ఈ దేశంలో 1843లోనే బానిసత్వాన్ని రద్దు చేస్తూ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం చట్టం చేసింది. నిజాం – దొరలు ఉన్న రోజుల్లో తెలంగాణలో వెట్టిచాకిరి నడిచింది..
కానీ స్వతంత్ర భారతంలో అందులో మన తెలుగు రాష్ట్రాల్లో బానిసత్వం బహిరంగంగా నడుస్తుంది. పైగా మేము బానిసలమని వాళ్లే గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ బానిసత్వాన్ని పెంచి పోషిస్తూ దీంట్లో దోపిడీ చేస్తున్న వాళ్ళలో రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, కొద్దిమంది క్రికెటర్లు ఉన్నారు. వీళ్లలో సినిమా ఇండస్ట్రీకి,అందులోను హీరోల బానిసలం అని చెప్పుకునే స్థాయికి నేటి యువత దిగజారిపోయింది. సగర్వంగా టిఎఫ్ఐ (Telugu Film Industry) కట్టు బానిస అని గర్వంగా చెప్పుకుంటున్నారు.
TFI kattu Banisa 🙂 pic.twitter.com/z3Ttau3yH9
— KAKASHI HATAKE 🦦 (@Jigz_Luffy) October 16, 2024
సినిమా కలెక్షన్లను కూడా బాధ్యతగా మార్చిన ప్రొడ్యూసర్లు:
దీన్ని ఆసరాగా తీసుకొని సినిమా వాళ్లు ఈ కట్టు బానిసల్నే కాకుండా సామాన్య సినీ ప్రేక్షకులను కూడా నిలువ దోపిడీ చేస్తున్నారు. ఈమధ్య జరిగిన వార్-2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ “గత సంవత్సరం దేవర సినిమా వసూలు చేసిన దాని కంటే పదింతలు ఎక్కువ వసూలు చేసి చూపించాలి. అన్న (జూ. ఎన్టీఆర్) పవర్ ఇండియా మొత్తం తెలియాలంటే హిందీలో సినిమా వసూలు చేసే దానికంటే ఒక్క రూపాయి ఎక్కువే వసూలు చేయాలి ఇది మీ బాధ్యత” అని అన్నారు.
View this post on Instagram
అంటే ఇక్కడ సినిమా ఎలా ఉన్నా పర్లేదు, గుడ్డిగా అందరం ఒరిజినల్ టికెట్ రేట్ మీద ఎంతో ఎక్కువ పెట్టి వెళ్లి వీరికి డబ్బు సమకూర్చాలి అది కూడా హిందీ ఆడియన్స్ కంటే ఒక రూపాయి ఎక్కువే ఇవ్వడం మన బాధ్యత అంట! వాళ్లు చేసుకున్న సినిమాకి మనం ఎందుకు బాధ్యత వహించాలో ఆ ప్రొడ్యూసర్ గారే చెప్పాలి. అసలు ఒక సినిమా కలెక్షన్లకు ప్రేక్షకులు అయినా అభిమానులైన ఎందుకు బాధ్యత వహించాలి? మీరు తీసిన సినిమా పైన అంత నమ్మకం ఉంటే ప్రేక్షకులు ఆటోమేటిక్ గా వస్తారు కదా.
పైగా ఉన్న రేట్లు సరిపోవు అంటూ సింగిల్ స్క్రీన్ నుండి మల్టీప్లెక్స్ వరకు టికెట్ రేట్లు పెంచుకుంటారు .ఈనెల 14న రిలీజ్ అయ్యే వార్2, కూలీ సినిమాలు రెండు కూడా డబ్బింగ్ సినిమాలే . అయినా కూడా మన దగ్గర టికెట్ హైక్ కోసం ముందు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గింది.ఏపీలో మల్టీప్లెక్స్ లో ₹100, సింగిల్ స్క్రీన్ లో ₹75 పెంచుకోవడానికి ఈ రెండు సినిమాలకు పర్మిషన్ ఇచ్చింది.ఇంత రేట్లను భరించి సామాన్య జనాలు ఎలా థియేటర్లకు వస్తారు?
అంతేకాదు ఈ దోపిడీ తెలుగు రాష్ట్రాల దగ్గర ఆగిపోలేదు. మన రాష్ట్రాల తర్వాత తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉండే యూఎస్ఏ లో కూడా బహిరంగ దోపిడీ జరుగుతుంది. ఒకే మల్టీప్లెక్స్ లో వార్ 2 హిందీ వెర్షన్ $18 ఉంటే, అదే సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ $28 ఉంది. కూలీ తమిళ వెర్షన్ మొదటి రోజు గరిష్టంగా $30 ఉంటే తెలుగు వెర్షన్ $25 ఉంది రెండవ రోజు నుండి గరిష్టంగా ఒకటే రేటు ఉంది ($25). దీన్ని ఏ విధంగా సమర్థించాలో అర్థం కావట్లేదు.
ఈ బానిసత్వంలో కళ్ళు మూసుకుపోయిన కొందరు అభిమానులు ఏమంటారు అంటే వాళ్ళు డబ్బులు పెట్టి తీసిన సినిమా. దాన్ని ఎంతగా చూపించాలో వాళ్ళ ఇష్టం నీకు నచ్చితే చూడు లేకపోతే లేదు అని ఏదో లాజిక్ గా సమాధానం ఇచ్చాం అనుకుంటారు. కానీ వీళ్ళకు తెలియందేంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాటోగ్రఫీ టికెట్లు రేట్ల నియంత్రణపై చట్టం అమల్లో ఉంది. దాని ప్రకారం ఎంత రేటు పెట్టాలి అనేది అలాగే పెంచుకునే వెసులుబాటుపై పూర్తిగా ప్రభుత్వానిదే నిర్ణయం. అంటే ఇక్కడ ప్రభుత్వాలే ఈ దోపిడిని ఓపెన్ గా ప్రోత్సహిస్తున్నాయి.
ఇక మీదట పెంచము అని ఒకరు మీకోసమే మేము పెంచాము అని ఇంకొకరు!!:
“టికెట్ రేట్లను మాకోసం పెంచండి. మేము వచ్చి సినిమా చూస్తాం” అని ఏ సగటు ప్రేక్షకుడైన అడుగుతాడా? కానీ మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అభిమానులు పవర్ స్టార్ అని పిలుచుకునే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తన సినిమా ఈవెంట్లో ఈ మాట అన్నారు. మరి ఎవరా ప్రేక్షకులో వారే చెప్పాలి. రాజు తలుచుకుంటే దెబ్బలకు ఏం కొదవ అన్నట్టు పవర్ లో ఉంటూ ఆయన సినిమా బెనిఫిట్ షోని ఓపెన్ గా ₹700, ఆ తర్వాత రెగ్యులర్ షోలో మల్టీప్లెక్స్ లో పెంచిన ధరకు అనుగుణంగా రాయల్ సీటింగ్ లో ₹. 495, ఎగ్జిక్యూటివ్ ₹.371 . సింగిల్ స్క్రీన్ థియేటర్లో బాల్కనీ ₹.250, ఫస్ట్ క్లాస్ ₹150గా ఏపీలో నిర్ణయించారు. (వీటికీ బుకింగ్ ఛార్జీలు అదనం).
ఏపీ ని మించిపోయి తెలంగాణలో మొదటి 4 రోజులు ఉన్న రేటుపై మల్టీప్లెక్స్ లో ₹200 గరిష్టంగా, సింగిల్ స్క్రీన్ లో ₹150గా నిర్ణయించారు. తర్వాత 7 రోజులకు మల్టీప్లెక్స్ లో ₹150, సింగిల్ స్క్రీన్ లో ₹106 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు.
తెలంగాణలో ఇంకో కథ:
ఇక గత సంవత్సరం పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా రచ్చ.. తదనంతరం జరిగిన విషయాలు మనం మర్చిపోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా అసెంబ్లీలోను ఇతర వేదికల పైన ఇకమీదట తెలంగాణ లో బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ హైకులు ఉండవు అని బహిరంగంగా ప్రకటించారు.

అయితే ఈ రూల్ దిల్ రాజు నిర్మించిన రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్, పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ముందు వరకే పరిమితం అయ్యింది. ఈ సినిమాలకు టికెట్ రేటు పెంపుతో పాటు బెనిఫిట్ షో సాలభ్యం కూడా కల్పించారు. హరిహర వీరమల్లు బెనిఫిట్ షో ను ₹600 పెట్టి నడిపించారు.
మాట ఇచ్చి తప్పడం ఏంటి సీఎం గారు?
మరి బెనిఫిట్ షోలు ఉండవు అని స్వయంగా అసెంబ్లీ సాక్షిగా సీఎం గారే ప్రకటించినప్పుడు, డబుల్ రేట్లతో బెనిఫిట్ షో తో కొన్ని సినిమాలకి టికెట్ల రేట్ల పెంపు, ఇప్పుడు బెనిఫిట్ షో కి అనుమతులు ఎలా వస్తున్నాయో, ఎవరి స్వలాభం కోసం పెంచుతున్నారో సగటు ప్రేక్షకుడికి తెలియాలి.
“₹1500 అఫోర్డబుల్ రేట్ లో సినిమాల కంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుతుందని” గతంలో ఒక తెలుగు ప్రొడ్యూసర్ అన్నారు. మరి వాళ్ళు తెలిసి అన్నారో తెలియక అన్నారో కానీ ₹1500 లో amazon prime, Netflix, Jio Hotstar వంటి ప్రముఖ ఓటీటీ ఆప్స్ లో నెల మొత్తం సబ్స్ట్రిప్షన్ తీసుకున్నా, ఇంకా కొంత డబ్బు మిగిలే ఉంటుంది. దాంతో బయట స్నాక్స్ కొనుక్కొని కుటుంబమంతా ఇంట్లోనే కూర్చుని ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు నచ్చిన సినిమాని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఎగ్జిబిషన్లు, చుట్టుపక్కల ఉండే టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లినా అంత డబ్బు కాదేమో. అయినా ఇలాంటి మాటలు మాట్లాడతారు.

ఇక్కడ సగటు కుటుంబం ఒక మల్టీప్లెక్స్ కి వెళ్తే ₹2000 కనీసం.. దీనికి టికెట్ రేటుకు మించి ఉన్న పాప్ కార్న్, కూల్ డ్రింక్ వాటర్ బాటిల్ రేట్లు అదనం. అంత ఖర్చు పెట్టుకొనే బదులు ఓటీటీ లో ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు కదా! అనే మైండ్ సెట్ కరోణ సందర్భంలో చాలామంది ప్రేక్షకుల్లో వచ్చేసింది. ఈ రేట్లు పైన జనాలు కూడా విమర్శించడం పెరిగింది.
రివ్యూలు కూడా చెప్పొద్దంటా.. ప్రేక్షకుడి జేబుకు మాత్రం చిల్లంట:
#Barbell exposing how producers exploit fans of each and every hero in Telugu.
— India Flick (@IndiaFlick) August 5, 2025
ఈమధ్య యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా లో చూసిన సినిమాకు రివ్యూ చెప్పడాన్ని కూడా సినిమా ప్రొడ్యూసర్లు తప్పుపడుతున్నారు. అవసరం అయితే కాపీరైట్లు ఇతర కేసులు పెట్టి వేధిస్తున్నారు. అవే పాత రొట్ట అసలైన కథలు పెట్టుకొని సినిమా తీస్తే రివ్యూలు చూసి ఆ సినిమాకు జనాలు పొవట్లేదని ఆవేదన చెందుతున్నారు. (కొన్ని సందర్భాల్లో కొన్ని వర్గాల వారు కావాలని సినిమాని బ్యాడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అది కాదనలేం.) అయితే ఇక్కడ రివ్యూ చెప్పే స్వేచ్ఛను కూడా వారు హరిస్తున్నారు. సినిమా బాగుంది అని చెబితే ఏ కాపీరైట్ స్ట్రైకులు ఉండవు. అలా కాకపోతే విమర్శిస్తే మాత్రం వేస్తున్నారు.
సినిమా రివ్యూల వల్ల ఒక సినిమా రిజల్ట్ పై ఆధారపడి ఉన్న వందలాది కుటుంబాలు, ఆ సినిమా నిర్మించిన వాళ్ళ కష్టం వృధా అవుతుంది కాబట్టి రివ్యూలు వెంటనే ఇవ్వకూడదు. అసలు ఈ రివ్యూస్ నే బ్యాన్ చేయాలి అని పలు సందర్భాల్లో కొంతమంది ప్రొడ్యూసర్లు అత్యుత్సాహం చూపించారు.
మరి వాళ్ల సినిమా కోసం కష్టపడ్డ వాళ్ల మీద అంత ప్రేమే ఉంటే అంతే కష్టపడి సంపాదించి సినిమా చూస్తున్న వాళ్ళ మీద ఎందుకు లేదు? అదే డబ్బు పెట్టి పాడైపోయిన ఆహారం కొంటే ‘దాని వెనుక ఎంతో మంది రైతులు కూలీల కష్టం ఉంది’ అని జాలి చూపించి పాడైన ఆహారం తింటామా? ఒక ప్రోడక్ట్ ని మనము డబ్బు పెట్టి వినియోగిస్తే దానిపై మన అభిప్రాయాన్ని చెప్పే పూర్తి హక్కు ఉంది. అదేవిధంగా సినిమా అనేది ఒక ప్రోడక్ట్ దానికి టికెట్ డబ్బులు చెల్లించి చూసి మన అభిప్రాయం చెప్తాం.
సినిమా పై అభిప్రాయం చెప్పే స్వేచ్ఛను హరించాలని చూస్తూ, అడ్డగోలు టికెట్ రేట్ల పై ప్రశ్నించకుండా, ప్రభుత్వ పాత్రను ఎండగట్టకుండా ఉంటే ఈ దోపిడిని ఇలానే కొనసాగిస్తారు. ఒక నటుడిని/నటిని తన ప్రతిభ ఆధారంగా అభిమానించడం వేరు కానీ వారిని గుడ్డిగా అనుసరించడం, వారి కోసం గొడవలు పెట్టుకోవడం, ఏమైనా చేస్తాం అనే లక్షణాలను కొందరు ఎంత తొందరగా పెడితే సమాజానికి అంత మంచిది. ఆ హీరోలు వీళ్ళ కోసం బ్రతకట్లేదు. వీళ్ళు ఇంత అభిమానిస్తున్నందుకుగాను వారికి డబ్బు కూడా ఏమీ రావట్లేదు. మన చదువుకు, ఉద్యోగానికి కూడా ఆర్థిక సాయం చేయట్లేదు. మన తల్లిదండ్రులు తమ రెక్కల కష్టంతో మనల్ని పోషిస్తున్నారు. సినిమా అనేది కేవలం ఆర్ట్ – బిజినెస్ కలబోసిన వ్యవస్థ. కమర్షియల్ సినిమాలైతే పూర్తిగా మన బలహీనతను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించే మార్గం. జనాలు అది గుర్తుపెట్టుకుంటే చాలు.
ALSO READ: అణచివేతల చీకట్లో నిలబడ్డ వెలుగులు.. ప్రేమకు పరిధులుంటాయా? ఇది వినిపించని గొంతుల గర్జన!

బిల్లా-రంగా ఎవరు? ఎలా నేరాల బాట పట్టారు? ఎలా అంతమయ్యారు?
Bangladesh: పుట్టిన బిడ్డను కూడా చూసుకోలేక నరకయాతన.. ఆ ముస్లిం దేశంలో చిక్కుకుతున్న ఆంధ్ర మత్స్యకారులు ఎందుకు తిరిగి రాలేకపోతున్నారు?
Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్ ప్రభుత్వానికి గుదిబండగా మారిందా? కీలక నిర్ణయం దిశగా CBN సర్కార్!
Scrub Typhus: ఏపీని భయపెడుతున్న స్క్రబ్ టైఫస్.. కంటికి చిక్కని ఈ వ్యాధి లక్షణాలేంటి?
Climatic Change: వాతావరణ మార్పులతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం..ఈ రాష్ట్రానికి ఏమైంది?
Mock Assembly: లోకేశ్ గారూ.. ఓ సారి నిజాలు మాట్లాడుకుందాం రండి! మీ తాత ఏం చేశారో ఒక్కసారి తెలుసుకోండి!