Menu

Union Budget 2024: ఏపీకి ఇచ్చింది రుణమా..? గ్రాంటా…?

Praja Dhwani Desk
union budget 2024 andhrapradesh

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఇచ్చింది రుణమా..? గ్రాంటా…? రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడిదే హాట్‌ డిబెట్‌.. రాజధాని అమరావతికి కేంద్రం ఇచ్చింది లోన్‌ అని వైసీపీ వాదిస్తుండగా.. కాదు కాదు గ్రాంటేనని తెలుగుతమ్ముళ్లు, కమలనాథులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు, రానున్న సంవత్సరాల్లో అదనపు నిధులు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా చెప్పడం వరకు బాగానే ఉంది కానీ అసలు నిధులు ఇస్తానన్నది ఏ రూపంలోనన్నది క్లారిటీ లేకపోవడం పలు విమర్శలకు, గందరగోళానికి కారణమైంది. ఇంతకీ ఏపీకి కేంద్రం నుంచి దక్కేది రుణమా? గ్రాంటా?

కేంద్రమే చెల్లించుకుంటుందా?

నిజానికి టీడీపీ వర్గాలు సైతం కేంద్రం ఇచ్చింది గ్రాంటేనని బలగుద్ది చెప్పలేపోతున్నారు. అమరావతి నిర్మాణానికి రాష్ట్రానికి ఎలాంటి సాయం అందించాలనే ప్రస్తావన బడ్జెట్‌లో లేనేలేదు. ఇక బడ్జెట్‌ సెషన్‌ ముగిసిన తర్వాత జరిగిన మీడియా మీట్‌లోనూ నిర్మాల ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వని సమాధానం చెప్పరన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు లాంటి ఏజెన్సీల ద్వారా దీర్ఘకాలిక రుణాల మంజూరుకు కేంద్రం గ్యారెంటీగా నిలుస్తుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అంటే లోన్ ఇప్పించేది.. అది చెల్లించుకునేది కేంద్రమేనన్నది వారి మాట.

మంచి జరుగుతుందా?
కేంద్రమే రుణ సదుపాయం కల్పిస్తుంది కాబట్టి.. అప్పుతిరిగి చెల్లించే బాధ్యత కేంద్రంపై ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలో 15,000 కోట్లు రుణం రూపంలో లేదా సహాయం రూపంలో పొందడం మంచి ప్రారంభమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఈ 15 వేల కోట్ల రూపాయలు ఎంతగానో ఉపయోగపడతాయని టీడీపీ చెబుతోంది. అటు వైసీపీ వెర్షన్‌ మాత్రం వేరేలా ఉంది. రాజధానికి కేంద్రం బడ్జెట్‌ ద్వారా గ్రాంట్‌ రూపంలో కాకుండా రుణకల్పన వెసులుబాటు కల్పించడం దారుణమైన విషయమని మండిపడుతోంది. ఇది టీడీపీ చేతకానితనమేనని విమర్శిస్తోంది. పరిశ్రమల కల్పన, మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాల్సి ఉందని.. అది కూడా ఏజెన్సీల ద్వారా రుణాలు ఇవ్వడం వల్ల మంచి జరిగే అవకాశమే లేదని వాదిస్తోంది.

ఈ మాత్రం దానికి గొప్పలు ఎందుకు?

అటు అమరావతికి 15000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్ లో ప్రకటిస్తే టీడీపీ గొప్పలు చెప్పుకుంటుందం విడ్డూరంగా ఉందని వైసీపీ విమర్శిస్తోది. సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతోంది. మరోవైపు ఏజెన్సీలు గ్రాంట్లు ఇవ్వవని, అప్పులే ఇస్తాయంటున్నారు పలువురు విశ్లేషకులు. మరి అప్పే అయితే బడ్జెట్‌లో ఎందుకు పెడతారంటూ మరికొందరు వాదిస్తున్నారు. దీంతో అమరావతికి కేంద్రం ఇస్తామన్న రూ.15000 కోట్లు అప్పా.. లేదా గ్రాంటా అనే దానిపై చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

విభజన చట్టం ప్రకారం కేంద్రమే చెల్లించాలి:
అటు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేయాల్సి ఉందని నిర్మలా సీతారామన్ చెప్పడాన్ని టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రుణం మంజూరు చేయించి కేంద్రం ఎలా చెల్లిస్తుందో, అలాగే రాజధాని అమరావతి విషయంలోనూ కేంద్రం సహకరించాల్సి ఉంటుంది. అందుకే అమరావతికి ఇప్పించే 15 వేల కోట్లను కూడా కేంద్రమే చెల్లిస్తుందని టీడీపీ నేతలు అభిప్రాయడుతున్నారు.

2015లో నాటీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని ఏపీకి రాజధానిగా ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధికి వివిధ పనులకు గానూ రూ.9,000 కోట్లకు పైగా వెచ్చించారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులను ఏర్పాటు చేసింది. ఇక రాజధాని నిర్మాణ పనులకు కేంద్రం నిధులు ఇవ్వడం గతంలోనూ జరిగింది. నాడు టీడీపీ-బీజేపీ కూటమిగా ప్రభుత్వాన్ని నడుపుతున్న కాలంలో కేంద్రం అమరావతికి రూ.2,500 కోట్లు మంజూరు చేసింది. అయితే అందులో రూ.1,500 కోట్లే విడుదలయ్యాయి.

ఇది కూడా చదవండి: కులం మీద ‘కమ్మ’దనం ఎందుకు సీఎం సారూ.. ? ఈ అగ్రకుల భజనలు ఎవరి కోసం?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *