Menu

Vijayawada Flood Politics: కాసేపు మీ బురద రాజకీయాలు ఆపి నిజాలు మాట్లాడుకుందామా? విజయవాడ గ్రౌండ్‌ రియాలిటీ ఇదే!

Praja Dhwani Desk
vijayawada floods politics

శవ రాజకీయాలైనా, వరద రాజకీయాలైనా, బురద రాజకీయాలైనా ఏపీ పొలిటికల్‌ పార్టీలకు పెట్టింది పేరు! ఎలాంటి అంశాన్ని అయినా రాజకీయం చేయడం, అసలు సమస్యను పక్కదారి పట్టించడం ఏపీ నాయకులకే చెల్లుతుంది. విజయవాడ విలయవాడగా మారిన సమయంలోనూ ఇది నిరూపితమైంది. ఫొటోల కోసం ఫోజులిచ్చే సీఎం ఒకవైపు.. విజయవాడ మునిగిందని ఆనందించే జగన్ బలగాలు మరోవైపు..! ఈ రెండిటి మధ్య పేదల ఆకలి కేకలు వినిపించకుండా పోతున్నాయి. నాలుగైదు రోజుల నుంచి తిండి లేక అల్లాడిపోతున్న కుటుంబాలు విజయవాడలో వేలాల్లో ఉన్నాయి. చాలా కాలనీలకు తాగడానికి నీరు కూడా అందివ్వని చేతకాని, అసమర్థ ప్రభుత్వం ఇలాంటి సమయంలోనూ పబ్లిసిటీ కోసం పాకులాడుతుండడం అత్యంత దుర్మార్గం!

పేదలకు దక్కని బోటు సీటు

బోటులో ఎక్కాలా? రూ.3 వేలు ఇవ్వండి.. రూ.5 వేలు ఇవ్వండి.. రూ.10 వేలు ఇస్తేనే ఎక్కనిస్తాం.. ఇది విజయవాడ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని బోటు యజమానుల దోపిడి. ఆపత్కాలంలో సాయం చేయాల్సిన వారు నిలువు దోపిడి చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఇది శవాలపై చిల్లర ఏరుకోవడం కంటే తక్కువేమీ కాదు. ఎప్పుడు బిజినెస్‌ను బాగు చేసుకోవాలో ఏపీలోని చాలా మంది వ్యాపారులకు తెలియనిది కాదు. 2014కు ముందు రాష్ట్ర విభజన నిరసనల సమయంలోనూ ఈ తరహా వైఖరే కనిపించింది. దోచుకోవడం, దాచుకోవడం చాలా మంది వ్యాపారుస్తుల వక్రబుద్ధి. అందుకే వరద బురదకు భూమిలో ఇరుక్కున వాహనాలు తీయ్యాలంటే వేల రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తోంది. విజయవాడలో పేద మధ్యతరగతి ప్రజల బాధలు ఇవి.

ఇవేం కపపడవా?

అటు టోల్‌ గేట్‌ నిర్వాహకుల ఆగడాలు మరీ దారుణంగా ఉన్నాయి. కీసర టోల్‌ గేట్‌ దగ్గరలో రోడ్లు మొత్తం గుంటలే.. వరదలకు అత్యంత దారణంగా రోడ్డు మారింది. ఇలాంటి గుంట రోడ్డుపై ప్రయాణించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కనీసం సాయం చేయడానికి కూడా టోల్‌ గేట్‌ సిబ్బంది రాకపోగా ఫాస్టాగ్‌ పిండి మరీ డబ్బులు వసూలు చేస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది. మరోవైపు వరద నీటికి కొట్టుకుపోయిన వాహనాల్లో డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులు దొంగల పాలవుతున్నాయి. ఇదంతా ప్రభుత్వ పెద్దలు కోలువై ఉన్న నగరంలోనే జరుగుతోంది. అయినా ప్రభుత్వానికి ఏం కనపడదు, ఏం వినపడదు..!

ఇంత దయనీయ పరిస్థితికి కారణం ఎవరు?

ఆహారం అందక 5 రోజులుగా విజయవాడలోని అనేక కాలనీల ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం పంచుతున్న ఆహార పొట్లల కంటే స్వచ్ఛంద సంస్థలు పంచుతున్నవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా కాలనీల ప్రజల బాధను అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని ఏరియాల్లో అందిస్తున్న సాయాన్ని మాత్రమే చూపిస్తూ తామేదో గొప్పగా పని చేస్తున్నట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. కొన్ని ఏరియాల్లో ప్రజలకు ఆహార ప్యాకెట్లను హెలికాఫ్టర్‌ ద్వారా పై నుంచి విసురుతున్నారు. హెలికాఫ్టర్ నుంచి బురదలో పడిన ప్యాకెట్లనే ఏరుకోని ప్రజలు తినాల్సిన దయనీయ దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆహార పొట్లాలను వ్యాన్‌ నుంచి విసురుతుంటే బాధితులు వాటికోసం ఎగపడాల్సిన దారుణ దుస్థితి.

ఏది మారదు..భవిష్యత్తూ బురదమయమే

ఇంత సంక్షోభంలోనూ రాజకీయాలే సెంట్రిక్‌గా మారడం ఏపీ ప్రజల దురదృష్టం. దాదాపు 50ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ తడవని చంద్రబాబు ప్యాంటు తడిసింది.. ఎప్పుడు నలగని చంద్రబాబు చొక్కా నలిగింది.. ఇదంతా ప్రజల కోసమైతే పర్వాలేదు కానీ వరదల సమయంలో గతంలో ప్రతీసారి ఏరియల్‌ సర్వేలే చేసిన చంద్రబాబు ఈసారి నీళ్లలో దిగి ఫొటోలకు ఎందుకు ఫోజులు ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.. అసలు బుడమేరు సమస్య గురించి మాట్లాడేవారే లేరు. అంతా చంద్రబాబు, జగన్‌ చుట్టునే వరద రాజకీయం తిరుగుతోంది. బఫర్‌ జోన్‌లో వెలిసిన ఇళ్ల నిర్మాణాలు ఎవరివో ఎక్కడా చర్చ జరగడంలేదు. బుడమేరు నుంచి కృష్ణానదిలో కలవాల్సిన వరద నీటిని అడ్డుకుంటుందని అడ్డంగా కట్టిన ఏ రాజకీయ పార్టీ నేతల భవనాలో ప్రజలకు తెలియడంలేదు. ఎందుకంటే ఏపీ అంటేనే బురద రాజకీయం.. అది మారదు.. అక్కడి నేతలూ మారరు.. మరోసారి వరదొచ్చినా ఇలానే జరుగుతుంది.. తప్పంతా వరుణుడిదే అవుతుంది.. పాపమంతా ప్రకృతిదే అవుతుంది. ఇదే చరిత్ర.. ఇదే వర్తమానం.. ఇదే బెజవాడ బతుకుల భవిష్యత్‌!

Also Read: కాళరాత్రి.. విజయవాడలో ఆ రోజు ఏం జరిగింది? ఈ విరద విపత్తుకు కారణం ఎవరు?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *