Menu

Vijayawada Floods: కాళరాత్రి.. విజయవాడలో ఆ రోజు ఏం జరిగింది? ఈ విరద విపత్తుకు కారణం ఎవరు?

Tri Ten B
budameru flood

అది అర్థరాత్రి.. సమయం 12 గంటలు దాటింది.. ఇంట్లో ఓ చిన్నపాప బోరున ఏడుస్తోంది.. అంతా చిమ్మచీకటి.. కరెంట్ లేదు.. ఇళ్లంతా నీరు.. ఆ పాపకు ఏం జరుగుతుందో అర్థంకాలేదు.. ఇంతలోనే ఆ పాప తండ్రి రూమ్‌లోకి వచ్చాడు. ఏడుస్తున్న తన కూతురును ఇంటి బయటకు తీసుకెళ్లిపోయాడు. ఎక్కడ తలదాచుకోవాలో ఆ కుటుంబానికి తెలియని పరిస్థితి.. ఎందుకంటే బయట జోరు వాన.. రోడ్లన్ని అప్పటికే మునిగిపోయి ఉన్నాయి. ఇది విజయవాడ కాళరాత్రికి ఉదాహరణగా నిలిచిన ఓ భయంకర ఘటన. బెజవాడ గజగజ వణికిపోయిన ఆ రాత్రిని తలుచుకుంటూ ప్రజలు కన్నీరు పెడుతున్నారు.. వరద నీటిలో మునిగిపోయిన తమ ఇళ్లను చూసి తల్లడిల్లిపోతున్నారు.

పాములు.. పురుగులు..భయం భయం


ఆగస్టు 30 రాత్రి అంతా నిద్రలోకి జారుకున్న తర్వాత వరుణుడు సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ముందు నిదానంగా మొదలైన వాన.. నిమిషాల వ్యవధిలో ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు ప్రాంతాలు ఆ రాత్రే నీట మునిగాయి.. వారి ఇళ్లలోకి అప్పటికే నీరు వచ్చి చేరింది. అటు మిగిలిన వారు నిద్ర లేచి కళ్ళు తెరిచేలోగా.. ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలు కనిపించాయి. ఇంటి చుట్టూరా భారీగా నీరు నిలిచిపోయి ఉంది. టెర్రస్‌పై నుంచి చూస్తే అందులో పాములు తిరుగుతూ ఉన్నాయి.

తిండిలేక ఇబ్బందులు


వరద నీటి మట్టం పెరగడంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. ఇళ్లలోకి వచ్చిన పాములను చూసిన పిల్లలు వణికిపోయారు. అందులో చాలా మందికి భయంతో జ్వరం కూడా వచ్చింది. ఇక కింది అంతస్తుల్లో నివసించే ప్రజలు తమ భవనాల్లోని పై అంతస్తులకు వెళ్లిపోయారు. బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, కండ్రిక, గొల్లపూడి, సింగ్ నగర్, పాయకాపురం, నున్న సహా 17 వార్డుల్లోని 2 లక్షల 76 వేల మంది ప్రజలు నరకయాతన అనుభవించారు. కరెంటు, నీరు, తిండిలేక ఇళ్లలోనే చిక్కుకుపోయారు.

పొంగిపొర్లిన కాల్వలు


అజిత్‌సింగ్‌ నగర్‌ చుట్టు పక్కాల 10కి పైగా కాలనీలు నీటమునిగాయి. వర్షం తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ కుండపోత మొదలైంది. దీంతో బుడమేరు పొంగి పొర్లింది. అటు ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయానికి వెళ్లే ఘాట్‌ రోడ్డులో ప్రహరీ గోడ కూలిపోయింది. కాట్లేరు, బుడమేరుతో పాటు వగలేరు, పాముల, ఏదుళ్ల, పడమటి కాల్వలు పొంగి పొర్లడంతో వాటికి ఆనుకుని ఉన్న ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.

తెగిన కరకట్ట

విజయవాడలో ఒక్కరోజులో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 30 ఏళ్లలో ఒక్క రోజులో రికార్డయిన అత్యధిక వర్షపాతం. ఇది బుడమేరు నది పొంగిపొర్లడానికి కారణమైంది. దీంతో దాదాపు 40శాతం నగరం నీటిలో మునిగిపోయింది. నిజానికి ఆదివారం ఉదయం 10 గంటల వరకు పరిస్థితి కొంతమేరకు అదుపులో వచ్చింది. అయితే రాజరాజేశ్వరిపేట సమీపంలో కరకట్ట తెగిపోవడంతో లోతట్టు ప్రాంతాలకు వరదలు పోటెత్తాయి.
అటు అన్ని వాగుల నుంచి కృష్ణానదిలోకి భారీగా వరద విడుదలవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.

19ఏళ్ల పాటు ఏం చేసినట్టు?

ఇక 2005లో బుడమేరు నది ఉప్పొంగి విజయవాడలోని చాలా ప్రాంతాలను ముంచెత్తింది. నాటి ఘటనను నేటి వరద విలయంతో పోల్చుతున్నారు అధికారులు. నిజానికి 2005 విపత్తు కంటే ప్రస్తుత వరద రెండింతలు తీవ్రంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా 19 ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురవడానికి..ఈ 19ఏళ్లలో అధికారులు ఏ పాఠాలు నేర్చుకోకపోవడం విమర్శలకు కారణమౌతోంది. వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి ప్రూవ్‌ అయ్యింది.

ఇది కూడా చదవండి: 200ఏళ్ళ రికార్డు బద్దలు.. బెజవాడ గజ గజ… ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతమంటే?


Written By

1 Comment

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *