Menu

Mahakumbhmela Stampede: హిందువులకు ద్రోహం చేస్తున్న సనాతన పార్టీ.. మహాకుంభమేళ మృతుల సంఖ్యపై న్యూస్‌లాండ్రీ షాకింగ్‌ రిపోర్టు!

Praja Dhwani Desk
mahakumbhmela death toll stampede

ఓ చలి రాత్రి.. అది ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లోని మోతీలాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ.. అక్కడి ఫ్రీజర్ గదిలో శవాలు కూర్చొని ఉన్నాయి. దాని చుట్టూ తల్లి, తండ్రి, భార్య, భర్త… ఎవరెవరో ఉన్నారు! ప్రేమతో పెంచిన బిడ్డలు, భర్తను కోల్పోయిన భార్యలు, తల్లిని కోల్పోయిన పిల్లలు… అయితే ప్రభుత్వానికి ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమేనా? మహాకుంభమేళ(Mahakumbhmela)లో స్నానం ఆచరించేందుకు వెళ్లి తొక్కిసలాటలో చనిపోయింది 30 మంది కాదా? 79 మంది మరణించారా? వార్తా సంస్థ న్యూస్‌లాండ్రీ(Newslaundry) ఇన్‌వెస్టిగేషన్‌ రిపోర్టు ఏం చెబుతోంది?

పోస్ట్‌మార్టం ఎందుకు చేయలేదు?

జనవరి 29, 2025.. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ మేళాకు మౌనీ అమావస్య కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సంగమ ఘాట్‌పై లక్షలాది మంది భక్తులు తిష్టవేశారు. పవిత్ర స్నానం కోసం నదిలోకి అడుగుపెట్టాలని ఆత్రం వారిది. ఇంతలోనే ఓ చీకటి గడియ ఆ ప్రాంతాన్ని ఆవహించింది. అర్థరాత్రి దాటి ఒంటి గంట సమయంలో భక్తులను నియంత్రించేందుకు వేసిన తాత్కాలిక బారికేడ్లు ఒక్కసారిగా విరిగిపోయాయి. ఒకరిని ఒకరు తొక్కుకుంటూ ముందుకువెళ్లారు. బిడ్డలు తల్లిదండ్రుల చేతుల నుంచి జారిపోయారు. స్త్రీలు, వృద్ధులు నేలపై పడిపోయి నిస్సహాయంగా అరుస్తున్నారు. నిమిషాలు గడిచేకొద్దీ వేల మంది నేల మీద పడి నిశ్శబ్దంగా మౌనంగా మారిపోయారు. చాలాసేపటి తర్వాత వారిని ఆస్పత్రులకు తరలించారు. అదే రోజు సాయంత్రం తొక్కిసలాటలో 30 మంది చనిపోయారని 60 మందికి గాయాలయ్యాయని ప్రభుత్వం నుంచి మొదటి అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఈ లెక్కలు నమ్మేలాగా లేవని ప్రతిపక్షాలు మొదటి నుంచే ఆరోపిస్తూ వచ్చాయి. మరోవైపు న్యూస్‌లాండ్రీ జర్నలిస్టులు ప్రయాగరాజ్‌కు వెళ్లారు. మూడు రోజుల పాటు ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. అన్ని మృతదేహాలను మోతీలాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి తరలించామని ప్రభుత్వమే ప్రకటించడంతో అక్కడే అసలు నిజం తెలుసుకోవాలని ప్రయత్నించారు. న్యూస్‌లాండ్రీ రిపోర్టర్ల ప్రకారం జనవరి 29న.. అంటే తొక్కిసలాట జరిగిన రోజు 69మంది చనిపోయినట్టు ఆస్పత్రి లిస్ట్‌ చెబుతోంది. వీరిలో 10 మంది పురుషులు, మిగతా 59 మంది మహిళలు. వీరంతా ఇతర కారణాలతో చనిపోయి ఉండొచ్చు కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడే మరో విషయాన్ని న్యూస్‌లాండ్రీ బయటపెట్టింది. సాధారణంగా ఎవరు చనిపోయినా డాక్టర్లతో పోలీసులు పోర్ట్‌మార్టం చేయిస్తారు. కానీ ఈ మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించలేదు.

తొక్కిసలాటలో చనిపోతే సహజ మరణాలు అంటారా?

వీరిలో 66 మృతదేహాలను కుటుంబాలకు ఫిబ్రవరి 3న అప్పగించినట్టు న్యూస్‌లాండ్రీ రిపోర్టు చెబుతోంది. మూడు శవాలు ఇప్పటికీ గుర్తుతెలియని విధంగా ఉన్నాయి. ప్రభుత్వం పోస్ట్‌మార్టం జరిపిస్తేనే అసలు మరణ కారణం బయటపడుతుంది. తొక్కిసలాట వల్ల ఎంతమంది చనిపోయారనేది స్పష్టమవుతుంది. కానీ ఇవేవీ చేయకుండానే మృతదేహాలను కుటుంబాలకు ఎందుకు అప్పగించారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సహజ మరణాలకు కూడా పోస్ట్ మార్టం చేస్తారు కదా.. మరి ఒక్క రోజే ఒక్క ఆస్పత్రిలో 69 మృతదేహాలు ఉంటే వాటిలో ఏ ఒక్కదానికి పోస్ట్‌మార్టం ఎందుకు చేయలేదని న్యూస్‌లాండ్రీ రిపోర్టు ప్రశ్నిస్తోంది. అటు పోలీసుల తీరుపైనా న్యూస్‌లాండ్రీ సంచలన ఆరోపణలు చేసింది. గ్వాలియర్ నుంచి మహాకుంభమేళకు మాన్సింగ్ కుటుంబం వచ్చింది. తొక్కిసలాట జరిగినప్పుడు ఆయన ఇద్దరు బంధువులు, కొంతమంది స్నేహితులతో సంగం నోస్‌లో ఉన్నారు. ఆ రోజు నుంచి వారి ఆచూకీ తెలియకపోవడంతో మాన్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌ గడపతొక్కాడు. అతని ఇద్దరి బంధువుల్లో ఒకరైన ప్రసాద్‌ అనే వ్యక్తి చనిపోయినట్టు పోలీసులు చెప్పారు. అయితే కారణం మాత్రం తొక్కిసలాట అని చెప్పలేదట. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ప్రసాద్‌ చనిపోయినట్టు పోలీసులు తనతో ఒక లేఖ రాయించి బలవంతంగా సంతకం చేయించారని మాన్సింగ్‌ న్యూస్ లాండ్రీకి చెప్పారు. ఈ తరహా ఘటనలనే మరో రెండిటిని న్యూస్‌లాండ్రీ రిపోర్ట్ చేసింది.

ఆ 15000మంది జాడ ఎక్కడ?

మరోవైపు ఇదే అంశంపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. తొక్కిసలాట తర్వాత 15,000 మంది గల్లంతయ్యారంటూ ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. కానీ ప్రభుత్వం వేల మంది మిస్సింగ్‌పై స్పందించడంలేదని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపిస్తోంది. ఇక వేల మంది చనిపోతే 30మంది చనిపోయినట్టుగా యూపీ ప్రభుత్వం అబద్ధమడుతోందని శివసేన ఉద్ధవ్‌ వర్గం ఆరోపించింది. అటు ప్రభుత్వం డెడ్‌బాడీలను మాయం చేసేందుకు JCBలు వాడిందని వాదనా వినిపిస్తోంది. మహా కుంభమేళ తొక్కిసలాట మరణాల గురించి అఖిల పార్టీ సమావేశం పెట్టాలని.. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బాధ్యత ఆర్మీకి అప్పగించాలన్న డిమాండ్‌ను ప్రతిపక్షపార్టీలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిజానికి ఒకరి మరణించినా.. 100మంది మరణించినా ఆ లెక్క బయటపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది. అటు మహాకుంభమేళ తొక్కిసలాట తర్వాత 30 మంది చనిపోయారని.. 60మంది గాయాలతో ఉన్నారని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత వీటి గురించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకపోవడంపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: రాజ్యం చేసిన ద్రోహం! ప్రొఫెసర్ సాయిబాబా మరణం!!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *