Delhi Election Results: ఒకప్పుడు.. ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ నాయకులు ర్యాలీలకు వస్తే జనాలు బ్రహ్మరథం పట్టేవారు. నగరం పోటెత్తేది. త్రివర్ణ రంగు జెండాలు రెపరెపలాడేవి. ఎక్కడ చూసినా కాంగ్రెస్ నినాదాలే వినిపించేవి. 1998లో షీలా దీక్షిత్(Sheila Dikshit) రంగప్రవేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో రాజ్యమేలింది. ఆమె ఆధ్వర్యంలో ఢిల్లీ రూపురేఖలు మారిపోయాయి. మెట్రో రైలు, రహదారుల విస్తరణ, విద్యుత్ సరఫరాలో విప్లవాత్మక మార్పులు.. వీటన్నింటితో ప్రజలు కాంగ్రెస్ వైపే చూసేవారు. 15 ఏళ్ల పాటు ఆమె ఢిల్లీ రాజకీయాలను శాసించారు. కానీ, రాజకీయాల్లో శాశ్వతం అనేదే ఏది ఉండదు. అందుకు ప్రస్తుత ఢిల్లీ ఎన్నికల ఫలితాలే అతి పెద్ద ఉదాహరణ. కాంగ్రెస్ ఓడిపోతుందని అంతా భావించారు కానీ ఇంతటి ఘోరపరాభవాన్ని ముచ్చటగా మూడోసారీ మూటగట్టుకుంటుందని ముందుగా ఎవరూ ఊహించలేదు. పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థుల్లో చాలా మంది తమ డిపాజిట్లు కూడా కాపాడుకోలేకపోయారు. ఢిల్లీలో అసలు ఎవరూ కాంగ్రెస్ గురించి మాట్లాడుకునే పరిస్థితిలో లేరు. 12ఏళ్ల క్రితం వరకు ఢిల్లీని పాలించిన పార్టీ ఈ రోజు అస్తిత్వం కోల్పోయే స్థితిలో నిలిచింది. దీనికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.
1) తన్నితరిమేసిన ఆప్
2013లో ఢిల్లీ రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఒక కొత్త పార్టీ.. ఆమ్ ఆద్మీ పార్టీ.. రాజకీయ బలమైన ప్రజాస్వామ్య విప్లవాన్ని తెచ్చింది. కేజ్రివాల్ నాయకత్వంలో ఆప్ పార్టీ ప్రజాసమస్యలను పరిష్కరిస్తామంటూ దూసుకొచ్చింది. ఓటర్లలో కొత్త చైతన్యాన్ని తీసుకొచ్చింది. మహిళలపై లైంగిక దాడులు, తీవ్ర అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్ పాలనపై ఉన్న కోపం ఆప్‌కు వరంగా మారింది. 2015 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా సున్నా స్థానాలకు పడిపోయింది. 70 స్థానాల్లో పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. 2020లోనైనా కాంగ్రెస్ నిలదొక్కుకుంటుందా అనే ఆశకు గండి కొట్టేలా ఓటర్లు తీర్పు ఇచ్చారు. నాటి ఎన్నికల్లో కేవలం 4.26శాతం ఓటు షేర్‌ను సాధించింది కాంగ్రెస్. 2025లోనూ సేమ్ టు సేమ్ రిపీట్. ఘోరమైన హ్యాట్రిక్ ఓటములు మూటగట్టుకుంది కాంగ్రెస్.
2) సరైన కెప్టెన్ లేకపోవడం
అటు షీలా దీక్షిత్ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ తలెత్తి తిరిగింది. కానీ, ఆమె తర్వాత ఎవరు? లీడర్ లేని పార్టీ ఎక్కడికైనా వెళ్ళగలదా? ఇది అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. పార్టీని ఒక్క వ్యక్తిపై ఆధారపడేలా నడపటం కాంగ్రెస్ పతనానికి ప్రధాన కారణం. ఢిల్లీలోనూ అదే జరిగింది. షీలా దీక్షిత్ తర్వాత పార్టీని ఆ స్థాయిలో నడిపే వారే కరువయ్యారు.
3) పాత డబ్బా అదేపనిగా కొట్టుకోవడం
ఇక గతం గొప్పదని పదేపదే చెప్పుకుంటే ఓట్లు పడవు. కానీ, కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికీ అదే ఫార్ములాను నమ్ముతుంది. ఫ్రీ కరెంట్, ఫ్రీ హెల్త్‌కేర్ లాంటి పథకాలతో ఆప్ కొత్త తరాన్ని ఆకర్షించింది. ఇటు బీజేపీ 27ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై జెండా పాతడానికి అష్టకష్టాలూ పడింది. ఆప్ ఎమ్మెల్యేలపై ఉన్న అవినీతి మరకలను హైలెట్ చేస్తూ ఓట్లు కొల్లగొట్టింది. ఇటు కాంగ్రెస్ మాత్రం 1998లో చేసిన అభివృద్ధే గురించే చెబుతూ కూర్చుంది.
4) ఏసీ గదుల నుంచి ప్రజలకు దగ్గరవ్వాలని చూడడం
ఒకప్పుడు ఢిల్లీలో చిన్న వ్యాపారస్తులు, మధ్య తరగతి, పేదలు కాంగ్రెస్‌ను నమ్మేవారు. కానీ ఆ వర్గాలు మొత్తం ఆప్, బీజేపీ వైపు వెళ్లిపోయాయి. ఆటో డ్రైవర్ల నుంచి ఢిల్లీ మురికివాడల్లో నివసించే ప్రజల వరకు ఎవ్వరూ కాంగ్రెస్‌ను నమ్మడంలేదు. ఎందుకంటే ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు ప్రజల మధ్య తిరగడమే మానేశారు. గాంధీ కుటుంబంపై అధికంగా ఆధారపడుతూ.. వారి ఇమేజే ఓట్లు తీసుకొస్తుందని భావించి బోల్తా పడ్డారు.
5) రాహుల్ గాంధీ బ్రెయిన్‌లెస్ ప్లాన్స్
ఇక ఈ ఎన్నికల్లో ఓడిపోవడానికి INDIA కూటమి అనుసరించిన ప్లాన్ ప్రధాన కారణం. కాంగ్రెస్ ఒకవైపు ఆప్‌తో పొత్తులో ఉంది. మరోవైపు అదే పార్టీపై విమర్శలు చేసింది. దీనికి తోడు రాహుల్ గాంధీ పకడ్బందీ ప్రణాళికలు లేని గేమ్ ప్లాన్ కాంగ్రెస్ పార్టీకి చేటు చేశాయనే చెప్పాలి.
ఇది కూడా చదవండి: హిందువులకు ద్రోహం చేస్తున్న సనాతన పార్టీ.. మహాకుంభమేళ మృతుల సంఖ్యపై న్యూస్‌లాండ్రీ షాకింగ్ రిపోర్టు!