జీవితం ఒక ప్రయాణం… కాని కొన్నిసార్లు అనేక ఆరోగ్య సమస్యలతో ఈ ప్రయాణాన్ని కొనసాగించలేని స్థితి ఏర్పడుతుంది. ఓవైపు మెడికల్ సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్నా కొన్ని పరిస్థితుల్లో రోగులు తీవ్రమైన కష్టాలను అనుభవిస్తుంటారు. ఎలాంటి ఆశ లేకుండా జీవితంతో పోరాడుతూ ఉంటారు. ముఖ్యంగా మెషీన్ల సహాయంతో కాలం వెళ్లదీస్తుంటారు. ఇలాంటి బాధితులకు తమ చివరి రోజులను గౌరవంగా గడిపే అవకాశం ఇవ్వాలని వాదించే వారు ఉంటారు. అందులో కర్ణాటక(Karnataka) ప్రభుత్వం కూడా ఒకటి. ఆ ఆలోచనతోనే ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు 2023 జనవరిలో ఇచ్చిన తీర్పును అనుసరించి ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘గౌరవంతో మరణించేందుకు హక్కు’ను కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
యూతనేసియా కాదు..
దీని కొంతమంది యూతనేసియా అని పొరపడుతున్నారు. యూతనేసియా(Euthanesia) అంటే కారుణ్య మరణమని అర్థం. ఒక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు తమను చట్టబద్ధంగా చంపమంటూ కోర్టు గడపతొక్కిన సందర్భాలు మీకు గుర్తుండే ఉంటాయి కదా.. అప్పుడు కోర్టు అనుమతి ఇస్తే దాన్ని కారుణ్య మరణం అని పిలుస్తారు. కానీ కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వులు మాత్రం వేరు. కేవలం ‘చికిత్సను నిలిపివేయడం’పై మాత్రమే ప్రభుత్వం దృష్టి పెడుతుంది. అంటే మెషీన్లు లేదా ఇతర లైఫ్ సపోర్టింగ్ యంత్రాల ద్వారా బలవంతంగా చికిత్సను కొనసాగించకుండా ఉండవచ్చు. మానవీయ దృష్టితో రోగి కుటుంబసభ్యులు ఈ నిర్ణయాన్ని తీసుకునే అవకాశాన్ని కర్ణాటక ప్రభుత్వం కల్పిస్తుంది.
అంతా నామినీల చేతుల్లోనే
ఇక నిర్ణయాన్ని అమలు చేయడానికి రెండు మెడికల్ బోర్డులు ఏర్పాటవుతాయి. ఒక బోర్డు రోగి చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో ఉంటుంది. రెండోది జిల్లా స్థాయిలో ఉంటుంది. దీనికి జిల్లా ఆరోగ్య అధికారి-DHO సభ్యుడిగా ఉంటాడు. ఈ బోర్డులు రోగి వాస్తవ పరిస్థితిని నిర్ధారించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాయి. దీనివల్ల ఎవరూ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, ప్రతి రోగికి న్యాయమైన వైద్యం అందేలా చూడవచ్చు. దీని కోసం కర్ణాటక ప్రభుత్వం అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. రోగి కోసం ఇద్దరు నామినీలు ఉండాలి. భవిష్యత్తులో ఓ వ్యక్తి కోమాలోకి వెళ్లినప్పుడు లేదా నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ ఇద్దరిలో ఎవరైనా బాధితుడి చికిత్స గురించి నిర్ణయం తీసుకోవచ్చు. వైద్యం అందించడం, లేదా నిలిపివేయడం వీరి చేతుల్లోనే ఉంటుంది. ఆ తర్వాత పైన చెప్పిన రెండు మెడికల్ బోర్డులు నామినీల రిక్వేస్ట్‌పై నిర్ణయం తీసుకుంటాయి. ఇది పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలి.
భారత్‌లో తొలిసారిగా కర్ణాటక ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కానీ, ఇతర దేశాల్లో ఇదే విధమైన చట్టాలు చాలా కాలం నుంచే అమల్లో ఉన్నాయి. నెదర్లాండ్స్, బెల్జియం, స్విట్జర్లాండ్‌లో కారుణ్య మరణాలకు కూడా చట్టబద్ధత ఉంది. అటు కెనడా, జర్మనీ దేశాల్లో కొన్ని పరిస్థితుల్లో ఇలాంటి మానవీయ మరణానికి అనుమతి ఉంది.
ALSO READ: దుఃఖం చిమ్మిన ప్రదేశం.. ముంచేసిన మూఢత్వం.. ఏంటీ నోజ్ స్పాట్?