Menu

Shamar Joseph: మారుమూల కుగ్రామం నుంచి అద్భుతం.. వెస్టిండీస్ క్రికెట్‌కు కొత్త ఊపిరి పోసిన జోసెఫ్!

Tri Ten B

గబ్బా.. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియాను భారత్‌ మట్టికరిపించిన గడ్డ. గబ్బాలో ఆస్ట్రేలియాకు ఎదురేలేని కాలంలో టీమిండియా అద్భుతమే చేసింది. ఎవరూ ఊహించని విన్యాసాలను కళ్లకు కట్టేలా చూపించిన భారత్‌ బౌలర్ల ప్రదర్శన ఇప్పటికీ ఓ మాయలానే ఉంది. అయితే ఇండియా అప్పటికీ టెస్టుల్లో మంచి జట్టే.. గతంలోనే ఆస్ట్రేలియాలో కంగారూలపై టెస్టు సిరీస్‌ గెలిచిన రికార్డు ఇండియాకు ఉంది. క్రికెట్‌ వనరుల పరంగా ఇండియాకు అన్నీ ఉన్నాయి. ఆటగాళ్లకు కావాల్సినంతకంటే ఎక్కువే డబ్బే చెల్లిస్తోంది బీసీసీఐ. కానీ వెస్టిండీస్‌ క్రికెట్‌ ఏ మాత్రం రిచ్‌ కాదు.. పైగా పిసినారి బోర్డు. ఒకప్పుడు ప్రపంచక్రికెట్‌ను శాసించిన కరీబియన్లు నేడు ప్రపంచకప్‌కు క్వాలిఫై అవ్వలేనంతగా దిగజారిపోయారు. ఇక వెస్టిండీస్‌ టెస్టు క్రికెట్‌ పాతాళానికి పడిపోయి ఏళ్లు, దశాబ్దాలూ గడిచిపోయాయి. సీన్‌ కట్‌ చేస్తే.. ఓ 24ఏళ్ల యువకుడు వెస్టిండీస్‌ క్రికెట్‌కు ఊపిరిపోశాడు. కంగారూల నడ్డి విరిచి 36ఏళ్ల తర్వాత గబ్బా కోటపై విండీస్‌ జెండా రెపరెపలాడేలా చేశాడు. 27ఏళ్లుగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుపు రుచే ఎరగని వెస్టిండీస్‌ జట్టును తొడగొట్టేలా చేశాడు. టెస్టు, వన్డే ఛాంపియన్లగా ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోన్న ఆస్ట్రేలియన్లపై వెస్టిండీస్‌ సాధించిన ఈ విజయం అధ:పాతాళానికి పడిపోయిన కరీబియన్‌ టెస్టు క్రికెట్‌ను తిరిగి భూమిపై నిలబెట్టేలా చేశాడు.


సెక్యూరిటీ గార్డు టు ఓవర్‌నైట్‌ క్రికెట్ స్టార్:
షామర్ జోసెఫ్.. గయానాలోని బరాకారా అనే గ్రామంలో పుట్టాడు. నిన్నటివరకు ఈ ఊరు పేరు ప్రపంచానికి ఏ మాత్రం తెలియదు. 400మంది కంటే తక్కువ జనాభా ఉండే ప్రాంతమది. పడవల ద్వారా మాత్రమే ఈ ఊరికి చేరుకోవచ్చు. అక్కడ వారికి క్రికెట్ తప్ప మరో గేమ్‌ గురించి తెలియదు. ఏ మాత్రం విలాసాలకు నోచుకోని ప్రజలు వారు. చిన్నతనం నుంచే అందరిలాగే గల్లి క్రికెట్‌ ఆడకునేవాడు. పండ్లను బంతులుగా ఉపయోగించడం, కరిగిన సిసాలను బంతులగా మార్చుకోని క్రికెట్ ఆడేవారంటే అక్కడివారికి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో అర్థంచేసుకోవచ్చు. శనివారం తప్ప మిగిలిన రోజులు ఆ ఊరిలో క్రికెట్‌ ఆడుకోవచ్చు. శనివారం కేవలం చర్చిలో ప్రార్థనలు మాత్రమే చేయాలి. క్రిస్టియానిటీని అక్కడి ప్రజల బలంగా నమ్ముతారు. ఎంతలా అంటే శనివారం ఆఖరికి టీవీ కూడా చూడకూడదు. ఇలా అందరిలానే ఊర్లో పెరిగిన జోసెఫ్‌ నాలుగేళ్ల క్రితం సెక్యూరిటీ గార్డుగా బెర్బిస్లలో పని ప్రారంభించాడు. సీన్‌ కట్‌ చేస్తే.. ఇప్పుడు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు అందుకోవడానికి రెడీగా ఉన్నాడు. సెక్యూరిటీ గార్డుగా పని చేయాల్సిన జోసెఫ్‌ క్రికెట్‌లోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడు?


తొలి టెస్టుతోనే సంచలనం:
2014లో వెస్టిండీస్ మాజీ వన్డే ఆటగాడు డామియన్ వాంటల్ క్రికెట్‌ ఆటడానికి బరాకారాకు వచ్చాడు. అప్పుడు జోసెఫ్‌ వయసు 14. అప్పుడే అతనిలోని టాలెంట్‌ను గుర్తించాడు వాంటల్‌. జోసెఫ్‌తో అప్పటి నుంచి టచ్‌లో ఉన్న వాంటల్‌ 2021లో జార్జ్‌టన్‌ క్లబ్‌ తరుఫున క్రికెట్‌ ఆడేందుకు సంతకం చేయాలని జోసెఫ్‌ని అడిగాడు. తనకు కూడా నచ్చి ఉద్యోగానికి రాజీనామా చేసి క్లబ్‌ క్రికెట్‌లో అద్భుతాలు చేశాడు. ఈ జనవరి 17న ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో తొలి టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌ అరేంగ్రెటం చేసిన జోసెఫ్‌ తొలి వికెట్‌ ఈ జనరేషన్‌ గ్రేట్స్‌లో ఒకరైన స్టీవ్‌ స్మిత్‌ది కావడం విశేషం. అడిలైడ్‌ టెస్టులో తాను వేసిన తొలి బంతికే స్మిత్‌ వికెట్‌ తీసి డెబ్యూని గొప్పగా ప్రారంభించాడు జోసెఫ్‌. ఆ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు (5/94) తీశాడు. ఇది ఆస్ట్రేలియాలో ఏ వెస్టిండీస్ బౌలర్‌కైనా అత్యుత్తమ టెస్టు అరంగేట్రం.

ఈ కండలు సరిపోతాయా?
ఇక అడిలైడ్‌ టెస్టు తర్వాత ఆస్ట్రేలియా కంచుకోట గబ్బాలో జోసెఫ్‌ నయా చరిత్ర సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు తీసి విండీస్‌కు ఆస్ట్రేలియా గడ్డపై 27ఏళ్ల తర్వాత టెస్టు విజయాన్ని అందించాడు. ఈ సిరీస్‌కు ముందు వెస్టిండీస్‌ క్రికెట్‌ను చాలా అవమానించి మాట్లాడినవారికి బంతితోనే బుద్ధి చెప్పాడు. కాలి బోటన వేసి గాయంతో బాధపడినా.. నొప్పితో ఓ సెషన్‌ మొత్తం దూరమైనా తన టీమ్‌ని గెలిపించాలన్న సంకల్పంతో బరిలోకి దిగిన జోసెఫ్‌ చివరి 8 వికెట్లలో ఏడు వికెట్లు తీసి వెస్టిండీస్‌ క్రికెట్‌కు ఎన్నడు మరిచిపోలేని విజయాన్ని అందించాడు.

 

మ్యాచ్‌ తర్వాత వెస్టిండీస్‌ కెప్టెన్‌ క్రెయిగ్ బ్రాత్‌వైట్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆస్ట్రేలియన్‌ మాజీలు చేసిన వ్యాఖ్యలకు విండీస్‌ జట్టు ఎంత బాధపడిందో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌ క్రికెట్‌ దయనీయంగా ఉందన్న ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రోడ్నీ హాగ్ వ్యాఖ్యలే తమలో కసిని పెంచాయని.. ఆ అవమానాలే తమకు ప్రేరణ అని చెప్పుకున్న బ్రాత్‌వైట్‌ మాటల్లో ఆనందం కంటే గతంలో అనుభవించిన బాధే ఎక్కువగా కనిపించింది. ‘ఈ కండలు సరిపోతాయా?’ అంటూ బ్రాత్‌వైట్‌ రోడ్నీ హాగ్‌కు మ్యాచ్‌ ప్రజెంటేషన్‌ టైమ్‌లో గట్టిగా బదులిచ్చాడు. ఈ రెండు టెస్టుల్లో జోసెఫ్ సహా నలుగురు ఆటగాళ్లు వెస్టిండీస్‌కు అరంగేట్రం చేశారు. అసలు ఆస్ట్రేలియా గెలవడం గురించి కాదు ఎంత తేడాతో గెలుస్తుందని చర్చించుకున్న వాళ్ల నోర్లు మూతపడ్డాయి. టెస్టు సిరీస్‌ను సమం చేసిన విండీస్‌ తమలో ఇంకా క్రికెట్‌ బతికేఉందని చాటుకుంది.


Also Read: ఏంటో ఇలాంటి ఆయిల్స్ అన్ని ఆ టీవీ వాళ్లకే దొరుకుతాయ్‌!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *