Menu

తెలంగాణలో ఈ చోటు హాట్ ఫేవరెట్ గురూ! పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి రసవత్తర పోటీ.

Sumanth Thummala

అధికార కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంటు ఎలక్షన్స్ లో తెలంగాణలో ఈ జిల్లా హాట్ ఫేవరెట్ గా ఉంది పెద్దలు, వారి కుటుంబసభ్యులు ముఖ్య అనుచరులు ఎంపీ సీటు కోసం రసవత్తరంగా పోటీ ఉంది. అదే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి రెండు పార్లమెంటు సీట్లు.

కాంగ్రెస్ పెట్టని కోట!

కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోటగా ఉంది. రెండు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు గాను 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంతకుముందు ఉభయ పార్లమెంటు స్థానాలు కూడా కాంగ్రెస్ గెలిచింది.

ఈ తరుణంలో నల్లగొండ భువనగిరి పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్రమైన పోటీ ఉంది పార్టీ సీనియర్లు వారి అనుచరులు ఇలా అందరూ ఈ స్థానాల్లో పోటీ చేయడానికి టికెట్ల వేటలో ముందుకు వస్తున్నారు.

మహామహుల అడ్డా:

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుత క్యాబినెట్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి దామోదర్ రెడ్డి వంటి కాకలు తీరిన కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వీరిలో చాలామంది వాళ్ల కుటుంబానికి టికెట్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరే కాకుండా రేవంత్ రెడ్డి అనుచరులుగా ఉన్న నాయకులు కూడా ఉన్నారు.

ఈసారైనా రేవంత్ పంతం నెగ్గేనా?

గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా నాయకుల పంతంతో తన వర్గం వాళ్ళకి టికెట్లు ఇప్పించలేక పోయిన ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈసారైనా వారికి దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యాపేట నియోజకవర్గం నుండి టికెట్ ఆశించి భంగపడిన రేవంత్ అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డి నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుండి దరాఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధమై తర్వాత ఎంపీ టికెట్ హామీ మీద ఉపసంహరించుకున్నారు. దాంతో తనకే‌ టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక భువనగిరి నియోజకవర్గం నుండి మరో సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. పిసిసి ఉపాధ్యక్షుడు గా ఉన్న తను చాలా కాలంగా ఆ స్థానంలో ఎంపీ గా పోటీ చెయ్యాలని చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన మాట నెగ్గకపోయినా ముఖ్యమంత్రిగా తన వారికి సీట్లు తెచ్చుకుంటారో చూడాలి.


పెద్దలు జానారెడ్డి, వారి కుమారుడు;

నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గానికి సీనియర్ నేత కుందూరు జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్ ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లోనే అత్యంత సీనియర్ నేతల్లో ఒకరిగా, ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో పరిచయాలు, అలాగే రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం తో ఈ సీటు తమ ఖాతాలో వేసుకునేలా ప్రణాళికలు చేస్తున్నారు.‌ ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంత్రి పదవులు పొందారు. చివరి సారిగా 2014 లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. జానారెడ్డి ఇంకో కుమారుడు అయిన జైవీర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. మిర్యాలగూడ నుండి రఘువీర్ సీటు దక్కించుకోవాలని చూసినా అది సాధ్యపడలేదు. ఇప్పుడు తను లేదా తన కుమారుడు కి సీటు తెచ్చుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు జానారెడ్డి.

 

కోమటిరెడ్డి  కుటుంబ పట్టు:

రాష్ట్రంలో ముఖ్య నేతగా ఉన్న మరో కాంగ్రెస్ సీనియర్ ఆర్&బి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్లగొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల మీద కన్నేసారు.‌తన కూతురు శ్రీనిధి ఎంపీ టికెట్ నల్లగొండ నియోజకవర్గం నుండి దరాఖాస్తు చేసుకోగా,‌భువనగిరి నుండి తన సోదరుడు మోహన్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. వెంకటరెడ్డి చనిపోయిన తన కుమారుడు పేరు మీద పెట్టిన ట్రస్టు ద్వారా ఆయన కూతురు శ్రీనిధి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఎన్నికల సమయంలో తన తండ్రి కోసం ప్రచారం కూడా నిర్వహించారు.

ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్ నల్లగొండ జిల్లాలో ముఖ్యమైన నాయకులుగా చెలామణి అవుతున్నారు. ఎంపీ సీట్లు కూడా తెచ్చుకుంటే జిల్లా మీద పూర్తి పట్టు సాధించొచ్చు అని ప్రణాళికలు చేస్తున్నారు.


భువనగిరి నుండి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కూతురు కీర్తి, తీన్మార్ మల్లన్న (నవీన్ కుమార్) , చనగాని దయాకర్ కూడా టికెట్ ఆశావహుల్లో ఉన్నారు.

ఇలా పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ టికెట్ రేసులో ఎఐసిసి ఎవరి అవకాశం వస్తుందనేది మరి కొన్ని రోజుల్లో తెలియనుంది.


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *