అమెరికా…! స్వేచ్ఛకు బ్రాండ్ అంబాసిడర్‌గా గొప్పలు చెప్పుకునే దేశం. ప్రజాస్వామ్యానికి రోల్‌మోడల్‌గా ప్రపంచానికి చూపించుకునే కంట్రీ. కానీ ఇప్పుడు అదే దేశం భద్రత అనే మాటను అడ్డం పెట్టుకుని, లక్షలాది వలసజీవుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతోంది. H1B, H4 వీసా కోసం అప్లై చేసుకునే ప్రతి ఒక్కరి సోషల్ మీడియా ఆలోచనలు, మాటలు, భావాలను తవ్వి చూస్తోంది. ఇప్పటికే సోషల్‌మీడియా వెట్టింగ్ రూల్ అమల్లోకి వచ్చింది. ఇలా ఒకప్పుడు అవకాశాల అడ్డాగా చెప్పుకున్న అమెరికా, ఇప్పుడు ప్రతి వలసదారుడిని అనుమానంతో చూడడం ఎంత దుర్మార్గమో కదా. ఎందుకంటే ‘America is built by immigrants’ అంటారు. ఇప్పుడు అదే వలసదారుల గుండెల్లో గునపాన్ని దించుతోంది అమెరికా. డిజిటల్ ప్రైవేసీని దోచుకుపోతుంది. మాట్లాడే స్వేచ్ఛను మౌనంగా మార్చే ఈ చర్య.. ఇమ్మిగ్రెంట్స్ కలలను కల్లోలం చేస్తోంది. ఇంతకీ అసలేంటి సోషల్‌మీడియా వెట్టింగ్? దీని కారణంగా ఇండియన్స్ ఎలా ఎఫెక్ట్ అవ్వనున్నారు?
నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావ్?
సోషల్ మీడియా వెట్టింగ్ అంటే వీసా కోసం అప్లై చేసే వ్యక్తికి సంబంధించిన సోషల్ అకౌంట్లను తవ్వి చూడడం. మీరు ఒకవేళ మీ సోషల్‌మీడియా అకౌంట్ ప్రైవేట్‌లో ఉంచుకుంటే.. దాన్ని ఇప్పుడు పబ్లిక్ చేయాల్సిందే. ఎందుకంటే వీసాల కోసం అప్లై చేసుకుంటే ఇకపై కేవలం పాస్‌పోర్ట్ అప్లికేషన్ మాత్రమే కాదు.. సంబంధిత వ్యక్తి ఫోన్‌లోని ఆలోచనల వరకూ వెళ్లి తవ్వే ప్రక్రియ ఇది. ఫేస్‌బుక్ పోస్టులు, ఎక్స్‌లో చేసిన కామెంట్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటోలు, లింక్డ్‌ఇన్‌లో రాసుకున్న అభిప్రాయాలు లాంటివి ఇకపై వీసా అధికారుల కళ్లముందు ఉంటాయి. నువ్వు ఏం మాట్లాడావు, ఎవరిని ఫాలో అవుతున్నావు, ఏ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశావు లాంటి మీ పర్శనెల్ విషయాలను భద్రత పేరుతో స్కాన్ చేస్తారు. నువ్వు మంచి టెక్ ఇంజనీర్‌వా, నిజాయితీగా పని చేసే ప్రొఫెషనలా అనే విషయం కాదు.. నీ ఆలోచనలు వాళ్లకు నచ్చాయా లేదా అన్నదే ఇప్పుడు కీలకంగా మారనుంది.
ఇలా చేస్తే నీకు వీసా రాదు:
అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నవారిని దేశంలోకి రాకుండా ఆపడం, లేదా ఉన్నవారిని బయటకు పంపేయడం ఈ వెట్టింగ్ ప్రధాన లక్ష్యమని ట్రంప్ సర్కార్ చెప్పుకుంటున్నా.. అసలు మ్యాటర్ మాత్రం వేరే ఉంది. అమెరికా అమెరికన్ల కోసమే అనే నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్.. తన జాతీయవాదాన్ని దేశంపై రుద్దుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు ట్రంప్ అతిపెద్ద ఇజ్రాయెల్ మద్దతుదారుడు. అందుకే నువ్వు పొరపాటున పాలస్తీనాకు సపోర్ట్‌గా సోషల్‌మీడియాలో పోస్టు పెట్టావా ఇక అంతే..! నీకు వీసా రానట్టే లెక్కా!
నీ భావాజాలమేంటి?
ఇక ఈ నిర్ణయం వల్ల గట్టిగా దెబ్బ తగిలే వారిలో ఇండియన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే H1B వీసాదారుల్లో 70శాతానికి పైగా భారతీయులే ఉన్నారు. అమెరికా ప్రభుత్వ డేటా ప్రకారం చైనా ప్రజలు 12శాతంతో సెకండ్ హయ్యస్ట్‌లో ఉన్నారు. అంటే ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అన్నది పేపర్‌పై అందరికీ వర్తించే రూల్‌లా కనిపించినా, ప్రాక్టికల్‌గా మాత్రం భారతీయులపైనే ఎక్కువ ప్రభావం చూపించే నిర్ణయం. అమెరికాలో ప్రస్తుతం సుమారు 3లక్షల మంది భారతీయులు H1B వీసాపై పనిచేస్తున్నారు. వాళ్లలో ఎక్కువమంది ఐటీ, టెక్నాలజీ, సర్వీసెస్ రంగాల్లో కీలకమైన ఉద్యోగాలు చేస్తున్నవాళ్లే. అయితే ఎంత పని చేస్తున్నామన్నది కాదు.. నీ భావాజాలం ఏంటన్నదే ట్రంప్‌గారికి కావాలి..!
ఇదేనా ప్రజాస్వామ్యం?
నిజానికి వీసా అనేది స్కిల్స్ ఆధారంగా లేదా జాబ్ ఆధారంగా ఇవ్వాలి. కానీ ఇప్పుడు నీ అభిప్రాయాల ఆధారంగా, నీ పోస్టుల ఆధారంగా, నీ లైక్స్-షేర్స్ ఆధారంగా ఇస్తారట. ఇది డెమోక్రసీకి పూర్తి విరుద్ధం. అమెరికాలో పని చేయడానికి వెళ్లే భారతీయులేం నేరస్తులు కాదు. వాళ్లు ఉద్యోగాల కోసం, కుటుంబ భవిష్యత్తు కోసం, కలల కోసం వెళ్లే సాధారణ మనుషులు. అలాంటి వాళ్లను ముందుగానే అనుమానితుల్లా చూడడం, ప్రతి సోషల్ మీడియా పోస్టును చూసి దేశద్రోహులగా ముద్రవేయడం ఎంత ప్రమాదకరమో ప్రపంచదేశాలు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి.
ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంది H1B వీసా హోల్డర్లు భయంతో తమ పాత పోస్టులను డిలీట్ చేస్తున్నారు. రాజకీయాల గురించి మాట్లాడడంలేదు. అంతర్జాతీయ వ్యవహారాల జోలికే వెళ్లడంలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అభిప్రాయం అనే మాటనే మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది స్వేచ్ఛను చంపుతున్న ప్రక్రియ కాకపోతే మరేంటి? బయటకు కనిపించదు కానీ లోపల మాత్రం వలసదారుల గొంతులను నొక్కేస్తుంది. ఒకప్పుడు ఫ్రీ-స్పీచ్ కంట్రీగా చెప్పుకున్న అమెరికా.. ఇప్పుడు నీ ఆలోచన కూడా ప్రభుత్వానికి నచ్చాలనే స్థాయికి దిగజారడం అత్యంత బాధాకరం.
ALSO READ: 2 కారణాలు.. గాల్లో లక్షల ప్రాణాలు..సైంటిస్టుల షాకింగ్ స్టడీ!

Balochistan: బలూచిస్థాన్ రక్తపాతం.. పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. అసల కథేంటి?
Jeffrey Epstein Files: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్.. కొత్త లీక్‌లో బయటపడిన సంచలన విషయాలు..!
Donald Trump Tariffs: ట్రంప్ తలతిక్క పనులు.. అమెరికాకే ఎసరు..ఈ లెక్కలే సాక్ష్యం!
Careers: ట్రంప్ గారి నిర్వాకం.. అమెరికా వెళ్లాలంటేనే జంకుతున్న భారతీయులు!
భారత్, చైనాలపై ట్రంప్ ‘టారిఫ్’ అస్త్రం: అసలు లక్ష్యం ఉక్రెయిన్ యుద్ధమా లేక అమెరికా ఆధిపత్యమా?
అమెరికా టారిఫ్ దెబ్బ: భారత్ ఎగుమతులపై ప్రభావం, పర్యవసానాలు (The Impact of U.S. Tariffs on Indian Exports: Consequences and Effects)