Menu

Language: ఆ భాష మాట్లాడే మనుషుల మీద సమాజం చిన్నచూపు.. ఎందుకిలా? ప్రతిభకు భాష కొలమానమా?

Lakshmi Aruna 2 months ago
is telugu speakers getting lesser

మనల్ని మనమే ఒక నిజమైన ప్రశ్న అడుగుదాం… మన జాతి గొప్ప, మన భాష గొప్ప అంటూ ప్రగల్భాలు పలికే మనం నిజంగా తెలుగు భాషను గౌరవిస్తున్నామా? నిజంగా మన భాషను హేళన చేసేది ఎవరు? బయటి వాళ్లా? లేదా మన తెలుగువాళ్లేనా?

చెన్నైలో తమిళం గర్వం.. మన దగ్గర ఎందుకు లేదు?

ఈ ప్రశ్న వినగానే కొంచెం కాళ్లు వణుకుతాయ్. ఎందుకంటే గాయం బయట కాదు.. లోపలే ఉంది. మీరు చెన్నైకి వెళ్లండి.. ఎవరైనా తమిళం మాట్లాడటానికి వెనకాడుతున్నారా? హోటల్‌లో, బస్‌లో, మెట్రోలో, స్టోర్‌లో..ఆత్మవిశ్వాసంగా, గర్వంగా వారి భాషను మాట్లాడుకుంటారు. ‘తమిళ్ నా మొళి’ అనేది వాళ్ల గుండెల్లో ఉన్న నిజమైన భావం.

ఢిల్లీలో హిందీ ధైర్యం.. మనకు ఎందుకుండదు?

ఢిల్లీ వెళ్ళండి..హిందీ మాట్లాడటంలో ఒక్కరికీ కూడా బెదురు లేదు. హిందీ రాకపోతేనే వాళ్లు నన్ను ‘arre, hindi nahi aata kya?’ అని అడుగుతారు. వాళ్లు తమ భాషను ఒక గుర్తింపు అని భావిస్తారు.

తెలుగువాళ్లే తెలుగును చిన్నచూపు చూడటం:

కానీ… మన తెలుగువాళ్లు? ఎక్కడో లోపల ఒక భయం, ఒక సంకోచం. తెలుగు మాట్లాడితే ‘లోకల్ అనుకుంటారు’, ఇంగ్లీష్ మాట్లాడితే ‘స్టాండర్డ్’ అని భావిస్తారు. భాష విలువను మాటలో చూసే మెంటాలిటీ ఇక్కడే కనిపిస్తుంది. ఇది చాలా బాధాకరం..కానీ ఇది నిజం..ఇది మనమే సృష్టించిన సమస్య.

భాష ప్రతిభ కాదు.. గుర్తింపు:

తెలుగు మాట్లాడితే చిన్న చూపు చూపేది బాహ్య ప్రపంచం కాదు.. రెండో తెలుగోడే..
హైదరాబాద్‌లో కూర్చొని ఇంగ్లీష్ లో మాట్లాడితే ‘వావ్’ అంటాడు. తెలుగులో మాట్లాడితే? ‘అయ్యా తెలుగులో ఎందుకు?’ అదే మాటను తమిళం లేదా హిందీలో మాట్లాడితే? ‘అరే అన్నా, నీకు తెలుగు రాదా?’ అని ప్రశ్నించరు.. ఎందుకు? ఎందుకంటే మనం భాషను ‘సామర్థ్యం’తో కలిపేశాం. తప్పుగా.

భాష అనేది ప్రతిభ కాదే..అది ఒక గౌరవం. ఒక అందం. మన మనుగడకు ఆధారం. మన ఆత్మలో ఉండే శబ్దం. మనమే మన భాషను చిన్నగా చూపితే… ఎవరు దానికి పెద్దతనమిస్తారు?

తరాల మధ్య తెలుగును కోల్పోయే ప్రమాదం:

ఒక్కసారి మనమే ఆలోచించాలి.
మన పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం?
ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పా? కాదు.
హిందీ మాట్లాడటం తప్పా? అసలు కాదు.
తమిళం, కన్నడ, ఏ భాషైనా నేర్చుకోండి. భాషలు జ్ఞానం. జ్ఞానం కోసం ఏదైనా నేర్చుకో…ఎలా అంటే అందర్నీ తల్లిలా చూడు…కానీ కన్నా తల్లి ఒక్కరే..తల్లికి గౌరవం ఇచ్చినట్టే… మన భాషకి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి.

మన భాషను మనమే కాపాడాలి..ఎవరూ కాదు

మీరు ఊహించండి.. ఒక రోజు మనం తెలుగులో మాట్లాడటం మానేస్తే? ఈ అక్షరాలు, ఈ శబ్దం, ఈ భావన, ఈ గొప్ప సాహిత్యం…ఎవరూ దానిని నిలబెట్టరు. ఒక తరం మానేస్తే…తరువాయి తరం తొలగిస్తుంది. తర్వాతి తరానికి తెలుగు ‘ఒక భాష’ కాదు.. ‘ఒక ఆప్షన్’ అవుతుంది. అదే మనం కోరుకున్న భవిష్యత్తా? మన భాషని ఎవరో రక్షిస్తారనే నమ్మకం లేదు. మన భాషని మనమే రక్షించాలి. ఈ రోజు నుంచి ఏదైనా మార్పు కావాలంటే.. చాలా చిన్న పని చేయండి.
తెలుగు మాట్లాడటం ప్రారంభించండి. సంకోచం లేకుండా..గర్వంగా..సూటిగా..భయం లేకుండా…ఎందుకంటే మన తల్లిని మనమే అగౌరవపరిస్తే…ఇంకెవరు విలువిస్తారు…మన భాష తల్లి కంటే గొప్పది.

ఒకసారి మీరే ఆలోచించుకోండి.. తమిళులే తమిళాన్ని కాపాడారు. హిందీలే హిందీని నిలబెట్టారు. మలయాళీలే మలయాళంని గర్వంగా మోశారు.

అయితే మరి తెలుగును ఎవరు కాపాడుతున్నారు?
మీరు, నేను.. మనం మాట్లాడిన ప్రతి మాటే భాషను బ్రతికిస్తుంది.

ఒక్క మాట గుర్తుంచుకోండి..
తెలుగంటే చిన్నతనం కాదు.
తెలుగును చిన్నచూపు చూడటం..
మన ఆలోచనల చిన్నతనం.
మన భాష మన గర్వం.
మన గౌరవం.
మన గుర్తింపు.
ఈ ఒక్క భావన మనలో పుడితే…
తెలుగు భాషను ప్రపంచంలో ఎవ్వరూ తక్కువ చెయ్యలేరు.

ALSO READ: లోకేశ్‌ గారూ.. ఓ సారి నిజాలు మాట్లాడుకుందాం రండి! మీ తాత ఏం చేశారో ఒక్కసారి తెలుసుకోండి!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *