ఒకసారి భూమి(Earth) ఎలా తిరుగుతుందో చూడండి..! గోళాకారంలో ఉండే భూమి ఇలా వంగి.. అంటే Tilt అయ్యి ఎందుకు తిరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? భూమి పుట్టుక తొలినాళ్లలో థియా అనే ఓ గ్రహం ఎర్త్‌ని ఢీకొట్టింది. అందుకే భూమి వంగి ఉంటుంది. భూమికి ఈ వంపు లేకపోతే రుతువులు ఉండవు.. ఎండాకాలం, చలికాలం లాంటివి ఉండవు. ఒక గ్రహం ఢీకొడితే ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. అలానే ఓ గ్రహశకలం.. అంటే Asteroid భూమిని ఢీకొట్టినా అది చాలా ప్రభావం చూపుతుంది. కోట్లాది సంవత్సరాలగా భూమి అనేక మార్పులకు గురికావడానికి ఇవి ప్రధాన కారణాలు. మరోసారి అలాంటి ముప్పే భూమికి ఉందని నాసా(NASA) సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
ముందుముందు ముప్పు తప్పదా?
నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు ఓ ఆపదను గుర్తించాయి. ఓ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశముందట. 2032 డిసెంబర్ 22న ఇలా జరిగే ఛాన్స్ ఉందని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. నాసా లెక్కల ప్రకారం ఈ గ్రహశకలానికి భూమిని తాకే అవకాశం ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే ఉంది. అయితే ఇది ప్రస్తుత అంచనా మాత్రమేనని సైంటిస్టులు క్లారిటీ ఇస్తున్నారు. గ్రహశకలం కదులుతున్న తీరు తర్వాత ఏ దిశలో మారుతుందో చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. గతంలోనూ ఊహించని విధంగా కొన్ని గ్రహశకలాలు భూమిని ఢీకొట్టాయని గుర్తు చేస్తున్నారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ గ్రహశకలం ముప్పు టొరినో స్కేల్‌పై మూడో స్థాయిగా రికార్డయింది. టొరినో స్కేల్ అంటే గ్రహశకలాలు భూమిని ఢీకొనే అవకాశాన్ని అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు ఉపయోగించే ఒక డివైజ్. ఇది 0 నుంచి 10 రేంజ్‌ను కలిగి ఉంటుంది. ఐదో స్థాయిని దాటితే చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. అందుకే సైంటిస్టులు ఈ గ్రహశకలంపై ఎక్కువగా దృష్టి సారించారు. ఊహించని విధంగా లెక్కలు మారితే టొరినో స్కేల్‌పై ప్రమాద సూచీ మరింత పెరుగుతుంది.
అణుబాంబు పేలుడుతో సమానం
ఈ గ్రహశకలం 40-100 మీటర్ల మధ్య వ్యాసం కలిగి ఉంది. అంటే ఓ నగరాన్ని మట్టిలో కలిపే శక్తి ఈ గ్రహశకలానికి ఉంది. ఇది ఒకసారి భూమిని తాకితే 10 మెగాటన్నుల TNT పేలినంత శక్తి విడుదలవుతుంది! TNT అంటే ఒక పేలుడు పదార్థం. అందుకే ఈ గ్రహశకలం భూమిని తాకినప్పుడు దాని ప్రభావం 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అక్కడ పరిసర ప్రాంతాలు నాశనం అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దీని ప్రభావానికి ఓ నగరం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవచ్చు. ఒకవేళ ఇది సముద్రంలో పడితే మరింత ప్రమాదం. భీకరమైన సునామీలు ఉద్భవించి కోట్లాది ప్రజలను మింగేయగలవు!
డైనోసార్లను ముంచేసిన గ్రహశకలం
మరోవైపు గ్రహశకలాలు భూమిని ఢీకొట్టడం కొత్త విషయమేమీ కాదు. సాధారణంగా మన సౌర కుటుంబంలో అనేక లక్షల గ్రహశకలాలు సంచరిస్తుంటాయి. వాటిలో కొన్ని భూమి కక్ష్యను దాటి భూమి వైపుకు వస్తుంటాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో గ్రహశకలాలు భూమిని ఢీకొనే స్థితికి వస్తాయి. అప్పుడు భూమి అల్లకల్లోలం అవుతుంది. అనేక జాతులు అంతరించిపోతాయి. ఆరు కోట్ల సంవత్సరాల క్రితం భూమిని ఏలిన డైనోసార్ల రాజ్యం ఒక్కరోజులోనే కాలగర్భంలో కలిసిపోయింది. మెక్సికోలోని చిక్షులుబ్ క్రేటర్ దానికి సాక్ష్యం. సుమారు 10 కిలోమీటర్ల వ్యాసం ఉన్న ఆ గ్రహశకలం భూమిని ఢీకొనగానే 1000 మెగాటన్నుల బాంబు పేలినంత శక్తి వెలువడింది. అణు బాంబుతో పోలిస్తే లక్ష రెట్లు అధికమైన శక్తి ఇది! గాలిలో వేడి, అగ్నికీలలు, ప్రళయ తుఫాన్లు.. అంతకు మించి భూమి పొరలను తాకిన భీకరమైన సునామీలు.. ఇలా అన్నీ కలిసి చాలా జీవులను నాశనం చేశాయి. 1908లో సైబిరియా- తుంగుస్కా ప్రాంత వాతావరణంలోకి ప్రవేశించిన ఓ గ్రహశకలం ఒక్కసారిగా పేలింది. భూమిపై 2000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఈ పేలుడు ధ్వంసం చేసింది. అటవీ మంటలు భారీగా చెలరేగాయి. వంద ఏళ్లు దాటినా ఆ ప్రాంతంలో ఇప్పటికీ పేలుడుకు సంబంధించిన స్పష్టమైన ఆనవాలు కనిపిస్తాయి. ఇక 2013లో రష్యా-చెలియాబింస్క్ ప్రాంతంలో 20 మీటర్ల వ్యాసం ఉన్న గ్రహశకలం భారీ శక్తిని విడుదల చేసింది. ఇది సుమారు హిరోషిమా వద్ద పేలిన అణుబాంబు విడుదల చేసిన శక్తి కంటే 30 రెట్లు ఎక్కువ. 20, 30 మీటర్ల వ్యాసమున్న గ్రహశకలాలే ఇంతటి శక్తిని విడుదల చేశాయంటే.. 2032లో భూమిని తాకే అవకాశం ఉందని భావిస్తున్న గ్రహశకలానికి 40 నుంచి 100 మీటర్ల వరకు diameter ఉండడంతో సైంటిస్టులు అలెర్ట్ అయ్యారు.
ఇది కూడా చదవండి: అంతరిక్షాన్ని జయించిన వీరాంగన.. కానీ భూమికి ఎలా చేరుకోలేకపోయింది?