Menu

Julian Assange: జర్నలిజానికి టార్చ్ బేరర్‌.. అగ్రరాజ్యానికి వణుకు పుట్టించిన అసాంజే కథ ఇది!

Tri Ten B
julian assange history life style wikileaks

అది జులై 12, 2007.. ప్రాంతం న్యూ బాగ్దాద్(ఇరాక్‌).. నిరాయుధులైన పౌరులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు.. అందులో ఇద్దరు చిన్నపిల్లలు.. ఇద్దరు రాయిటర్స్‌(Reuters) రిపోర్టర్లు కూడా ఉన్నారు. ఇరాక్‌ను అమెరికా ఆక్రమించి పాలిస్తున్న రోజులవి. వారి పై నుంచి హెలికాఫ్టర్లు వెళ్తున్నాయి. ఇంతలోనే ఆ హెలికాఫ్టర్ నుంచి కాల్పులు, బాం*బుల దాడి జరిగింది. దాదాపు 18 మంది పౌరులు ఈ దాడుల్లో చనిపోయారు. అందులో జర్నలిస్టులు, పిల్లలు కూడా ఉన్నారు.. ఇదంతా అమెరికా ఆర్మీనే చేసింది. ఈ విషయం ఆ రోజు బయటకు రాలేదు.. రానివ్వలేదు..!

ఆ తర్వాత మూడేళ్లు గడిచాయి. అది 2010 ఏప్రిల్‌. అమెరికా అన్యాయంగా కాల్పులు జరిపిన వీడియో బయటకు వచ్చింది.. అప్పటికే అమెరికా ఆర్మీ, ప్రభుత్వం ఇరాక్‌, అఫ్ఘాన్‌లో యుద్ధం పేరిట చేసిన దారుణాలను బయట పెట్టిన వికీలీక్స్‌ సైట్‌ నుంచి ఆ వీడియో రిలీజ్ అయ్యింది. అంతే ఒక్కసారిగా యావత్‌ అమెరికా ఉలిక్కిపడింది. నాడు అధికారంలో ఒబామా ఉన్నారు.. 2001 తర్వాత ఇరాక్‌, అఫ్ఘాన్‌లో అమెరికా ఆర్మీ చేసిన దాష్టికాలు బయటపడ్డాయి. ప్రపంచానికి అమెరికా ఆగడాలు తెలిసి వచ్చాయి. విదేశి గడ్డలపై అమెరికా పెత్తనాలను కళ్లకు కట్టినట్టు చూపించారు వికీలీక్స్‌ ఫౌండర్‌ జూలియన్ అసాంజే.

ఎట్టకేలకు విడుదలైన అసాంజే:
అంతేకాదు.. 9/11 దాడుల సమయంలో 24 గంటల వ్యవధిలో పెంటగాన్, FBI, ఫెమా, న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పంపుకున్న 50 లక్షలకు పైగా పేజీల మెసేజీలను అదే ఏడాది వికీలీక్స్ ప్రచురించడం పెను ప్రకంపనలు రేపింది. అంతే ఏవో కేసులు పెట్టి అసాంజేను ఇబ్బందులు పెట్టారు.. తర్వాత జైల్లో పడేశారు. 5ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన అసాంజే ఎట్టకేలకు విడుదలయ్యారు.


టీనేజ్‌ నుంచే ఎక్స్‌పర్ట్:
ఆస్ట్రేలియాలో పుట్టిన అసాంజే టీనేజ్‌లోనే హ్యాకింగ్‌లో ఎక్స్‌పర్ట్‌ అయ్యారు. 1991లో 20ఏళ్ల వయస్సులో, అసాంజే కెనడియన్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ కోసం మెల్బోర్న్ టెర్మినల్‌ను హ్యాక్ చేశారు. దీంతో ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు అసాంజేను అరెస్టు చేశారు. ఆయనపై 31 క్రిమినల్ కేసులు పెట్టారు. ఇందులో కొన్ని నేరాల్లో అసాంజే తన నేరాన్ని అంగీకరించారు కూడా. ఈ కేసులకు శిక్ష అనుభవించి విడుదలయ్యారు.

2006లో వికీలీక్స్‌ స్థాపించిన అసాంజే ఆ తర్వాత అమెరికా సీక్రెట్లను బయటపెట్టేందుకు ఓపెన్‌ ఫ్లాట్‌ఫారమ్‌ను క్రియేట్ చేశారు. ఎవరైనా, ఏ విషయాన్ని అయినా అసాంజేకు పంపవచ్చు.. దీని ద్వారా ప్రపంచానికి అప్పటివరకు తెలియని రహస్యాలను బయటపెట్టారు అసాంజే.

విష వ్యర్థాల నివేదిక:
2009లో వికీలీక్స్‌ ఏం చేయగలదో, భవిష్యత్‌లో ఏం చేయబోతుందో ప్రపంచానికి అర్థమైంది. సింగపూర్‌కు చెందిన మల్టీనేషనల్‌ కంపెనీ ట్రాఫిగురా ఆఫ్రికన్ల జీవితాలతో ఎలా చెలగాటమాడిందో వికీలీక్స్‌ బయటపెట్టింది. హానికరమైన రసాయనాలను సహా 5,40,000 లీటర్ల విష వ్యర్థాలను ఐవరీ కోస్ట్‌లో డంప్‌ చేసింది ట్రాఫిగురా. దీని వల్ల చర్మం, కళ్లు, ఊపిరితిత్తులు దెబ్బ తినడం, వాంతులు, విరేచనాలు, స్పృహ కోల్పోవడం, మరణానికి దారితీయ్యడం లాంటి ఘటనలకు ఆ కంపెనీ కారణమైంది. ఏ మీడియా సంస్థ కూడా ఈ విషయాన్ని అప్పటివరకు రిపోర్ట్‌ చేయలేదు. ఆఫ్రికన్ల ప్రాణాలంటే ప్రపంచానికి ఎలాగో అలుసే కదా.. అందులో బడా కంపెనీ కావడంతో అందాల్సిన ముడుపులు ఎప్పుడూ అందుతూనే ఉంటాయి. ఈ వ్యర్థాల డంపింగ్ వల్ల దాదాపు 1,08,000 మంది ప్రభావితమయ్యారని సాక్ష్యాత్తు ఐక్యరాజ్యసమితినే నివేదించిందంటే ఆ కంపెనీ ఎంత దారుణానికి ఒడిగట్టిందో అర్థం చేసుకోవచ్చు!

 

అమెరిక ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు మిగిల్చిన 2010:
2010 అక్టోబరులో అఫ్ఘనిస్తాన్‌లో అమెరికా యుద్ధానికి సంబంధించి 90,000 రహస్య పత్రాలను విడుదల చేసింది వికీలీక్స్‌. అఫ్ఘాన్‌లో అమెరికా పౌరుల మరణానికి ఎలా కారణమైందో ఈ డాక్యుమెంట్స్‌ ద్వారా బయటపడ్డాయి.

యుద్ధాల్లో అమెరికా చేసే దారుణాలను దాచి పెట్టే పాశ్చాత్యా మీడియా ఒకవైపు వికీలీక్స్‌ మరోవైపు. దీంతో సామాన్య ప్రజల్లో వికీలీక్స్‌కు ఆదరణ పెరిగింది. నిజమైన జర్నలిజం ఇదేనన్న భావన సామాన్యుల్లో పెరగడం మొదలైంది.

2010 అక్టోబరులో ఇరాక్ యుద్ధానికి సంబంధించిన దాదాపు 4,00,000 రహస్య అమెరికా ఫైళ్లను వికీలీక్స్ బహిర్గతం చేసింది. 2003లో నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇరాక్‌పై దాడి చేసింది. ఆ తర్వాత ఇరాక్‌లో అమెరికా ఆడిందే ఆటగా సాగింది. అమెరికా సైన్యం ఇరాక్‌ పౌరులను చిత్రహింసలకు గురిచేసిన ఉదంతాలు అనేకం. వీటిని వికీలీక్స్‌ బయటపెట్టింది.

2004-2009 వరకు అఫ్ఘాన్‌, ఇరాక్ యుద్ధాలలో పౌరుల మరణాలు నివేదించిన సంఖ్య కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని వికీలీక్స్‌ డాక్యుమెంట్లు చూపించడం సంచలనం రేపింది.

అమాయకులను జైల్లో పెట్టిన అమెరికా:
2011 ఏప్రిల్‌లో అమెరికా, యూరోపియన్ మీడియా సంస్థలకు చెందిన వేల పేజీల రహస్య పత్రాలను వికీలీక్స్ విడుదల చేసింది. క్యూబా-గ్వాంటనామో బే జైలులో జెనీవా ఒప్పందాన్ని అమెరికా ఎలా ఉల్లంఘించిందో ఈ డాక్యుమెంట్స్‌ బయటపెట్టాయి. అమాయకులను ఖైదీలకు ఎలా చిత్రికరించారో వికీలీక్స్‌ కళ్లకు కట్టినట్టు చూపించింది.

సెక్యూరిటీ ఏజెన్సీ కాదు స్పై ఏజెన్సీ:
2015లో అమెరికా గూఢచారి సంస్థ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపించింది వికీలీక్స్. జపాన్, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్, జర్మనీ, బ్రెజిల్‌కు చెందిన విదేశీ అధికారులపై NSA ఎలా గూఢచర్యం(Spy) చేస్తోందో బయటపెట్టింది. ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మధ్య జరిగిన సంభాషణకు చెందిన వివరాలు కూడా NSA దగ్గర ఉన్నాయని వికీలీక్స్‌ బాంబు పేల్చింది.అంతర్జాతీయ రాజకీయ నాయకులపైనే కాకుండా పౌరులపై కూడా NSA గూఢచర్యం చేసినట్టుగా వికీలీక్స్ బయటపెట్టింది.

యుద్ధాల గురించి అమెరికా ప్రభుత్వం ప్రజలకు, ప్రపంచానికి చెప్పిన చాలా అబద్ధాలను వికీలీక్స్‌ బయటపెట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే వికీలీక్స్‌ బయటపెట్టిన ప్రతీ అంశమూ ఓ సంచలనమే. మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా ఎప్పుడూ బయటపెట్టడానికి సాహసించని ఎన్నో విషయాలను వికీలీక్స్‌ బహిర్గతం చేయడం అమెరికాను అనేకసార్లు ఇబ్బందులకు గురి చేసింది.

Also Read: నరకంగా మారిన శుభకార్యలు.. గుదిబండగా మారిన ఆడంబరాలు!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *