కిడ్నీలు కొలిచి చూస్తే సుమారు మనిషి పిడికిలి అంత సైజులో ఉంటాయి. కానీ శరీరంలో అత్యవసరమైన ఎన్నో పనులకు కేంద్రం ఇవే!..
వాటి ఆరోగ్యాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. గుండె, మెదడు ఆరోగ్యంపై దృష్టి పెడతాం కానీ, కిడ్నీలు కూడా రోజూ లైఫ్ స్టైల్ లో కీలక పాత్ర పోషిస్తాయి. అసలు కిడ్నీలు ఏం చేస్తాయి అంటే…
కిడ్నీల ప్రధాన పనులు:
•మలినాలను తొలగించడం – రక్తాన్ని,ద్రవ పదార్థాలను శుభ్రపరచి, వ్యర్థాలను బయటకు పంపడం.
•రక్తపోటు నియంత్రణ – హార్మోన్ల ఉత్పత్తి ద్వారా నియంత్రణ.
* శరీర ద్రవ సమతుల్యత – నీటి, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కాపాడటం.
* ఎర్ర రక్తకణాల ఉత్పత్తి – EPO హార్మోన్ ద్వారా రక్తకణాల పెరుగుదల.
* ఎముకల ఆరోగ్యం – విటమిన్ D యాక్టివేషన్ ద్వారా కాల్షియం ఎముకల్లో చేరడినికి సాయపడుతుంది.
కిడ్నీ డే ప్రాముఖ్యత, చరిత్ర:
ఇటువంటి అత్యవసరమైన మూత్రపిండాల ఆరోగ్యం, వాటి వ్యాధులపై అవగాహన కోసం ప్రతి సంవత్సరం ‘మార్చి రెండో గురువారం’ “ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా”(World Kidney Day) రుపుకుంటారు. అంతర్జాతీయ నెఫ్రాలజీ సొసైటీ (ISN) అంతర్జాతీయ కిడ్నీ ఫౌండేషన్స్ సమాఖ్య (IFKF) సంయుక్తంగా 2006లో ప్రారంభించి, ప్రతి యేటా నిర్వహిస్తున్నాయి. కిడ్నీ వ్యాధుల ప్రమాదాలను అర్థం చేసుకోవడం,నివారణ చర్యలు తీసుకోవడం,ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రతి యేటా నిర్వహిస్తున్నారు.
కిడ్నీ వ్యాధులు ఏంటి?
కిడ్నీ వ్యాధుల్లో పలు రకాలు ఉన్నాయి.
వాటిల్లో…
1. స్వల్ప కాలిక కిడ్నీ సమస్యలు (Acute Kidney Issues):
– అక్యూట్ కిడ్నీ డిసీజ్.
– మూత్రనాళంలో ఇన్ఫెక్షన్లు (Urinary Tract Infections)
– కిడ్నీలో రాళ్లు
2. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు:
• క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD)
• కిడ్నీ వైఫల్యం (ESRD)
• కిడ్నీలో పుండ్లు (PKD)
•గ్లోమెరులోనెఫ్రైటిస్ (Glomerulonephritis)

భారతదేశంలో కిడ్నీ వ్యాధుల తీవ్రత:
భారతదేశంలో 80 లక్షలకు పైగా ప్రజలు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో (CKD) బాధపడుతున్నారు.
ప్రతి సంవత్సరం 2.2 లక్షల మంది కొత్త ఎండ్-స్టేజ్ రీనల్ డిసీజ్ (ESRD) రోగులు నమోదవుతున్నారు.
3.4 కోట్ల డయాలిసిస్ సెషన్లు అవసరం అవుతున్నాయి. దేశంలో సుమారు 2 లక్షల మంది రోగులు అవయవ దానం కోసం వేచి ఉంటున్నారు, అయితే అందుబాటులో ఉన్న దాతలు కేవలం 15,000 మాత్రమే. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం, ప్రతి సంవత్సరం 2-3 లక్షల కిడ్నీలు అవసరమవుతుండగా, కిడ్నీ మార్పిడులు సుమారుగా కేవలం 6,000 మాత్రమే. జనాలు చనిపోయిన వారి నుండి కిడ్నీలు తీసుకుని అవయవాల మార్పిడి చేసుకోవచ్చు అనే అవగాహనను ఇప్పుడిప్పుడే కాస్త కలిగి ఉంటున్నా, ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఈ అవయవ మార్పిడిని నియంత్రించే జీవన్ దాన్(Jeevandan) ట్రస్ట్ ప్రకారం 2024 లో 297 కిడ్నీలను చనిపోయిన వారి నుండి సేకరీంచడం జరిగింది.( భారతదేశంలో ప్రతి సంవత్సరం కేవలం ప్రమాదాల కారణంగా సుమారు 1.5 లక్షల మంది బ్రెయిన్ స్టెమ్ డెత్ జరుగుతున్నట్లు అంచనా).
భారతదేశంలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి( CKD) మరణాల రేటు 1990 నుంచి 2017 వరకు 5.6% పెరిగింది. (Lancet Study)
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా CKD మరణాలు 5వ ప్రధాన కారణంగా మారే అవకాశం ఉంది.

కిడ్నీ వ్యాధులకు 7 ప్రధాన కారణాలు:
1. డయాబెటిస్ (మధుమేహం) :
CKD రోగులలో దాదాపు 50% మంది మధుమేహం కారణంగా కిడ్నీ సమస్యలను ఎదుర్కొంటున్నారు.రక్తంలో అధిక చక్కెర స్థాయిలు కిడ్నీల్లోని చిన్న రక్తనాళాలను దెబ్బతీస్తాయి. దాంతో కిడ్నీల మీద అధిక ఒత్తిడి పడి చెడిపోతాయి.
2. హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు):
రక్తపోటు నియంత్రణలో లేకపోతే, కిడ్నీ ఫిల్టర్లు దెబ్బతింటాయి.
3. హృదయ సంబంధిత వ్యాధులు
గుండె సమస్యలు ఉన్నవారికి CKD వచ్చే ప్రమాదం కూడా ఉంది.గుండె,కిడ్నీ ఆరోగ్యం ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి.
4. అధిక బరువు (ఒబేసిటీ):
భారత్‌లో CKD రోగులలో 50% మంది ఊబకాయంతో ఉండేవారే.
అధిక బరువు వల్ల కిడ్నీలు అధికంగా పని చేయాల్సి వస్తుంది, ఇది దీర్ఘకాలికంగా సమస్యలను తెస్తుంది.
5. ధూమపానం & మద్యం సేవించడం:
పొగ త్రాగడం క్యాన్సర్ ప్రమాదాన్నే కాదు కిడ్నీలు చెడిపోవడానికి కూడా కారణం అవుతాయి.ఆల్కహాల్ ఎక్కువగా తాగితే బీపీ పెరిగి, కిడ్నీలు దెబ్బతింటాయి.
6. అధిక మందుల వినియోగం:
ఎక్కువగా డాక్టర్ల సలహా లేకుండా పైన్ కిల్లర్స్, కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకుంటే నెఫ్రోటాక్సిక్ (nephrotoxic) గుణాలను కలిగి ఉండటంతో కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది.
అలాంటి మందులు తీసుకునే ముందు డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
7. స్వచ్ఛమైన నీరు తాగకపోవడం:
శుభ్రమైన నీళ్ళు తాగకపోతే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.
-అలాగే ఇన్ఫెక్షన్లు సోకి కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది.
కిడ్నీ వ్యాధులను గుర్తించడం ఎందుకంత కష్టం?
CKD ప్రారంభ దశల్లో లక్షణాలు స్పష్టంగా ఉండవు.కిడ్నీలు దాదాపు 80% దెబ్బతిన్న తర్వాతే రోగికి తీవ్ర సమస్యలు ఏర్పడతాయి. కిడ్నీ వ్యాధులు వచ్చినప్పుడు గుర్తించేందుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి.
ముఖ్యమైన లక్షణాలు-
– కాళ్ళలో వాపు
-విపరీతమైన అలసట
-మూత్ర విసర్జనలో మంట,చీము, రక్తం
-రక్తంలో క్రియాటినిన్ పెరగడం
-మెడ, నడుము లేదా కడుపు భాగంలో నొప్పి
ఇవి సాధారణంగా మూత్రపిండాల వ్యాధులు వేస్తే ఉండే లక్షణాలు.
కిడ్నీ నష్టం తిరిగి సవరించలేమా?
CKD ని పూర్తి నయం చేయలేము, కానీ నెమ్మదించవచ్చు.
ప్రారంభ దశల్లో కిడ్నీ డ్యామేజ్‌ను తగ్గించేందుకు జీవనశైలి మార్పులు & మందులు ఉపయోగపడతాయి.
కిడ్నీ వ్యాధులకు చికిత్సలు:
కిడ్నీ వ్యాధులకు రకరకాల చికిత్సలు ఉన్నాయి.
1. డయాలిసిస్
రక్తంలో వ్యర్థాలను తొలగించేందుకు ఉపయోగించే ప్రక్రియ.ఇది యంత్రం ద్వారా
రక్తాన్ని శుభ్రపరిచే విధానం
2. కిడ్నీ మార్పిడి (Kidney Transplant):
ఆరోగ్యకరమైన కిడ్నీని దాత నుండి తీసుకుని రోగికి మార్పిడి చేయడం.
ఇది డయాలిసిస్ అవసరాన్ని తగ్గించవచ్చు. కానీ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారు ప్రతి రోజూ జీవితాంతం మాత్రలు తీసుకోవాలి.
3. మందులు:
రక్తపోటును నియంత్రించే మందులు
ప్రోటీన్ లాస్ ను నియంత్రించే మందులు,రక్తహీనత నివారణకు మందులను డాక్టర్ సలహా మేరకు కచ్చితంగా వాడుతూ ఉంటే కిడ్నీ వ్యాధిని అదుపులో ఉంచొచ్చు.
సాధారణంగా కీడ్నీ వ్యాధులకు చికిత్స చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
కిడ్నీ వ్యాధిని నివారించేందుకు సూచనలు :
1. శారీరాన్ని చురుకుగా ఉంచండి – రోజూ కనీసం 30-60 నిమిషాలు వ్యాయామం చేయండి.
2. ఆహార నియంత్రణ పాటించండి – తక్కువ ఉప్పు, కొవ్వు, చక్కెర ఉండే ఆహారం తీసుకోవాలి.అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి.
3. బ్లడ్ షుగర్ & బ్లడ్ ప్రెషర్ ను నియంత్రించండి.
4. ధూమపానం మానేయండి – ఇది కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని 50% పెంచుతుంది. దాంతో పాటు కిడ్నీ పనితీరును మందగిస్తుంది.
5. జాగ్రత్తగా మందులు వాడండి – పెయిన్ కిల్లర్స్, ఆంటీ బయోటిక్స్ అవసరమైనప్పుడు మాత్రమే డాక్టర్ సలహా మేరకు వాడండి.
6. తగినంత నీరు తాగండి – రోజుకు 7-8 గ్లాసుల నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
7. ప్రతి సంవత్సరం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోండి, ముఖ్యంగా డయాబెటిస్ & హైపర్‌టెన్షన్ ఉన్నవారు కచ్చితంగా చేయించుకోవాలి.
కిడ్నీలు దెబ్బతింటే, దాని ప్రభావం శరీరంలోని అన్ని అవయవాలపై పడుతుంది. ఒకసారి కిడ్నీ వ్యాధి వస్తే, దాన్ని నివారించడం సాధ్యం కాదు. అందుకే, ముందుగానే జాగ్రత్త పడటం అవసరం.
సరైన జీవనశైలి, ముందస్తు పరీక్షలు, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ద్వారా CKD ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోవడం ఆరోగ్యంగా జీవించడానికి కీలకం! అందుకే మన కిడ్నీలను కాపాడుకుందాం…
Note: (This is Just a Health Advisory. For any Health Related Issues please Consult the Doctors).
ALSO READ: కృత్రిమ అవయవాల పితామహుడు, లక్షలాదిమందికి ప్రాణదాత..!