రెండు నెలలుగా యూట్యూబ్ వీడియోలు చూడాలంటేనే భయమేస్తోంది. తలంబ్రాల చీరను లంగోటలా వాడాలంటా.. బీఫ్ తినడం వల్ల ముస్లింల్లో సెల్ఫ్ కంట్రోల్ ఉండదట.. హిందూవులు సాత్విక మాంసం తింటారంటా.. అత్యాచారాలకు ఆడవారి దుస్తులే కారణమట.. మంగళసూత్రం ధరించని ఆడవాళ్ల భర్తలు పైకి పోయినట్టే లెక్కట.. ఇంత టాక్సిక్ కంటెంట్‌ని స్ప్రెడ్ చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్‌ని ఏం అనాలో అర్థంకావడంలేదు. ఓ ఆస్పత్రి చైర్‌పర్శన్‌ని పట్టుకొచ్చి అడ్డమైన ఉపన్యాసాలు ఇప్పించి యూట్యూబ్ ఛానెల్స్ బాగానే వెనకేసుకుంటున్నాయి. డబ్బులు సంపాదించడం ఏ మాత్రం తప్పు కాదు కానీ.. ఇంత అనైతికంగా జనాల బుర్రలను పాడుచేసే కంటెంట్‌తో సోమ్మును జేబులో వేసుకోవడం అధర్మం. అయినా ‘ధర్మాన్ని’ గుడ్డిగా పాటించేవాళ్లకి అధర్మం గురించి పట్టింపు ఉండదు.
యాంకరా.. డాక్టరా?
ఇక ఈ క్యాన్సర్ కంటెంట్ మొత్తంలో ఉన్నది ఒక ఆవిడే.. ఆమె పేరు మాధవి లత కొంపెల్లా(Madhavi Latha Kompella). హైదరాబాద్‌లోని విరించి(Virinchi) ఆస్పత్రి చైర్‌పర్శన్. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయనుంది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన ఆమె ఇటీవలి స్పీడ్ పెంచారు. వరుస పెట్టి యూట్యూబ్ ఛానెల్స్‌లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అసలు ఆమె ఫ్రీ లాన్స్ యాంకరో, డాక్టరో తెలియనట్టు ఉంది పరిస్థితి. 2 నెలలుగా ఆవిడ ఎన్ని యూట్యూబ్ న్యూస్‌ఛానెల్స్‌లో కనిపించారో లెక్కేలేదు. కార్తీక దీపం సీరియల్‌లో హీరో అసలు ఆస్పత్రికే పోనట్టు.. మాధవి మేడం కూడా ఆస్పత్రి ముఖం చూసి నెలలు గడుస్తున్నట్టుంది.
పెళ్లి జరిగిన ఏడాది లోపు ఏం చేయాలంటే?
మాధవి లతతో సుమన్ టీవీ వాడు చేసిన ఇంటర్వ్యూకి బాగా రీచ్ వచ్చింది. ఆ తర్వాత మిగిలిన యూట్యూబ్ ఛానెల్స్‌లో ఆవిడ దర్శనాలు పెరిగిపోయాయి. నేషనలిస్ట్ హబ్ లాంటి హిందూ ప్రొపగండా యూట్యూబ్ ఛానెల్స్ నుంచి వనిత లాంటి స్త్రీ ఛానెల్స్ వరకు ఆమెతో ఇంటర్వ్యూలు చేశాయి. ఇదంతా వారి బిజినేస్ వ్యవహరం. ఎవరు ఎవరితోనైనా ఇంటర్వ్యూలు, డిబెట్లు చేసుకోవచ్చు. అయితే మాధవి మాటల నుంచి వస్తున్న అశాస్త్రియ మాటలు సమాజాన్ని కలుషితం చేసేలా ఉన్నాయి. అత్యాచారాలకు కారణమైన విశ్లేషణలు వినిపించాల్సిందిపోయి ఆడవారు చెప్పులు లేకుండా బయటకు వెళ్తే రాళ్లు, రప్పలు గుచ్చుకుంటాయని చెప్పడం ఆవిడ మేధస్సుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పైగా డాక్టరట.. అందుకే పెళ్లి జరిగిన ఏడాది లోపు తలంబ్రాల చీరను పుట్టిన బిడ్డకు లంగోటల పెట్టమని చెబుతుందివిడ. అప్పుడే చిన్నారికి మంచిదట.
ఇవేం ప్రశ్నలు బాబోయ్:
అటు యూట్యూబ్ ఛానెల్స్ మాధవిని అడిగే ప్రశ్నలు సైతం విడ్డూరంగా ఉంటున్నాయి. ఓ యాంకర్ ఏకంగా ఆమెతో పులిహార కలుపుతున్నాడు. నిండుదనం అనేది ఓ అమ్మాయికి ఎలా ఉంటుందన్నది మాధవిని చూస్తే సదరు యాంకర్‌కు అనిపించిందంట.. వారి అమ్మమ్మ, ముత్తామ్మ ఆవిడలో కనిపించారంట. రచయితలు యాంకర్లగా మారితే ఇలానే ఉండొచ్చు. మరో యాంకర్ అయితే మాధవిని ఏ కారణం లేకుండా పొగిడేస్తోంది. సరే ఇవన్ని సెకండరీ విషయాలు.. ఇప్పుడు ప్రైమరీ విషయానికి వద్దాం.. మేడంగారు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
అందుకే మెజార్టీ వర్గమైన హిందూవుల ఓట్ బ్యాంక్ టార్గెట్‌గానే ఆమె ఇంటర్వ్యూలు ఉంటున్నాయి. పనిలో పనిగా విరించి ఆస్పత్రిపై ఉన్న నెగిటివ్ రిమార్క్స్‌ని తొలగించే ప్రయత్నం చేసుకుంటున్నారు. యూట్యూబ్ ఛానెల్స్ కూడా మాధవిని ‘అమ్మ అమ్మ’ అని పిలుస్తూ జయలలిత లెవల్ ఎలివేషన్ ఇస్తున్నాయి. అటు వీడియోల కింద ఎక్కడ చూసినా అమ్మ అమ్మ అంటూ కామెంట్స్ ప్రత్యక్షమవుతున్నాయి. ఒకడైతే అమ్మవారే ఈవిడ అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి బీజేపీ నుంచి పోటి చేసే అన్ని అర్హతలు మాధవికి ఉన్నాయనే చెప్పుకోవాలి.
Also Read: మాంసం తింటే ఆడవాళ్లపై అఘాయిత్యాలు పెరుగుతాయట.. మేధావి మాధవి వైరల్ వీడియో!