట్లాటలు, మోసాలు, దోపిడి జరుగుతున్నాయి కదా! వీటినే ఆపలేని దేవుడు మరి మన జీవితాన్ని ఎందుకు మారుస్తాడు? అని నాస్తికుల సవాల్.

highest population religions

మరి నాస్తికులు దేన్ని నమ్ముతారు? దేన్ని పాటిస్తారు?

నాస్తికులు దేవుడిని నమ్మకపోయినా, తర్కం (Logic), శాస్త్రీయ దృక్పథం (Scientific Temper), మానవ వాదం ( Humanism) హేతువాదం ( Rationality), కారణం (Reason) వంటి వాటిని ఆధారంగా చేసుకుని ముందుకెళ్తారు.

* నాస్తికులు అందరూ మంచివాళ్ళు అవ్వాలని లేదు.వాళ్లలో కూడా మూర్ఖులు ఉంటారు నేరస్తులు ఉంటారు. కానీ నాస్తికత్వం ఎప్పుడూ కూడా మతాల మాదిరిగా ఒకరికి సాగిలపడమని, మూఢంగా ఉండమని, మనుషుల్ని వివక్ష గురి చేయమని, హింసించి చంపమని, బానిసత్వాన్ని ప్రచారం చెయ్యదు. కానీ మతాలు చేస్తాయి.

* అసలు నాస్తికత్వానికి ప్రార్థన మందిరాలు వంటివి ఏమీ ఉండవు. జ్ఞానం పరిఢవిల్లే ప్రతి ప్రాంతం నాస్తికత్వానికి పునాదులే.

* మనకు తెలియని ఎన్నో విషయాలు మతం నేర్పిస్తుందని మతస్తులు వాదిస్తారు. దానికి ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఒక ఇంటర్వ్యూలో అంటాడు. “మతం అనేది తెలియని విషయాలను అర్థం చేసుకోవడానికి మానవాళి చేసిన తొలిదశ ప్రయత్నం. కానీ ఇప్పుడు, శాస్త్రీయ విజ్ఞానం ఆ పాత్రను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తోంది.”

stephen hawking on religion

మతం ఇంకా విజ్ఞానం మధ్య ప్రాథమిక తేడా ఉంది. మతం అధికారంపై ఆధారపడితే, విజ్ఞానం పరిశీలన మరియు తర్కంపై ఆధారపడుతుంది. విజ్ఞానం గెలుస్తుంది, ఎందుకంటే అది పని చేస్తుంది.” అని హాకింగ్ అభిప్రాయం.

ప్రపంచంలో నాస్తికత్వం:

మనిషికి దేవుడు లేడు అనే భావన కొత్తేం కాదు. అలాగే నాస్తికులు ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో ఉన్నారు. కాకపోతే అన్ని సమాజాలు దీన్ని బహిరంగంగా అంగీకరించే వ్యవస్థ ఉండదు. పాకిస్థాన్, సౌదీ,ఇరాన్, కువైట్, ఖతార్ వంటి దేశాల్లో నాస్తికత్వం, దైవదూషణ (Blasphemy) నేరంగా చూస్తారు. జైల్లో పెడతారు.చంపేస్తారు కూడా!

UNITED STATES COMMISSION on INTERNATIONAL RELIGIOUS FREEDOM సంస్థ ప్రకారం 195 దేశాలకు గాను 95 దేశాల్లో దైవదూషణకు మరణ శిక్ష నుండి జరిమానా వరకు శిక్షలు ఉన్నాయి.
ఇవన్నీ కూడా అధికారికంగా మతం ఆధారిత పాలన చేసే దేశాలు.

ఇక అలా లేని దేశాల్లో కూడా నాస్తికులకు వివక్షలు ఎదురవుతాయి.‌ కొన్ని సందర్భాల్లో వారు పరోక్ష వెలివేతకు గురవుతారు.‌ దైవాన్ని ప్రశ్నించడం తప్పుగా చేస్తారు. మత మనోభావాలు దెబ్బతీశారు అని చెప్పి మనదేశంలో కూడా పలు సందర్భాల్లో వ్యక్తులు అరెస్టు కావడం చూశాం.

మరోవైపు నాస్తికులు అధికంగా ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. చైనా, జపాన్,స్వీడన్ దేశాల్లో అత్యధికంగా దేవుని నమ్మని వారే ఉన్నారు. అలాగే మతానికి దేవుడికి దూరంగా జరుగుతున్న దేశాలు కూడా చాలానే ఉన్నాయి. ఇటీవల ప్రకటించిన బ్రిటన్ జనాభా సర్వేలో ఈ మతాన్ని ఆచరించని వాళ్ళ జనాభా 37% దాటింది.
కొసమెరుపు ఏంటి అంటే ఇలా దేవుడిని నమ్మని జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లోనే మానవ అభివృద్ధి సూచికలు, స్వేచ్ఛ, ఓపెన్ మైండెడ్ సమాజాలుగా ఉంటూ లౌకికత్వం (సెక్యులరిజం) ను ఆచరిస్తున్నాయి.

* నేరాల శాతం కూడా ఈ దేశాల్లోనే అతి తక్కువగా నమోదు అవుతాయి.

ఇండియాలో నాస్తికత్వం

మన దేశానికి నాస్తికత్వం అసలు కొత్తేం కాదు. 6 B.C.E కి ముందే ఇక్కడ చార్వాకులు ఉన్నారు. తాత్విక సమాజంలో వీరిని లోకాయతులు అన్నారు .వీరు దేవుడిని నమ్మరు, వేదాలను ఇతర మత గ్రంథాలను తిరస్కరించారు. వీరు భౌతిక వాదాన్ని ఆచరిస్తారు. ఈ భౌతిక వాదానికి ఆద్యుడుగా అజిత కేశకంబలి అనే‌ తత్వవేత్తను పరిగణిస్తారు.

గౌతమ బుద్ధుడు దేవుడు లేడని, మనుషులను సమానంగా చూడాలని చెప్పిన మొదటి మానవవాదుల్లో ఒకడు.
ఆస్తిక – నాస్తిక చర్చలు ఉపఖండంలో ముందు నుంచి కూడా ఉన్నాయి.

ఆధునిక భారతదేశంలో కాలంలో కూడా ప్రముఖ నాస్తికులు ఉన్నారు. భగత్ సింగ్, పెరియార్ రామస్వామి, ఎం.ఎన్ రాయ్,గోరా(గోపరాజు రామచంద్రరావు), నరేంద్ర దబోల్కర్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ , జాన్ అబ్రహం, అమర్త్యసేన్, విజయ్ సేతుపతి, మణిరత్నం,జావెద్ అక్తర్ లాంటి ప్రప్రముఖులు ఉన్నారు.
ఇక రాజకీయ రంగంలో పెరియార్ స్ఫూర్తితో ద్రవిడ పార్టీలో చాలామంది నాస్తికులు ఉన్నారు. డీఎంకే వ్యవస్థాపకులు కరుణానిధి సైతం బహిరంగంగా దేవుని మతాలని విమర్శించాడు. అలాగే కమ్యూనిస్టు నాయకులు కూడా ఎంతోమంది ఉన్నారు. దేశంలో 5% – 6% మంది దేవుణ్ణి నమ్మరు అనేది అంచనా. ఇక దేశంలో ఇప్పటికి నాస్తికులు అని చెప్పుకునే పూర్తి స్వేచ్ఛ లభించట్లేదు. తమను ఎక్కడ తక్కువగా చూస్తారేమో అని ఆందోళన పడతారు. అలాగే ఇండియాలో ఇప్పటికీ చట్టం నాస్తికులను ప్రత్యేకంగా గుర్తించదు.

పొగరుతో కాదు ఆలోచన వివేకంతో:

నాతికత్వం అంటే అదేదో ప్యాషన్ అనో, పొగరుతోనో ఆచరించే విషయం కాదు. దానికి ఎంతో ధైర్యం తర్కం తో కూడిన ఆలోచన కావాలి. భగత్ సింగ్ తను రాసిన నేనెందుకు నాస్తికుడినయ్యాను (Why Iam an Atheist) పుస్తకంలో తన అనుభవాన్ని ఈ విధంగా చెబుతాడు. తన నాస్తికత్వం గురించి ఓ మిత్రుడు “మీ జీవితాంతంలో మీరు దేవుని నమ్మడం ప్రారంభిస్తారు!” అని అన్నారు. నేను చెప్పాను, “లేదు మిత్రమా, అలా జరగదు. నేను ఆ పనిని ఒక హీనమైన, నైతికపరమైన దిగజారింపుగా భావిస్తాను. స్వార్థ ప్రయోజనాల కోసం నేను ప్రార్థించను.

పాఠకులారా, మిత్రులారా, “ఇది అహంకారమా?
అవుననుకుంటే, నేను దాని కోసం నిలబడతాను!”
నేను ఉరితీయబడే రోజున, నేను దేవుణ్ని గుర్తు చేసుకోను. గర్వంతో నా హృదయంలో, విప్లవ నినాదంతో నా పెదవులపై మరణిస్తాను.

నేను నవ్వుతూ మరణాన్ని స్వాగతిస్తాను.
ఎందుకంటే, ఒకసారి నేను దేవుని భయపడే మనిషిగా మారితే, నేను భయపడే బలహీనుడిగా మారిపోతాను అని నాకు తెలుసు!” అని ప్రకటించాడు.bhagat singh atheism

 

నోబెల్ బహుమతి విజేత శాస్త్రవేత్త సివి రామన్
స్వర్గం లేదు- నరకం లేదు-పునర్జన్మ లేదు- అమరత్వం లేదు. ” అని అన్నాడు.

cv raman rationalism atheism

గురజాడ అప్పారావు ” మతములన్నీ మాసిపోవును జ్ఞానం ఒక్కటి వెలుగును” అని ఆకాంక్షించారు.

పెరుగుతున్న చదువు, విజ్ఞాన శాస్త్రం, తార్కిక ఆలోచనలు ప్రపంచంలో నాస్తికత్వాన్ని పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రపంచంలో నాస్తికుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది.

ALSO READ: కళ్ళ ముందు పెనుభూతం,చోద్యం చూస్తున్న పాలకులు ప్రజలు.. తర్వాత జరిగేది ఇదే!

 


Written By

Sumanth Thummala is aContent Writer and the co-founder of Prajadhwani news. He works passionately toward creating positive change in the world through meaningful, responsible writing.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *