ఇండియా(India)లో వాతావరణ(Weather) పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. ఈ వాతావరణ మార్పులు(Climate Change) ఒక్కసారిగా సంభవించలేదు. గత 20ఏళ్లుగా నెమ్మదిగా పెరిగిన వేడి, గత 10ఏళ్లుగా అస్థిరమైన వర్షాలు, చివరకు 2025కు చేరుకోగానే భూమి తన సహనాన్ని పూర్తిగా కోల్పోయింది. 2025లో జనవరి నుంచి సెప్టెంబరు వరకు 273 రోజుల్లో 270 రోజులు తీవ్ర వాతావరణ ఘటనలు జరిగాయి. అంటే 99 శాతం రోజులూ ప్రమాదాలతో నిండిపోయాయి. 2024లో 366 రోజుల్లో 322 రోజులు.. 2023లో 318 రోజులు.. 2022లో 314 రోజులు.. ఇవి ప్రకృతి భీకర రూపం దాల్చిన రోజులండి.!

భారీ వరదలతో టెన్షన్ (ప్రతీకాత్మక చిత్రం)
లెక్కలు ఏం చెబుతున్నాయ్?
1901 నుంచి లెక్కలు చూస్తే.. వాతావరణ రికార్డులలో 2025 జనవరి ఐదో అతి ఎండిన నెలగా నమోదైంది. 124 సంవత్సరాల్లో అత్యంత వేడి ఫిబ్రవరి 2025లో వచ్చేసింది. అదే సంవత్సరం సెప్టెంబరు నెల భారత చరిత్రలో ఏడో అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేసింది. శీతాకాలం వేడెక్కింది. వేసవి మండిపోయింది. ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చే గాలిలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి 1957నుంచి ఎప్పుడూ లేనంత ఎత్తుకి చేరింది. ఈ పెరుగుదల కేవలం గ్రహం వేడెక్కినట్టు కాకుండా, సముద్రాల ఉష్ణోగ్రతను, గాలుల దిశను, మేఘాల బరువును మార్చేసింది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న మేఘాలు ఇప్పుడు చీలిపోతున్నాయి. ఒకప్పుడు మృదువుగా ఉన్న గాలులు ఇప్పుడు గర్జిస్తున్నాయి. ఇది కేవలం ప్రకృతి కోపం కాదు. ఇది మనిషి నిర్మించిన భూతం.

వర్షాలు, వరదలతో ఇళ్లు నేలమట్టం (ప్రతీకాత్మక చిత్రం)
PC: PIXABAY
పంటలు నాశనమయ్యాయ్:
ఇక వాతావరణ విపత్తులతో 2025లో జనవరి నుంచి సెప్టెంబరు వరకు 4064 మంది మరణించారు. 94,70,000 హెక్టార్ల పంటలు నాశనమయ్యాయి. 99,933 ఇళ్లు పాడైపోయాయి. 58,982 జంతువులు మరణించాయి. ఈ దేశం కన్నీళ్లు ఇప్పుడు ఇప్పటికే లెక్కలలోకి మారిపోయాయి. ఇందులోనే అతి భయంకరమైన నిజం ఉంది. ఈ 4,064 మంది మరణాలలో 3,007 మంది కేవలం వర్షాకాలంలోనే మరణించారు. వర్షాకాలం ఒకప్పుడు పండుగ. ఇప్పుడు అది శత్రువు. సాయంత్రం పక్షుల కిలకిలలు వినిపించాలి. కాని ఇప్పుడు మబ్బుల గర్జనలే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు వర్షం పంటలకు జీవం ఇచ్చేది. ఇప్పుడు వర్షం ఇళ్లను కొట్టేసే ప్రళయం అయిపోయింది.
ALSO READ: షేక్.. షేకాడిస్తోంది.. నెల రోజుల్లో 1400 భూకంపాలు.. ఆ దేశానికి ఏమైంది?
భారతం అంతా ఇప్పుడు ఎక్కడ చూసినా తీవ్ర వర్షాలు. ఎక్కడ చూసినా పిడుగుల కేకలు. 15 రాష్ట్రాల్లో 100కు పైగా రోజులలో తీవ్రమైన వాతావరణం నమోదైంది. కేరళ, సిక్కిం, హిమాచల్, కర్ణాటక, గుజరాత్, ఒడిశా, జమ్ముకశ్మీర్, అనేక ప్రాంతాలు ఒకే ప్రశ్నతో బాధపడుతున్నాయి. ఎప్పుడు ఆగుతుంది ఈ ప్రకృతి తుఫాను. ప్రశ్న మాత్రమే ఉంది జవాబు లేదు.

నగరాలు ధ్వంసమవుతున్న వేళ (ప్రతీకాత్మక చిత్రం)
PC: PIXABAY
ఈ భయంకర వాతావరణ మార్పులేందుకు?
ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయో మనకు తెలుసు. మన ఊపిరి పీల్చే గాలి నెమ్మదిగా విషపూరితం అవుతోంది. ప్రతి సంవత్సరం బిలియన్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి వెళ్తోంది. సముద్రాలు వేడెక్కుతున్నాయి. హిమాలయ పర్వతాల మంచు కరుగుతోంది. నదులు తమ మార్గాలు మారుస్తున్నాయి. ప్రకృతి ఒక చీకటి భవిష్యత్తును మనకన్నా ముందే చూసింది. మనల్ని ఆ దిశలోకి లాగుతోంది. ఒకప్పుడు మనం అండగా చూసిన మాన్సూన్ ఇప్పుడు మన మీద పడుతున్న భారమైన శత్రువుగా మారింది.

భూమి ఎండిపోతోంది (ప్రతీకాత్మక చిత్రం)
PC: PIXABAY
భద్రతే ఉండదా?
ప్రతి సంవత్సరం వచ్చే తుఫాన్లు ఇప్పుడు మరింత బలంగా మారుతున్నాయి. సముద్రాల ఉష్ణోగ్రతలు పెరగడంతో వాటి శక్తి రెట్టింపు అవుతోంది. ఒకప్పుడు అరుదుగా వచ్చిన వర్షపు ఉధృతిని ఇప్పుడు ఏప్రిల్, మే నెలల్లో కూడా చూస్తున్నాం. ఒక్క రాత్రిలో కొన్ని ప్రాంతాల్లో వందల మిల్లీమీటర్ల వర్షం పడుతోంది. పల్లెలు నీటిలో మునుగుతున్నాయి. పట్టణాలు కొట్టుకుపోతున్నాయి. రైతులు తమ పంటలను కోల్పోతున్నారు. కుటుంబాలు తమ గృహాలను కోల్పోతున్నాయి. దేశం తన భద్రతను కోల్పోతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో భీకర వాతావరణ పరిస్థితులు:
ఇటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) విషయానికి వస్తే.. గత కొన్ని సంవత్సరాల్లో ఏపీ అనేక తీవ్రమైన వాతావరణ దెబ్బలు చూసింది. 2025లో మాత్రమే 484 మంది ఆంధ్రప్రదేశ్‌లో మరణించారు. ఒక్కరోజులో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడిన సందర్భాలు అనేకం. నదులు ఉప్పొంగాయి. విశాఖపట్నం తీరం వద్ద గాలుల వేగం గంటకు 110 కిలోమీటర్ల వరకు పెరిగింది. రైల్వే ట్రాక్‌లు మునిగిపోయాయి. చెట్లే కాదు విద్యుత్ స్తంభాలు కూడా నేలమట్టమయ్యాయి. రైతులు కోటి రూపాయల విలువైన పంటలను కోల్పోయారు. తీరప్రాంత గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఇది ఒక రాష్ట్రం అనుభవించాల్సిన బాధ కాదు. ఇది ఒక రాత్రిలో తుపాను రూపం దాల్చిన భీతికి పాఠం.
ALSO READ: 200ఏళ్ళ రికార్డు బద్దలు.. బెజవాడ గజ గజ… ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతమంటే?
ఇందులోనే పెద్ద ప్రశ్న ఏంటంటే మనం ఏం చేయాలి? మన అభివృద్ధి తీరును మార్చాలి. పొగలు కక్కే ఇంధనాలను తగ్గించాలి. అరణ్యాలు పెంచాలి. నదులను రక్షించాలి. గ్రామాలను, నగరాలను వర్షాలదారికి తగ్గట్టు నిర్మించాలి. ఈ పోరాటం ఒక్క దేశం పోరాటం కాదు. ఇది ప్రపంచం మొత్తం కలిసి నిలబడాల్సిన సమయం. లేకపోతే వచ్చే దశాబ్దం ఇవి కథలు కాదు చరిత్రలు కాదు ప్రత్యక్ష ప్రళయం.
భవిష్యత్తు ఇంకా పూర్తిగా చీకటిగా మారలేదని ఒక చిన్న ఆశ ఉంది. మనం మారితే ఆకాశం మారుతుంది. మనం రక్షిస్తే సముద్రాలు ప్రశాంతమవుతాయి. మనం జాగ్రత్తపడితే పిల్లలు భయపడకుండా పెరుగుతారు. ప్రకృతి మనం వినాలని కోరుకుంటోంది. ఆ స్వరం భయంకరంగా ఉన్నా ఆ స్వరమే మన రక్షణకు చివరి మార్గం.
ALSO READ: ఇథియెపియా అగ్నిపర్వత విస్ఫోటనం గురించి సంచలన నిజాలు.. శాటిలైట్ చిత్రాలు చెబుతున్నది ఏంటంటే?

Balochistan: బలూచిస్థాన్ రక్తపాతం.. పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. అసల కథేంటి?
బిల్లా-రంగా ఎవరు? ఎలా నేరాల బాట పట్టారు? ఎలా అంతమయ్యారు?
Bangladesh: పుట్టిన బిడ్డను కూడా చూసుకోలేక నరకయాతన.. ఆ ముస్లిం దేశంలో చిక్కుకుతున్న ఆంధ్ర మత్స్యకారులు ఎందుకు తిరిగి రాలేకపోతున్నారు?
Disasters in Asia: వీధిన పడ్డ బతుకులు.. ఆసియాపై పగబట్టిన ప్రకృతి.. లక్షలమంది బలి!
Scrub Typhus: ఏపీని భయపెడుతున్న స్క్రబ్ టైఫస్.. కంటికి చిక్కని ఈ వ్యాధి లక్షణాలేంటి?
Indonesia: మృత్యు ఒడిలోకి 313మంది..! ఆ దేశంలోనే వరదలు, భూకంపాలు ఎందుకు?