Menu

Fan Wars: అభిమానులా? పిచ్చిపట్టిన జనాలా? ఎవరి కోసం ఈ వెర్రితనం? తెలుగు యువత బానిసత్వం

Sumanth Thummala
tollywood fan wars

Tollywood Fan Wars: మా హీరోకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇంత గ్రాస్ ఉంది.. మా హీరో ఫస్ట్ డే కలెక్షన్స్ అంత బడ్జెట్ మీవాడి సినిమాలు ఉండవు నువ్వేంట్రా మాట్లాడేది. మా కులపోల్ల హీరో – హీరోయిజం ముందు అందరూ బలాదూరే! డై హార్డ్ ఫాన్స్ రా మేము.. మా హీరోనే అంటావా నీ అమ్మ,అక్క, చెల్లి,భార్య….. అని బూతుల పురాణం!
ఇది నేటి తెలుగు యువత సొషల్ మీడియాలో చేస్తున్న బాగోతం.


ఈమధ్య ట్రెండింగ్ మీమ్ ఒకటి నడిచింది. “మా కెరీర్ ఏమైపోయినా పర్లేదు, టి.ఎఫ్.ఐ(తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ) బాగుండాలి అని.‌” ఇది అతి ఫ్యాన్స్ ను ఉద్దేశించి చేసినదే అయినా, అనేక చోట్ల పరిస్థితి అలానే తగలడింది.‌

సినిమాలంటే ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఒక రిలీఫ్,కొందరికి అదో వ్యాపకం, మరికొందరికి అదే‌ జీవితం.. కానీ ఫాన్స్ అని చెప్పుకుతిరిగే‌ ఈ బ్యాచ్ లు మాత్రం మా జీవితం ఎటూ పోయినా పర్వాలేదు.‌ మా హీరో సినిమా ఆడాలి. అది చూసి మేము గర్వపడాలి.‌ ఇది వాళ్ళు చెప్పేది. దీని వల్ల దమ్మిడీ ఆదాయం లేకపోగా, ఇంట్లో డబ్బు తెచ్చి తన ఫేవరెట్ హీరో సినిమా ఆడాలి..అందునా బెనిఫిట్ షో, ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి తీరాల్సిందే. లేదంటే ఆసలైన ఫ్యాన్ కాదు. పొరపాటున అది అటుఇటు అయినా వాళ్ళ జీవితం కోల్పోయినట్లు బాధపడటం.

ఇంకాస్త బరితెగించి అసలు వాళ్ళ హీరో సినిమా నచ్చలేదు అని చెప్పిన వ్యక్తిని చితకబాదడం లేదా తన్నులాడుకోవడం. సోషల్ మీడియాలో అవతలి హీరో ఫోటోలను మార్ఫింగ్ చేసి ఏదో సాధించేశాం అని పనికిమాలిన పనులు చేయడం.‌

తాజాగా బెంగుళూరులో రెండు వర్గాల ఫ్యాన్స్ బహిరంగంగా కొట్టుకున్న విడియో వైరల్ అయ్యింది. ఇది చూసాక యువత పెడధోరని పడుతుందని ఆవేదన చెందుతున్నారు.

హీరో తన సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా తను సినిమాలు చేసుకుంటునే ఉంటాడు. కానీ అభిమానులు హిట్ అయితే వా వాళ్లకేదో లాభమైనట్టు సంబరాలు చేసుకుంటూ గర్వపడతారు. అదే సినిమా ఫ్లాప్ అయితే తల ఎత్తుకోలేకపోతున్నాం అంటూ, పరువు పోయిందంటూ అర్థంలేని ఆలోచనలతో నిండిపోయి ఉంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by India Today (@indiatoday)


ఈ ఫ్యాన్స్ చేసే అతివల్ల కొందరు ప్రేక్షకులు, థియేటర్ నిర్వాహకులు నష్టపోతున్నారు ఇంకొన్ని సందర్భాల్లో మన తెలుగు వాళ్ళ పరువే‌ పోతుంది. హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లలో అభిమానులు సినిమా చూస్తూ సీట్లు చించేయడం థియేటర్ మధ్యలో మంట పెట్టడం బాంబులు కాల్చడం, ఏకంగా స్క్రీన్ చించేయడం వంటివి జరిగాయి.

అమెరికా లాంటి దేశాల్లో బతుకుదెరువు కోసం పోయినా కూడా ఈ పిచ్చి వదల్లేదు. అక్కడ రిలీజ్ అయిన సినిమాలు ప్రదర్శిస్తున్నప్పుడు ఆ థియేటర్ నిర్వాహకులు వచ్చి వెర్రి అభిమానం ప్రదర్శిస్తున్న కొందరు ఫ్యాన్స్ కి హెచ్చరికలు కూడా జారీ చేశారు.‌ ఇక డల్లాస్ లో రెండు వర్గాల ఫ్యాన్స్ కేవలం వారి హీరో పాటలు పెట్టలేదని కొట్టుకోని అరెస్టు అయిన సందర్భం చూశాం. ఇలా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడమే కాకుండా, మన పరువును విదేశాల్లో కూడా పోగొడుతున్నారు.

ఇక్కడ హీరోల మధ్య ఏం గొడవ ఉండదు. ఒకవేళ ఉన్నా అది వాళ్ళ వ్యక్తిగతం. దానికి తమ జీవితం నాశనం చేసుకొని, కనీస విలువలను మర్చిపోయి,కొట్టుకోవడం, బూతులు తిట్టుకోవడం వల్ల ఎవరికి లాభం? ఏమన్నా అయితే ప్రతి విషయంలో హీరోలు అస్సలు రారు. వాళ్ళు అసలు పట్టించుకోరు కూడా! మధ్యలో బకరా అయ్యేది ఈ సో కాల్డ్ అభిమానులే.


పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో ఇతర హీరోలందరూ కూడా తనకు ఇష్టమైనవి నాకంటే మంచిగా పర్ఫామెన్స్ చేసేవాళ్ళు ఉన్నారని బహిరంగంగా పొగిడాడు. చిరంజీవి, నాగార్జున,రానా, ఎన్టీఆర్ అల్లు అర్జున్, వెంకటేష్, మహేష్ బాబు, బాలకృష్ణ.. ఇలా అందరూ అందరితో బాగా ఉండడం చూస్తూనే ఉన్నాం.

ఒక సినిమా ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో అభిమానులే నాశనం అయ్యేది. సినిమా యాక్టర్ల పర్ఫామెన్స్ ని చూసి అభిమానించడంలో తప్పులేదు.‌ కానీ అంతటితో వదిలేయకుండా, వీరాభిమానులు,డై హార్డ్ ఫాన్స్ పేరుతో అసలు వాళ్ళు ఉన్నారు అని తెలియని ఒక వ్యక్తి కోసం తిట్టుకోవడం, కొట్టుకోవడం, డబ్బు వృధా చేసుకోవడం వంటి విలువ లేని పనులను అనుసరించవద్దు.

Also Read: అతని ఆలోచనలో నుంచి పుట్టే ప్రతి దృశ్యం సుందర కావ్యమే..!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *