క్రికెట్ – సినిమా భారతదేశంలో ఈ రెండిటిని రెండు మతాలు అని అభివర్ణించే వాళ్ళు చాలామందే ఉన్నారు. మన ఎంటర్టైన్మెంట్ సంస్కృతిలో ఈ రెండు భాగమయ్యాయి.
క్రికెట్ ను కాసేపు పక్కన పెడదాం. సినిమా అనేది మన తెలుగు వాళ్లకు ఒక అలవాటు లాగా మారిపోయింది. మంచి సినిమా వచ్చింది అని తెలిస్తే చాలు థియేటర్ కు ఎగబడి వెళ్లి చూస్తాం. పండుగ సమయాల్లో కూడా థియేటర్లోనే ఉంటారు. ఇంక స్టార్ హీరోల సినిమాల రిలీజ్ అప్పుడు చెప్పక్కర్లేదు. కటౌట్లు, బ్యానర్లు, అభిమాన సంఘాలు, టికెట్ల కోసం ఘర్షణలు ఇలా థియేటర్లు మొత్తం కళకళలాడుతుంటాయి.ఇలాంటి థియేటర్లు ప్రస్తుతం సంవత్సరంలో చాలా భాగమే వెలవెలబోతున్నాయి. “తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కోవిడ్ అనంతరం ఎన్నో సింగిల్ స్క్రీన్ థియేటర్లు నడపడలేక మూతపడ్డాయి”. ఈ విషయాన్ని స్వయానా ప్రొడ్యూసర్,ఎస్వీసీ ధియేటర్లల ఓనర్ దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ప్రోడ్యూసర్లకు నయా ఆదాయం ఓటీటీ:
సినిమా ఇండస్ట్రీని, థియేటర్లను ఎప్పటి నుంచో వేధిస్తున్న ఒక పెద్ద సమస్య పైరసీ. ఎవరు ఎన్ని చర్యలు తీసుకున్నా పైరసీ ఏదో ఒక విధంగా జరుగుతూనే ఉంది. దీనివల్ల ఇండస్ట్రీ ప్రతి యేటా కొన్ని కోట్లు నష్టపోతుంది. అయితే కరోనా సమయంలో ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ కు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూడాల్సిన పరిస్థితి రావడంతో ఈ సంస్థలు కూడా భారీ ఎత్తున పెరిగిన సబ్స్క్రైబర్స్ తో లాభాలు సంపాదించాయి. పెరిగిన కస్టమర్స్ తో ఓటీటీ కంపెనీలు కూడా ప్రొడ్యూసర్స్ కి భారీ ధర చెల్లించే డిజిటల్ రైట్స్ ని కొనుక్కుంటున్నారు. సబ్స్క్రిప్షన్ రేట్లు కూడా అందుబాటులో ఉండడంతో జనాలు కూడా దీని వైపే మొగ్గు చూపారు. దాంతో ఆ సమయంలో పైరసీ కంటెంట్ ని చూసే వాళ్ళ సంఖ్య చాలా మేరకు తగ్గింది. దీనివల్ల ప్రొడ్యూసర్లు కూడా డిజిటల్ రైట్స్ పేరుతో మంచి ధరకు వాళ్ల సినిమాలను అమ్ముకుంటున్నారు.
తిరిగి లేస్తున్న పైరసీ సైట్లు:
అయితే గత రెండు సంవత్సరాలుగా మళ్లీ పైరసీ వెబ్ సైట్లను చూసేవాళ్ళ సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతుంది. దీనికి ఇటు ప్రొడ్యూసర్స్ అటు ఓటీటీ సంస్థల అత్యాశే కారణంగా కనిపిస్తుంది. ఇటీవల హైదరాబాద్ కమీషనరేట్ లో పైరసీ క్రిమినల్స్ పట్టుబడిన సందర్భంగా కమీషనర్ సి.వి ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం “2023లో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు రూ.22,400 కోట్లు, 2024లో తెలుగు పరిశ్రమకు రూ.3,700 కోట్లు పైరసీ వల్ల నష్టం వాటిల్లింది.”
ఒక భారీ బడ్జెట్ తెలుగు సినిమా రిలీజ్ అయితే సింగిల్ స్క్రీన్ బాల్కనీ లో ₹250 నుంచి ₹300 మల్టీప్లెక్స్ లో ₹400 నుండి ₹500 మొదటి 10 రోజులు వసూలు చేస్తున్నారు. అంత రేటు పెట్టి సగటు పేద,మధ్య తరగతి కుటుంబం సంవత్సరంలో ఎన్ని సినిమాలు చూడగలుగుతుంది?! పైగా ఇదే ధరతో అదే సినిమాను అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ లాంటి స్ట్రీమింగ్ ఆప్స్ లో చాలా రోజులు సబ్స్క్రిప్షన్ వస్తుంది. వాటిల్లో ఇంట్లోనే కూర్చొని ఎప్పుడు అంటే అప్పుడు నచ్చిన కంటెంట్ చూడోచ్చు. ఈ వెసులుబాటు జనాలకు బాగా నచ్చింది. దాంతో ప్రేక్షకులు సినిమాను రెండు రకాలుగా మార్చేశారు. థియేటర్లో చూడాల్సిన క్యాటగిరి ఒకటైతే, ఓటీటీలో వచ్చాక చూసుకోవచ్చులే అని అనుకునే క్యాటగిరి ఇంకొకటి. అందుకే కొందరు ప్రేక్షకులు థియేటర్ కి రావడమే మానేశారు. అంతంత రేట్లు పెట్టి యావరేజ్, రొటీన్ సినిమాలను స్క్రీన్ మీద చూడాలని ఆడియన్స్ అనుకోవట్లేదు. దీని ఎఫెక్ట్ స్టార్ హీరోలకు సైతం తప్పడం లేదు. కొన్ని సినిమాల తెలుగు వర్షన్ రేట్లతో పోలిస్తే మిగతా భాషల రేట్లు తక్కువగానే ఉంటున్నాయి. మరి ఇది ప్రేక్షకుడిని మోసం చేస్తున్నట్టే కదా అని ఫీల్ అయ్యే వాళ్ళూ ఉన్నారు!
ఓటీటీ ఒప్పందాలే కొంపముంచుతున్నాయా?
సినిమాకు జరుగుతున్న ఇంకో నష్టం ఓటీటీ సంస్థలతో ప్రొడ్యూసర్లు చేసుకునే ఒప్పందాలు. సినిమా రిలీజ్ అయిన నెల రెండు నెలల్లోనే ఆప్స్ లో ఎలాంటి సినిమా అయినా వచ్చేస్తున్నా యి. దాంతో “ఏముందిలే నెల రోజుల్లో సినిమా వచ్చేస్తది కదా!” అనే ధోరణితో కూడా ప్రేక్షకులు ఉంటున్నారు. హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయిన ఎన్నో రోజులకు గాను ఓటిటి లోకి రాదు. మంచి సినిమాలకు థియేటర్లలో లాంగ్ రన్ ఉంటుంది. ఇక్కడ మన సినిమాలకు మాత్రం రిలీజ్ అవ్వకముందే ఫ్యాన్సీ అమౌంట్ చూసి డిజిటల్ రైట్స్ ను ప్రొడ్యూసర్స్ అమ్మేస్తున్నారు. ఆ విధంగా వారే థియేటర్ కి రావాల్సిన ఆడియన్స్ ను ఆపేస్తున్నారు.
యూజర్స్ ను కోల్పోవడం, నష్టాలు ఎదురవటం:
ఓటిటి సంస్థలు ఇండియన్ మార్కెట్లోకి కాస్త లేటుగానే ఎంట్రీ ఇచ్చినా, అందుబాటులో ఉండే రేట్లతో మంచి కంటెంట్ ను అందిస్తూ బాగా బిజినెస్ చేసుకుంటున్నాయి. కానీ కాసులకు కక్కుర్తి పడి ఉన్న సబ్స్క్రైబర్లను దూరం చేసుకుంటున్నారు. 2020లో పైరసీ అత్యల్ప స్థాయికి చేరింది. అప్పుడు పైరసీ వెబ్సైట్లకు సుమారు 130 బిలియన్ల విజిట్స్ మాత్రమే .ఈ సమయంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ రికార్డ్ సంఖ్యలో కస్టమర్లను పొందాయి. అయితే కథ రెండు సంవత్సరాల్లో సీన్ మొత్తం మారిపోయింది. 2024 నాటికి పైరసీ సైట్లను వినియోగించే సంఖ్య పెరిగి 216 బిలియన్లకు చేరింది.
డిస్నీ హాట్ స్టార్ సంస్థ తమ కంపెనీ చరిత్రలోనే మొదటిసారి సబ్స్క్రైబర్లను కోల్పోయింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా నష్టాలను చవిచూసింది. హాట్ స్టార్ గత సంవత్సరం 2.3 మిలియన్ యూజర్స్ ను కోల్పోయింది.
ఇలా దూరం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి.
• ఒక్కసారిగా విపరీతంగా సబ్‌స్క్రైబ్ చేయడం పెంచడం.
• సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా అందులో యాడ్స్ రావడం. ఆ యాడ్స్ రాకుండా ఉండాలి అంటే మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి.
• ఈ రెండు కట్టినా కూడా మళ్లీ కొత్త సినిమాలను రెంట్ అనే పేరుతో అందుబాటులోకి రాకుండా ఆ రకంగా దోపిడి చేస్తున్నారు.
• ఒకప్పుడు ఫ్యామిలీలో ఫ్రెండ్స్ లో ఒక అకౌంట్ తీసుకుంటే, దాన్ని షేర్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అలా షేర్ చేసుకోవాలన్నా కూడా ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. సొంత కుటుంబంలో ఉన్న వ్యక్తి ఇంటికి దూరంగా ఉన్నా, ఓకే ఇంటర్నెట్ నెట్వర్క్ కింద లేకపోయినా కూడా అకౌంట్ షేర్ చేసుకోవడానికి వీలు లేదు ప్రతి 15 రోజులకు ఒకసారి లాగిన్ చేసుకోవాలి.
• పెరిగిన రేట్లతో అన్ని రకాల ఓటిటి సబ్స్క్రిప్షన్ కట్టడం అనేది కష్టమైపోయింది. దాంతో కొన్నిటికి కస్టమర్లు దూరం అవుతున్నారు. కేబుల్ టీవీ, డిటిహెచ్ కంటే చవకగా ఎంటర్టైన్మెంట్ ఇస్తామని వచ్చి, వాటికంటే ఎక్కువ రేట్లను వసూలు చేస్తున్నారు.
ఒక సినిమా ఒక ఓటీటీ లో పర్మనెంట్ గా ఉండట్లేదు. కొన్నిసార్లు మన దేశంలో చూడటానికి వీలు పడదు. అదే పైరసీ సైట్లలో ఎలాంటి కంటెంట్ అయినా, ఈ దేశంలో లో లభించకున్నా సరే అక్కడ కనిపిస్తాయి. అప్పుడే రిలీజ్ అయిన సినిమాల నుండి, మన దగ్గర బ్యాన్ చేసిన లేదా అందుబాటులో లేని సినిమాలు, సిరీస్ లు, డాక్యుమెంటరీలు, యానిమేలు ఇలా సమస్తం ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.
– ఒకప్పుడు సీడీలు,డివిడిలు నడిచిన కాలంలో మనం దాన్ని ఒక్కసారి కొనుక్కుంటే ఎన్నిసార్లు అయినా అది పాడయ్యే అంతవరకు చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రతిసారి సబ్స్క్రిప్షన్ ఉంటే తప్ప చూడలేం!
ఈ విషయాలు జనాలకు చాలా చిరాకును, ఇబ్బందిని కలిగిస్తున్నాయి. అందుకే పైరసీని మళ్లీ ఆదరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే పైరసీ ట్రాఫిక్‌లో భారత్ వాటా 8.12% ఉంది. దాదాపు 1,756 కోట్ల సార్లు భారతీయులు పైరసీ వెబ్సైట్లను చూసారు. ఈ సంఖ్యతో భారత్, అమెరికా (దాని గ్లోబల్ షేర్ 12%) తర్వాత, రెండవ అతిపెద్ద పైరసీ మూలంగా నిలిచింది అని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పైరసీ ట్రెండ్స్ ను పర్యవేక్షించే MUSO సంస్థ విడుదల చేసిన 2024 Piracy Trends and Insight Report చెబుతోంది.
ఇండస్ట్రీకి, కార్పోరేట్లకు సవాల్ విసురుతున్న పైరసీ
ఒకప్పుడు పైరసీ సైట్లు అంటే ఏది నిజమైన డౌన్లోడ్ ఆప్షనో, ఏది అడ్వర్టైజ్మెంట్ /మాల్వేర్ ఆప్షన్ అనే కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేసేది. అలా సినిమాను డౌన్లోడ్ చేసుకొని చూసేవాళ్ళు.
కానీ ఇప్పుడు పైరసీ సైట్లు, ఆప్ లు ప్రముఖ ఓటీటీ సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా తమ వెబ్సైట్ లేదా ఆప్ ఇంటర్ఫేస్ ను, యూజర్ ఎక్స్పీరియన్స్ ను మార్చేశాయి. డౌన్లోడ్ అవసరం లేకుండానే నేరుగా నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో మాదిరిగా స్క్రీన్ లో చూసుకునే సౌలభ్యం వచ్చేసింది.పైసా ఖర్చు లేకుండా సినిమాలను హెచ్ డి ప్రింట్ లో దించేస్తున్నాయి.
ఓ వైపు థియేటర్లలో టికెట్ ధరను చూసి, మరోవైపు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో లేని సబ్స్క్రిప్షన్ రేట్లు చూసి వీక్షకులు ముఖ్యంగా యువత ఈ పైరసీని ఆదరిస్తున్నారు. వెబ్‌సైట్స్, ఆప్స్ లో చాలా సులభంగా సినిమా దొరుకుతుంది. ఐ బొమ్మ, తమిళ్ రాకర్స్, టెలిగ్రాం ఛానెల్స్ లో ప్రతి సినిమా వచ్చేస్తున్నాయి.
ఈ సంస్కృతి ఇలానే కొనసాగితే సినిమా ఇండస్ట్రీ చాలా నష్టపోతుంది. అదే సినిమాను నమ్ముకుని ఉన్న వేలాది థియేటర్లు కూడా నష్టపోతారు. ఏ ఇండస్ట్రీలో జరగనట్టు ఇక్కడ మాత్రమే సినిమాలకు విపరీతమైన టికెట్ రేట్ పెట్టడం ఆపితే ప్రేక్షకులు థియేటర్లో చూసే సంఖ్య పెరుగుతుంది. ఓటిపి సంస్థలు కూడా వాటి సబ్స్క్రైబర్స్ ను కోల్పోకూడదు అంటే వినియోగదారుల ఎక్స్పీరియన్స్ ని కూడా కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి.
సినిమా అనే ఇండస్ట్రీని కాపాడుకోవాలి అంటే అది సినిమాతో వ్యాపారం చేసే వాళ్ల చేతిలోనే ఉంది ఆ వ్యవస్థ సరిగ్గా ఉన్నప్పుడు ప్రేక్షకులు తప్పనిసరిగా ఆదరిస్తారు.
ALSO READ: ఓ స్త్రీ.. నీ విలువెంత? ఈ ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెబుతారా?






Lakshmapur Elections: లగిశెట్టి మాధవి.. సామాన్యుల కోసం పనిచేసే జర్నలిస్ట్..! లక్ష్మాపూర్ ప్రజలకు మాధవి హామీ ఇదే!
బిల్లా-రంగా ఎవరు? ఎలా నేరాల బాట పట్టారు? ఎలా అంతమయ్యారు?
Bangladesh: పుట్టిన బిడ్డను కూడా చూసుకోలేక నరకయాతన.. ఆ ముస్లిం దేశంలో చిక్కుకుతున్న ఆంధ్ర మత్స్యకారులు ఎందుకు తిరిగి రాలేకపోతున్నారు?
Humanity: సికింద్రాబాద్‌లో మొదలైన జార్జ్ నిశ్శబ్ద విప్లవం.. ఆకలిని గౌరవంగా ఎదుర్కొన్న ఒక ఆలోచన!
Manikonda: మణికొండ కాదు అనకొండ, దోమల కొండ.. అధికారులు నిద్రపోతున్నారా? ఈ వాటర్ లీకేజీకి పరిష్కారం లేదా సార్?
Telangana Holiday Calendar: 2026లో 27 సెలవులు మాత్రమే.. తీవ్ర నిరాశలో ప్రజలు..!