Menu

Telugu Language Day: వ్యవహారిక భాషోద్యమ స్థాపక ఘనుడు.. తేట తేనియల తెల్లని పాల మీగడ ‘గిడుగు..’!

Sumanth Thummala
telugu language day

భాష ఎన్ని రకాలు ఉన్న మాతృభాష లో ఉన్న ఆత్మీయత అనుబంధం మరి ఎందులోనూ ఉండదు. ఇవాళ మనం తెలుగును చదువుతూ, అర్థం చేసుకోగలుగుతున్నాం కానీ 200 ఏళ్ళ క్రితం, కేవలం ఈ కొద్దిమంది పండితులకే అర్థమైన గ్రాంధిక తెలుగులో ఉండేది. ఎప్పుడో నన్నయ్య కాలం నుంచి ఈ భాష అలానే ఉంది. అయితే ఈ పరిస్థితిని మార్చింది, వ్యవహారిక భాషనే మాధ్యమాల్లో ఉండాలని పరితపించి భాషా ఉద్యమాన్నే చేసిన గొప్ప బహు భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి(Gidugu Venkata Ramamurthy) పంతులు (1863-1940) పుట్టినరోజు ఇవాళ. ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో జన్మించారు.

తన చిన్న వయసులోనే కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే ఆసక్తి ఏర్పడి దేవాలయ శాసనాలు పురాణాలు చదవటం మొదలుపెట్టారు. 1880 లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన గిడుగు,1911 వరకు ఆ వృత్తిలో కొనసాగారు.

ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడే, నాగరికతకు దూరంగా అడవుల్లో కొండల్లో ఒడిశా, శ్రీకాకుళం ప్రాంతాల్లో నివసిస్తున్న సవరుల జీవన స్థితిని చూసి, వారికి విద్యా బోధన నేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఆయన సవర భాషను నేర్చుకుంటూనే, వారి కోసమే ఒక పాఠశాలను నిర్మించారు. ఆయన అక్కడితో ఆగిపోలేదు వాళ్ళ కోసం ఇంగ్లీషు-సోర నిఘంటువునీ వెలువరించారు.

ఈ సవర భాష కోసం చేసిన కృషి సందర్భంలో, తెలుగు భాష గురించి కూడా ఆలోచించేలా చేసింది. తెలుగు భాష కేవలం కొద్ది మంది పండితుల మధ్య గ్రాంథిక భాషలో మిగిలిపోయింది. అది గమనించి, చదువులో పత్రికల్లో వాడుక భాష వాడాలని ఉద్యమం ప్రారంభించారు. దీనిపైన అనేక మందితో వాదన చేశారు. “ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము” అనే పుస్తకంలో పండితులే తప్పుగా రాసి అర్థం చేసుకునే భాష ఎవరికి ఉపయోగం అని విమర్శించాడు. 1912 లో A Memorandum of Modern Telugu వెలువరించి ప్రభుత్వానికి సమర్పించారు.

గురజాడ అప్పారావు(Gurajada Apparao), గిడుగు, శ్రీనివాస అయ్యంగారు వంటి వారు కలిసి తెలుగు భాష ఉద్యమానికి నాంది పలికారు. 1919-20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు ‘తెలుగు’ అనే మాసపత్రిక నడిపాడు. వ్యవహారిక భాషను ప్రతిఘటించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో (1925, తణుకులో) నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేసాడు .

అనాగరికమైన వ్యవహారిక భాషలో సాహిత్య రచన చేయటం పనికిరాదు అని అప్పట్లో పండితులు వాదించారు. ప్రాచీనమైన కావ్యాలకు వాడుక భాష వల్ల నష్టం చే కూరుతుందని అనేవారు. అయితే గిడుగు ఆ వాదన అంతటినీ తోసి పుచ్చి, వ్యవహారిక భాష సజీవ భాష అని, దానివల్ల ఎంతోమంది సమాజంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఘంటపదంగా చెప్పారు. ఉదాహరణగా: గురజాడ వారి కన్యాశుల్కాన్ని చెప్పవచ్చు.

అలా కొందరికే పరిమితమైన భాషను మరెందరికో చేరువ చేశారు. ఇవాళ మనం వాడుతున్న భాషకు ఊపిరి ఊదింది గిడుగు వారే.
అందుకే గిడుగు రామ్మూర్తిని “తెలుగు వ్యావహారిక బాషకు పితామహుడిగా” కీర్తింపబడ్డారు.

కేవలం భాష వేత్తగానే కాకుండా హేతువాదిగా సంఘసంస్కర్తగా, సమాజంలో ఉన్న అనేక లోతుల్ని ఎత్తి చూపారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు, వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. ఆయన 1940 జనవరి 22న కన్నుమూశారు.

Also Read: మూఢనమ్మకాలే సమాజపు వెనుకబాటుతనం.. అడ్డమైన ఆచారాలే మానవళికి అపార నష్టం!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *