Menu

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌ ప్రభుత్వానికి గుదిబండగా మారిందా? కీలక నిర్ణయం దిశగా CBN సర్కార్!

Lakshmi Aruna 2 months ago
visakhapatnam rushikonda beach villas

విశాఖ-రుషికొండలో ఉన్న భారీ ప్యాలెస్ భవితవ్యం ఏంటి? ఇప్పటి వరకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ నిర్మాణం.. ఇకపై ప్రభుత్వానికి భారం అవుతుందా? లేదా పర్యాటక రంగానికి ఆదాయ వనరుగా మారుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.

రుషికొండలో నిర్మించిన ఈ ప్యాలెస్‌ను గత జగన్ ప్రభుత్వం హయాంలో నిర్మించారు. అప్పట్లో ఇది అత్యంత వివాదాస్పద ప్రాజెక్ట్‌గా మారింది. ఇక నిర్మాణం పూర్తైన తర్వాత ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అయితే వినియోగంలోకి రాలేదు. ఇప్పుడు ఈ భవనాన్ని అలాగే ఉంచితే తమకు భారీ నష్టం తప్పనది ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో కేవలం ఈ ప్యాలెస్ నిర్వహణకే ప్రతి నెలా సుమారు 25 నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఎలాంటి ఉపయోగం లేకుండా ఇంత భారీ మొత్తం ఖర్చు అవుతుండటంపై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తోంది. ఇదే కారణంతో రుషికొండ ప్యాలెస్ భవిష్యత్తుపై క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ సమావేశానికి పర్యాటక శాఖ అధికారులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈ భవనాన్ని ఎలా వినియోగంలోకి తీసుకురావాలి ప్రజాధనంపై భారం తగ్గించే మార్గాలు ఏంటి? పర్యాటక రంగానికి ఎలా ఉపయోగపడుతుంది? అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో మరో ముఖ్య అంశం ఏంటంటే.. రుషికొండ ప్యాలెస్‌ నిర్వాహణ కోసం ప్రైవేట్ సంస్థలు ముందుకు రావడం. కొన్ని ప్రముఖ సంస్థలు ఈ ప్యాలెస్‌ను హోటల్, రిసార్ట్ లేదా కన్వెన్షన్ సెంటర్‌గా మార్చే అవకాశాలపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పబ్లిక్ – ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్ కూడా పరిశీలనలో ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇక దీనిని టూరిజం కోణంలో చూస్తే.. విశాఖపట్నం ఇప్పటికే టూరిజం హబ్‌గా మారుతోంది. ఇలాంటి సమయంలో రుషికొండ ప్యాలెస్‌ను సరైన విధంగా వినియోగిస్తే దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంది. రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక ఈ ప్యాలెస్ అంశం రాజకీయంగా కూడా సున్నితమైనదే. అందుకే ప్రభుత్వ నిర్ణయం పబ్లిక్ ఒపీనియన్‌ను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రజల డబ్బుతో నిర్మించిన కట్టడాన్ని ప్రజలకు ఉపయోగపడేలా మార్చడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకు ఈ ప్యాలెస్‌పై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. క్యాబినెట్ సబ్‌కమిటీ త్వరలో పూర్తి నివేదికను సిద్ధం చేసి ముఖ్యమంత్రి ముందు ఉంచనుంది. ఆ తర్వాతే రుషికొండ ప్యాలెస్ భవితవ్యం తేలనుంది. చూడాలి మరి.. వివాదాల ప్యాలెస్‌గా నిలిచిన రుషికొండ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయం తెచ్చే ఆస్తిగా మారుతుందో.. లేదా మరిన్ని రాజకీయ చర్చలకు దారి తీస్తుందో.

ALSO READ: లోకేశ్‌ గారూ.. ఓ సారి నిజాలు మాట్లాడుకుందాం రండి! మీ తాత ఏం చేశారో ఒక్కసారి తెలుసుకోండి!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *