ప్రజాస్వామ్యంలో రాజకీయాలు అంటే మాటలే ప్రధాన ఆయుధం. హామీలు, విమర్శలు, వాదనలు, ఆరోపణలు… అన్నీ మాటల చుట్టూనే తిరుగుతాయి. కానీ ఈ మాటలే అబద్ధాలుగా మారితే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఇదే ఆలోచనతో వేల్స్‌లోని శాసనసభ ఒక కీలక నిర్ణయంపై చర్చ మొదలుపెట్టింది. రాజకీయ నాయకులు తెలిసీ ప్రజలను మోసం చేసే అబద్ధాలు చెబితే, వాటిని చట్టపరంగా నేరంగా పరిగణించాలా అన్న ప్రశ్న అక్కడ కేంద్రబిందువైంది. ఉద్దేశం మంచిదే. కానీ దాని ఫలితాలు ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
ఈ ప్రతిపాదన ప్రకారం, రాజకీయాల్లో చెప్పే ప్రతి మాటను అడ్డుకోవాలనే ఉద్దేశం లేదు. వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయ విమర్శలు, వ్యూహాత్మక హామీలు, లేదా ఒక విధానంపై భిన్న అభిప్రాయాలు – ఇవన్నీ ఫ్రీ స్పీచ్ పరిధిలోనే ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఒక నాయకుడు ఒక విషయం అబద్ధమని తెలిసీ, వాస్తవాల్ని వక్రీకరించి, ఓటర్లను ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో మాట్లాడితే మాత్రం అది నేరంగా మారాలన్న ఆలోచన ఉంది. వినడానికి ఇది చాలా న్యాయంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది.
సెనెడ్లోని కొందరు సభ్యులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం స్పష్టమైన హద్దులు లేకుండా అమలులోకి వస్తే, రాజకీయ నాయకులు మాట్లాడటానికే భయపడతారని వారు అంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి అంశానికి స్పష్టమైన ఆధారాలు ఉండవు. కొన్ని విషయాల్లో డేటా మారుతూ ఉంటుంది, గణాంకాలపై విభేదాలు ఉంటాయి, మరికొన్ని విషయాల్లో రాజకీయ నిర్ణయాలు అంచనాలు, అనుభవం ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మాట అబద్ధమా? లేక నిజాయితీగా చెప్పిన అభిప్రాయమా? అన్నది తేల్చడం చాలా కష్టం.
రాజకీయ చర్చలు అంటే ముందే రాసుకున్న స్క్రిప్ట్‌లు కాదు. తక్షణ పరిస్థితులకు స్పందించాలి. పూర్తి సమాచారం లేని సమయంలోనూ మాట చెప్పాల్సి వస్తుంది. ఒకే గణాంకాన్ని ఒకరు లాభంగా చూస్తారు, ఇంకొకరు నష్టంగా చూస్తారు. ఇవన్నీ రాజకీయ ప్రక్రియలో భాగమే. కానీ చట్టం చాలా అస్పష్టంగా ఉంటే, ఇవే తర్వాత “క్రిమినల్ అబద్ధాలు”గా ముద్రపడే ప్రమాదం ఉందని విమర్శకులు చెబుతున్నారు. దాంతో నాయకులు వివాదాస్పద అంశాలపై మౌనం పాటించే అవకాశం ఉంది. అది ప్రజాస్వామ్యానికి మంచిదా అన్నదే అసలు ప్రశ్న.
ఈ ప్రతిపాదనను అధ్యయనం చేసిన సెనెడ్ స్టాండర్డ్స్ కమిటీ కూడా ఇదే హెచ్చరిక చేసింది. కొత్తగా ఒక క్రిమినల్ నేరాన్ని సృష్టించడం వల్ల ప్రజల్లో రాజకీయాలపై నమ్మకం పెరుగుతుందని తమకు నమ్మకం లేదని కమిటీ స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ చట్టం వల్ల లాభాలకన్నా ప్రమాదాలు, అనుకోని దుష్పరిణామాలే ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న న్యాయవ్యవస్థపై మరింత భారం పడుతుందని, ఒక రాజకీయ వ్యాఖ్యను పూర్తిగా తప్పుడు వాస్తవమని నిరూపించడం చాలా క్లిష్టమని కూడా కమిటీ అభిప్రాయపడింది.
ఇంకో ముఖ్యమైన అంశం ఫ్రీ స్పీచ్. యూరోపియన్ హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 10 ప్రకారం, రాజకీయ నాయకులతో సహా ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది. రాజకీయ చర్చల్లో ఈ హక్కు మరింత కీలకం. ఈ హక్కు సంపూర్ణం కాకపోయినా, దానిపై పెట్టే ఆంక్షలు స్పష్టంగా నిర్వచించబడాలి, సమతుల్యంగా ఉండాలి, నిజంగా అవసరమైనవిగా ఉండాలి. కానీ రాజకీయ మాటలను లక్ష్యంగా చేసుకునే అస్పష్టమైన చట్టం వస్తే, అది న్యాయపరమైన సవాళ్లకు గురయ్యే అవకాశం ఉందని కమిటీ హెచ్చరించింది.
కఠిన ప్రమాణాలకు మద్దతు ఇచ్చేవాళ్లు కూడా ఒక విషయం ఒప్పుకుంటున్నారు. రాజకీయ నాయకులు నిజాయితీగా చేసిన పొరపాట్లు, గట్టిగా చెప్పిన అభిప్రాయాలు, లేదా ఎన్నికల వ్యూహంలో భాగంగా చేసిన వాదనలు.. ఇవన్నీ తర్వాత క్రిమినల్ అబద్ధాలుగా మారతాయేమో అన్న భయం కలిగితే, చర్చే చల్లబడిపోతుంది. అప్పుడు ప్రజాస్వామ్యం బలపడటం కాదు, బలహీనపడే ప్రమాదం ఉందని వాళ్లు కూడా అంగీకరిస్తున్నారు.
అయినా చట్టాన్ని సమర్థించే వారు మరో వాదన చేస్తున్నారు. సరైన నిర్వచనాలు, బలమైన భద్రతా నియమాలతో ఈ ప్రమాదాలను నియంత్రించవచ్చని వారు అంటున్నారు. ఈ చట్టం పూర్తిగా ఉద్దేశపూర్వకంగా, తెలిసీ చెప్పే వాస్తవ అబద్ధాలకే పరిమితం కావాలని, అభిప్రాయాలు, రాజకీయ మాటలు, భవిష్యత్ అంచనాలు దీనిలోకి రాకూడదని స్పష్టం చేస్తున్నారు. కానీ ఈ గీతను గీయడం మాటల్లో సులువు, అమలులో చాలా కష్టం.
ఉదాహరణకి ఆర్థిక గణాంకాలను తీసుకుంటే, ఒకే డేటాకు వేర్వేరు అర్థాలు ఉండొచ్చు. ఒక నాయకుడు ఆశావహంగా మాట్లాడితే అది అబద్ధమా? లేక రాజకీయ దృష్టికోణమా? అనిశ్చిత అంచనాలపై చేసిన హామీలు నేరాలవుతాయా? ఇలాంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేకపోతే, ఈ చట్టం రాజకీయ విభేదాల స్థలాన్ని కుదించే ప్రమాదం ఉంది.
అందుకే కొందరు నిపుణులు మరో మార్గాలను సూచిస్తున్నారు. క్రిమినల్ కోర్టులకంటే స్వతంత్ర సంస్థల పర్యవేక్షణలో వ్యవస్థలు ఉండాలనీ, శిక్షలకంటే తప్పులను సరిదిద్దడం, పారదర్శకత పెంచడంపైనే దృష్టి పెట్టాలనీ సూచిస్తున్నారు. అబద్ధాన్ని జైలుతో కాదు, నిజంతో ఎదుర్కోవాలన్నది వారి ఆలోచన.
మొత్తానికి ఇప్పుడు సెనెడ్ ముందు ఉన్న సవాలు చాలా సున్నితమైనది. ఉద్దేశపూర్వక మోసాన్ని అడ్డుకునేంత కఠినంగా, కానీ నిజాయితీగల రాజకీయ చర్చను కాపాడేంత సున్నితంగా ఉండే చట్టాన్ని తయారు చేయగలరా అన్నదే ప్రశ్న. ఈ సమతుల్యత సాధ్యమైతే వేల్స్ రాజకీయ నిజాయితీలో పయనీర్‌గా నిలవొచ్చు. లేదంటే తొందరపడి చట్టం చేసిన ఒక హెచ్చరిక కథగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది.
మరోవైపు ఇలాంటి చట్టమే గనక రేపు భారతదేశంలో తీసుకొస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్న ప్రశ్న తప్పక ఎదురవుతుంది. మన దేశంలో రాజకీయాలు మాటల మీదే నడుస్తాయి. ఎన్నికల హామీలు, ఆరోపణలు, గణాంకాల యుద్ధం, మీడియా చర్చలు… అన్నీ వేడి వేడి మాటలతోనే సాగుతాయి. కానీ ఇక్కడ కూడా అదే సమస్య. ఏది అబద్ధం? ఏది రాజకీయ అభిప్రాయం? ఏది వ్యూహాత్మక వాదన? అన్న గీతను ఎవరు గీయాలి?
భారతదేశంలో విభిన్నత ఎక్కువ. ఒకే విషయం మీద వేర్వేరు రాష్ట్రాల్లో, వేర్వేరు పార్టీల్లో, వేర్వేరు నిజాలు ప్రచారం అవుతాయి. ఆర్థిక గణాంకాల నుంచి జాతీయ భద్రత వరకూ చాలా అంశాల్లో పూర్తి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండదు. అలాంటి సందర్భాల్లో ఒక నాయకుడు చెప్పిన మాటను తర్వాత “క్రిమినల్ అబద్ధం”గా ముద్ర వేయగలిగితే, అది రాజకీయ ప్రత్యర్థులపై ఆయుధంగా మారే ప్రమాదం చాలా ఎక్కువ.
ఇక్కడ ఫ్రీ స్పీచ్ ప్రశ్న మరింత సున్నితమైనది. భారత ప్రజాస్వామ్యం వాదనల మీద, ప్రశ్నల మీద, ఘర్షణల మీద నిలబడింది. మాట్లాడటానికే భయపడే రాజకీయాలు వస్తే, అది అబద్ధాలను ఆపదు.. నిజాలనూ మౌనంలోకి నెట్టేస్తుంది. ప్రజలకు సరైన సమాచారం దొరకడం కాదు, వినిపించే మాటలే తగ్గిపోతాయి.
అయితే ఒక నిజం కూడా ఉంది. అబద్ధాలతో ఎన్నికలు గెలవడం, ప్రజలను ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం, భావోద్వేగాలను రెచ్చగొట్టడం.. ఇవన్నీ ప్రజాస్వామ్యానికి విషమే. కానీ దానికి పరిష్కారం జైలు శిక్షలేనా? లేక నిజాలను బలంగా బయట పెట్టే వ్యవస్థలేనా? స్వతంత్ర సంస్థలు, ఫ్యాక్ట్ చెకింగ్, పారదర్శకత, మీడియా బాధ్యత..ఇవే నిజంగా పనిచేసే ఆయుధాలా?
అందుకే భారతదేశంలో ఇలాంటి చట్టం వస్తే, అది అబద్ధాలపై యుద్ధం కంటే, మాటల స్వేచ్ఛపై పరీక్షగా మారే అవకాశం ఎక్కువ. చట్టం బలంగా ఉండాలి, కానీ దాని హద్దులు మరింత బలంగా ఉండాలి. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్న ప్రయత్నమే, దాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉంది.
చివరికి ప్రశ్న ఒక్కటే. అబద్ధాలను చట్టంతో శిక్షించాలా? లేదా నిజాన్ని ప్రజల చేతిలో పెట్టాలా?
ఈ ప్రశ్నకు మనం ఇచ్చే సమాధానమే రేపటి భారత ప్రజాస్వామ్య దిశను నిర్ణయిస్తుంది.
ALSO READ: ‘మా కుమారుడిని చనిపోనివ్వండి..’ సుప్రీంకోర్టు ముందుకు తల్లిదండ్రుల కన్నీటి కథ!
